9,500 లైన్‌మైన్ పోస్టుల భర్తీ
మంత్రి డీకే శివకుమార్
సాక్షి, బెంగళూరు : ఇంధన శాఖలో 9,500 లైన్‌మైన్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. పోస్టుల భర్తీలో పారదర్శకతను అమలు చేయడానికి వీలుగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించామన్నారు. కర్ణాటక విద్యుత్ మండలి రూపొందించిన నూతన సంవత్సరం డైరీ, క్యాలండర్‌ను బెంగళూరులో ఆదివారం ఆవిష్కరించిన ఆయన మాట్లాడారు.
ఇంధనశాఖలో క్షేత్రస్థాయి ఉద్యోగాలైన లైన్‌మైన్ పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఖాళీగా ఉండటం వల్ల తాగు, సాగునీటికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోందన్నారు. సమస్య పరిష్కారం కోసం త్వరలో 9,500 లైన్‌మైన్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అక్రమాలకు తావులేకుండా నియామకాలు చేపడుతామన్నారు. అందువల్ల నిరుద్యోగులు దళారులను నమ్మి మోసపోకూడదని సూచించారు. లైన్‌మైన్ పోస్టులతో పాటు ఇంధన శాఖలో ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేస్తామని తెలిపారు.
రాష్ట్రంలో విద్యుత్ చోరీ పెరుగుతోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక ఇంజనీర్లు ప్రత్యేక దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలన్నారు. నిరంతర జ్యోతి విద్యుత్ పథకంలో అవకతవకలు జరిగినట్లు తేలితే ఇందుకు స్థానిక డివిజనల్ ఇంజనీర్‌ను బాధ్యుడిని చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కర్ణాటక విద్యుత్ మండలి అధ్యక్షుడు వెంటకట శివారెడ్డి, కేపీటీసీఎల్ డెరైక్టర్ ఎస్ సుమంత్, బెస్కాం డెరైక్టర్ హెచ్ నాగేశ్ తదితరలు పాల్గొన్నారు.