Minister DK Shivakumar
-
నీటి సమస్య తీర్చండి
బడ్జెట్లో నిధులు కేటాయించండి ఇంటింటా మరుగుదొడ్డి నిర్మాణానికి నిధులు పెంచండి బళ్లారి మహా నగర పాలికె సమావేశంలో కార్పొరేటర్లు విజ్ఞప్తి సాక్షి, బళ్లారి : బళ్లారి నగరంలో వేసవిలో మంచినీటి సమస్య తీర్చడంపై బడ్జెట్లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు న నగర ప్రముఖులతో పాటు నగరంలోని కార్పొరేటర్లు పేర్కొన్నారు. శుక్రవారం బళ్లారి నగరంలో మహానగర పాలికె ఆధ్వర్యంలో బడ్జెట్‌పై ముందస్తు సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 11న బళ్లారి నగరాభివృద్ధి కోసం బడ్జెట్‌పై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మహానగర పాలికె మేయర్ నాగమ్మ, ఇన్‌ఛార్జి కమిషనర్ విజయ మహాంతేష్ దానమ్మనవర్లు పలువురు ప్రముఖులు, కార్పొరేటర్ల నుంచి సలహాలు సూచన లు తీసుకున్నారు. బడ్జెట్లో ఏయే అభివృద్ధి పనులకు, సమస్యలు తీర్చడానికి నిధులు కేటాయించాలనే దాని గురించి చర్చ ఏర్పాటు చేయగా, నగర సమస్యలపై ప్రతి ఒక్కరూ గళం విప్పారు. నగరంలో 35 వార్డులలోను మంచినీటి సమస్య తీవ్రమైందని సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు. 1వ వార్డు కార్పొరేటర్ మోత్కూరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... బళ్లారి నగరంలో 24 గంటల పాటు మంచినీటి సరఫరా చేస్తామని మంత్రి డీకే శివకుమార్ హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకుని నగర వాసులకు నీటి కష్టాలు తీర్చాలన్నారు. కప్పగల్, సిరివార, సంగనకల్లు గ్రామాలకు మంచినీరు నిరంతరం సరఫరా చేస్తున్నారని, అదే సందర్భంగా అక్కడ నుంచి వచ్చే నీటిని పొదుపు చేస్తూ నగర వాసులకు నీటి సమస్య తీర్చాలన్నారు. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ కింద ఇంటింటా మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.10 వేలు మాత్రమే కేటాయిస్తున్నారని, ఆ మొత్తం సరిపోవడం లేదని, మరో రూ.5 వేలు మహానగర పాలికె కింద పేదల కోసం కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. యువసేన సోషల్ యాక్షన్ క్లబ్ అధ్యక్షుడు మేకల ఈశ్వరరెడ్డి, స్థానికులు శ్రీనివాసమూర్తి తదితరులు మాట్లాడుతూ... బళ్లారి నగరంలో మంచినీటి సమస్య తీర్చడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ఇంటింటా చెత్త సేకరణ సక్రమంగా చేపట్టడం లేదని, పందులు స్వైర విహారం చేస్తున్నాయని సమావేశం దృష్టికి తీసుకుని వచ్చారు. పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ నగరంలో మంచినీటి సమస్య ఉన్న వార్డులో ట్యాంకర్లతో ఎప్పటికప్పుడు నీటి సమస్య తీర్చడానికి కృషి చేయాలని, అందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తే సమస్య తీరుతుందన్నారు. కార్యక్రమంలో మేయర్ నాగమ్మ, ఉపమేయర్ మాలన్‌బీ, సిటీ కార్పొరేషన్ ఇన్చార్జి కమిషనర్ విజయ మహాంతేష్ దానమ్మనవర్ తదితరులు పాల్గొన్నారు. -
9,500 లైన్‌మైన్ పోస్టుల భర్తీ
మంత్రి డీకే శివకుమార్ సాక్షి, బెంగళూరు : ఇంధన శాఖలో 9,500 లైన్‌మైన్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. పోస్టుల భర్తీలో పారదర్శకతను అమలు చేయడానికి వీలుగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించామన్నారు. కర్ణాటక విద్యుత్ మండలి రూపొందించిన నూతన సంవత్సరం డైరీ, క్యాలండర్‌ను బెంగళూరులో ఆదివారం ఆవిష్కరించిన ఆయన మాట్లాడారు. ఇంధనశాఖలో క్షేత్రస్థాయి ఉద్యోగాలైన లైన్‌మైన్ పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఖాళీగా ఉండటం వల్ల తాగు, సాగునీటికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోందన్నారు. సమస్య పరిష్కారం కోసం త్వరలో 9,500 లైన్‌మైన్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అక్రమాలకు తావులేకుండా నియామకాలు చేపడుతామన్నారు. అందువల్ల నిరుద్యోగులు దళారులను నమ్మి మోసపోకూడదని సూచించారు. లైన్‌మైన్ పోస్టులతో పాటు ఇంధన శాఖలో ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ చోరీ పెరుగుతోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక ఇంజనీర్లు ప్రత్యేక దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలన్నారు. నిరంతర జ్యోతి విద్యుత్ పథకంలో అవకతవకలు జరిగినట్లు తేలితే ఇందుకు స్థానిక డివిజనల్ ఇంజనీర్‌ను బాధ్యుడిని చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కర్ణాటక విద్యుత్ మండలి అధ్యక్షుడు వెంటకట శివారెడ్డి, కేపీటీసీఎల్ డెరైక్టర్ ఎస్ సుమంత్, బెస్కాం డెరైక్టర్ హెచ్ నాగేశ్ తదితరలు పాల్గొన్నారు. -
