బ్లాక్ మెయిల్ చేశాడని చంపేశాడు
చెన్నై: మహిళతో సన్నిహితంగా ఉన్న మిత్రుడిని సెల్‌ఫోన్‌లో చిత్రించి బ్లాక్‌మెయిల్ చేసి, డబ్బులు గుంజిన స్నేహితున్ని హతమార్చిన విద్యార్థి పోలీసులకు సంచలన వాంగ్మూలం ఇచ్చాడు. ధర్మపురి జిల్లా పాపిరెడ్డి పట్టి సమీపాన అన్భు(52)కు చెందిన అల్లుగడ్డల తోటలో హనుమన్ తీర్థంకు చెందిన గోపినాథ్(25) కొన్ని రోజుల క్రితం హత్యకు గురయ్యాడు. సమీపంలో అతని స్నేహితుడు విమల్(25) కూడా గాయంతో ప్రాణాలతో పోరాడ సాగాడు.
పళ్లిపట్టు పోలీసులు విచారణ జరిపి విమల్‌ను సేలం ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. పోలీసుల విచారణలో గోపినాథ్ హత్యలో తోట యజమాని అన్భు కుమారుడు అన్భుమణి(22)కి సంబంధం ఉన్నట్లు తెలిసింది. కోయంబత్తూరులో ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న అన్భుమణి ఈ సంఘటన తర్వాత అదృశ్యమయ్యాడు. అతన్ని సోమవారం ఆరూర్‌లో అరెస్టు చేసిన పోలీసులు అతని వద్ద విచారణ జరిపారు.
పోలీసులకు అతడు ఇచ్చిన వాంగ్మూలంలో గోపినాథ్ తన స్నేహితుడని ఇద్దరం కలిసి హనుమాన్ తీర్థంలో ఒక మహిళతో గడిపామన్నారు. తనకు తెలియకుండా గోపినాథ్ సెల్‌ఫోన్‌లో చిత్రీకరించాడని, అంతేకాకుండా ఆరు నెలలుగా తనను బెదిరిస్తూ డబ్బులు గుంజుతున్నాడని చెప్పారు. గత నెల 26వ తేదీ ఉదయం 11 గంటలకు గోపినాథ్ విమల్‌ను తీసుకొని మద్యం మత్తులో వచ్చాడన్నారు. ఆ సమయంలో గోపినాథ్, విమల్‌పై గడ్డపారతో అన్బుమణి దాడి చేసినట్లు తెలిపాడు. దీంతో అతడు స్పృహ తప్పాడన్నారు.
తండ్రి అన్భు ఆ సమయంలో అక్కడికి రాగా గోపినాథ్‌ను హతమార్చినట్టు తెలిపారు. ఇద్దరం కలిసి గోపినాథ్, విమల్‌ను తమ తోటలో విసిరేశామన్నారు. ఆ తర్వాత విమల్ పరిస్థితి ఏమైంది తెలియలేదన్నారు. అనంతరం తాను పరారయ్యానని ఆరూర్ బస్టాండ్‌లో పోలీసులు తనను అరెస్టు చేశారన్నారు. దీంతో హత్యకు సహకరించిన తండ్రి అన్భును పాపిరెడ్డి పట్టి పోలీసులు అరెస్టు చేశారు. వీరిని పాపిరెడ్డి పట్టి సెషన్స్ కోర్టులో హాజరు పరిచి సేలం జైలుకు తరలించారు.