
చనిపోయి... లేచి వచ్చాడు
స్నేహితుడిని జైలుకు పంపాలని కుట్ర
పథకం తారుమారై కటకటాల పాలైన వైనం
కేజీఎఫ్ : మరణించాడు అనుకున్న వ్యక్తి బతికి వచ్చాడు. తన స్నేహితుడిని జైలుకు పంపేందుకు వేసిన పథకం కొన్ని రోజులకే భగ్నం కావడంతో చివరకు కటకటాలపాలయ్యాడు. వివరాల్లోకి వెళితే... కేజీఎఫ్ పట్టణ సమీపంలోని తూకల్ గ్రామానికి చెందిన అరుణ్‌కుమార్‌రెడ్డి, రవీంద్ర మంచి స్నేహితులు. ఇద్దరూ కలిసి పలు సంవత్సరాలుగా వ్యాపారం చేసేవారు. వ్యాపారంలో నష్టం రావడంతో ఇద్దరి మధ్యన మనస్పర్థలు చోటు చేసుకున్నాయి. దీంతో ఇద్దరూ విడిపోయారు. రవీంద్రపై కోపంగా ఉన్న అరుణ్‌కుమార్‌రెడ్డి ఎలాగైనా అతన్ని జైలు పాలు చేయాలని భావించాడు. ఇందులో భాగంగా వెంకటాపురం గ్రామానికి చెందిన నాగరాజుతో కలిసి పథకం వేశాడు. ఇందులో భాగంగా వారం రోజుల క్రితం మరణించిన క్యాసంబళ్లి ఫిర్కా గాండ్లహళ్లి గ్రామానికి చెందని బ్యాటప్ప(46) వృతదేహాన్ని సమాధి నుంచి వెలికి తీసి, తన ద్విచక్ర వాహనంపై తీసుకుని తూకల్ గ్రామ సమీపంలోని కాలువలో పడేసి ముఖం గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి నిప్పంటించి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. తన సంబంధీకులతో ఆ వృతదేహం తనదేనని ప్రచారం కూడా చేయించాడు. ఘటనా స్థలంలో తన మొబైల్, బైక్‌ను పడేసి వెళ్లడంతో అరుణ్‌కుమార్ రెడ్డి హత్యకావింపబడ్డాడు అని అందరూ భావించారు. ఈ విషయాన్ని నమ్మిన అరుణ్‌కుమార్ రెడ్డి తల్లిదండ్రులు సైతం కంగుతిన్నారు.
తమ కుమారుడిని హతమార్చిన వారిని కఠినంగా శిక్షించాలని వారు పోలీసులను వేడుకున్నారు. ఈ నేపథ్యంలోనే బ్యాటప్ప కుటుంబీకులు సమాధి వద్ద పాలు పోసేందుకు వెళ్లిన సమయంలో సమాధిలో నుంచి వృతదేహాన్ని వెలికి తీసినట్లు గుర్తించి కేజీఎఫ్‌లోని అండర్‌సన్ పేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై ఎస్పీ భగవాన్‌దాస్ వెంటనే ప్రత్యేక ృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు చేయించారు. దీంతో అసలు విషయం బట్టబయలైంది. చనిపోయినట్లు నమ్మించేందుకు ప్రయత్నించిన అరుణ్‌కుమార్‌రెడ్డితో పాటు ఆయనకు సహకరించిన నాగరాజును పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. తన స్నేహితుడిని జైలుకు పంపాలని మాస్టర్ ప్లాన్ వేసిన వ్యక్తి చివరికి తానే ఊచలు లెక్కపెట్టాల్సి రావడం విధి లిఖితమే మరి.