సాక్ష్యాలున్నాయ్
డీకే అవినీతికి సంబంధించిన ఆధారాలను త్వరలో బయటపెడతాం ‘బెళగావి’ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం 9న సువర్ణసౌధను ముట్టడిస్తాం సీఎం సిద్ధుతో కుమారస్వామి కుమ్మక్కు 25న సుపరిపాలనా రోజుగా వాజ్‌పేయి జన్మదినోత్సవం బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి బెంగళూరు : రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డీకే శివకుమార్ తన శాఖలో అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఇందుకు సంబంధించిన ఆధారాలను త్వరలోనే బయటపెడతామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి తెలిపారు. బుధవారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఇంధన శాఖలో అవినీతి జరిగిన విషయం ఇటీవలే బయటికి వచ్చిందని, ఇందుకు సంబంధించిన ఆధారాలను సైతం తాము సేకరించామని చెప్పారు. వీటిని త్వరలోనే బయటపెడతామని తెలిపారు. ఇక రాష్ట్ర మంత్రులు చేసిన అవినీతి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయని, బెళగావిలో నిర్వహించనున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఈ విషయంపై నిలదీస్తామని చెప్పారు. అంతేకాక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈనెల 9న సువర్ణసౌధను సైతం ముట్టడిస్తామని పేర్కొన్నారు. తమ పోరాటాలను అణచివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని, అయితే వీటికి తామెంతమాత్రం భయపడబోమని అన్నారు. ఇక రాష్ట్రంలో తమ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఈ అసెంబ్లీ సమావేశాల్లో సైతం ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేందుకు ఒప్పుకున్నారని విమర్శించారు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయని, మంత్రి అంబరీష్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బహిరంగంగానే విమర్శలకు దిగడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఇక ఈనెల 25న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినాన్ని సుపరిపాలనా దినంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు. -
ప్రైవేట్ కంపెనీతో మంత్రి డీకే కుమ్మక్కు
మాజీ సీఎం కుమారస్వామి జాతీయ రహదారిని నిర్బంధించిన గోరూరు గ్రామస్తులు బెంగళూరు: మంత్రి డీకే శివకుమార్ ఒక ప్రైవేట్ కంపెనీలతో కుమ్మక్కై గోరూరు ప్రాంతంలో చెత్త డంపింగ్ చేయడానికి యత్నాలు చేస్తున్నారని మాజీ సీఎం, జేడీఎస్ పార్టీ అధ్యక్షుడు కుమారస్వామి ఆరోపించారు. శనివారం ఆయన గోరూరు గ్రామస్తులు జాతీయ రహదారి నిర్బంధించిన విషయం తెలుసుకుని అక్కడి చేరుకుని మాట్లాడారు. ఇక్కడ డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేస్తే ఈ పరిసర ప్రాంతాలలో నివాసం ఉంటున్న గ్రామస్తులు ఆనారోగ్యాలకు గురి అవుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటు చేయకూడదని శుక్రవారం శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్న మహిళలు, వృద్ధులు, పిల్లలపై పోలీసులు లాఠీచార్జ్ చేసి ప్రతాపం చూపించారని మండిపడ్డారు. మహిళలపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారని తెలుసుకున్న ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే వెంటనే ఈ గ్రామస్తులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇదే సందర్బంలో స్థానిక గ్రామస్తులు జాతీయ రహదారిపై రెండు గంటల పాటు ధర్నా చేసి రాష్ట్ర మంత్రి డి.కే. శివకుమార్ దిష్టిబొమ్మ దగ్దం చేసి నిరసన వ్యక్తం చేశారు. ప్రాణాలు పోయినా ఇక్కడ చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటు చెయ్యడానికి అంగీకరించమని మాగడి తాలుకాలోని పలు ప్రాంతాలలో ఉన్న గ్రామస్తులు తేల్చి చెప్పారు. ధర్నాలో బండేమఠాధిపతి బసవలింగస్వామీజి, మహంతేషస్వామీజి, చిలుమమఠస్వామీజి, శాసన సభ్యుడు డాక్టర్ శ్రీనివాసమూర్తి, ఎంఎల్సీ, కన్నడ సినీ నిర్మాత ఇ. కృష్ణప్ప, స్థానిక జేడీఎస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండ పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.