నీటి సమస్య తీర్చండి
బడ్జెట్‌లో నిధులు కేటాయించండి
ఇంటింటా మరుగుదొడ్డి నిర్మాణానికి నిధులు పెంచండి
బళ్లారి మహా నగర పాలికె సమావేశంలో కార్పొరేటర్లు విజ్ఞప్తి
సాక్షి, బళ్లారి : బళ్లారి నగరంలో వేసవిలో మంచినీటి సమస్య తీర్చడంపై బడ్జెట్‌లో అధిక ప్రాధాన్యత ఇవ్వాలని పలువురు న నగర ప్రముఖులతో పాటు నగరంలోని కార్పొరేటర్లు పేర్కొన్నారు. శుక్రవారం బళ్లారి నగరంలో మహానగర పాలికె ఆధ్వర్యంలో బడ్జెట్‌పై ముందస్తు సమావేశం ఏర్పాటు చేశారు. ఈనెల 11న బళ్లారి నగరాభివృద్ధి కోసం బడ్జెట్‌పై ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో మహానగర పాలికె మేయర్ నాగమ్మ, ఇన్‌ఛార్జి కమిషనర్ విజయ మహాంతేష్ దానమ్మనవర్‌లు పలువురు ప్రముఖులు, కార్పొరేటర్ల నుంచి సలహాలు సూచన లు తీసుకున్నారు. బడ్జెట్‌లో ఏయే అభివృద్ధి పనులకు, సమస్యలు తీర్చడానికి నిధులు కేటాయించాలనే దాని గురించి చర్చ ఏర్పాటు చేయగా, నగర సమస్యలపై ప్రతి ఒక్కరూ గళం విప్పారు. నగరంలో 35 వార్డులలోను మంచినీటి సమస్య తీవ్రమైందని సమావేశం దృష్టికి తీసుకు వచ్చారు.
1వ వార్డు కార్పొరేటర్ మోత్కూరు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ... బళ్లారి నగరంలో 24 గంటల పాటు మంచినీటి సరఫరా చేస్తామని మంత్రి డీకే శివకుమార్ హామీ ఇచ్చారని, ఆ హామీని నిలబెట్టుకుని నగర వాసులకు నీటి కష్టాలు తీర్చాలన్నారు. కప్పగల్, సిరివార, సంగనకల్లు గ్రామాలకు మంచినీరు నిరంతరం సరఫరా చేస్తున్నారని, అదే సందర్భంగా అక్కడ నుంచి వచ్చే నీటిని పొదుపు చేస్తూ నగర వాసులకు నీటి సమస్య తీర్చాలన్నారు. ముఖ్యంగా స్వచ్ఛ భారత్ కింద ఇంటింటా మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.10 వేలు మాత్రమే కేటాయిస్తున్నారని, ఆ మొత్తం సరిపోవడం లేదని, మరో రూ.5 వేలు మహానగర పాలికె కింద పేదల కోసం కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
యువసేన సోషల్ యాక్షన్ క్లబ్ అధ్యక్షుడు మేకల ఈశ్వరరెడ్డి, స్థానికులు శ్రీనివాసమూర్తి తదితరులు మాట్లాడుతూ... బళ్లారి నగరంలో మంచినీటి సమస్య తీర్చడంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా డ్రెయినేజీలు అస్తవ్యస్తంగా ఉన్నాయని, ఇంటింటా చెత్త సేకరణ సక్రమంగా చేపట్టడం లేదని, పందులు స్వైర విహారం చేస్తున్నాయని సమావేశం దృష్టికి తీసుకుని వచ్చారు. పలువురు కార్పొరేటర్లు మాట్లాడుతూ నగరంలో మంచినీటి సమస్య ఉన్న వార్డులో ట్యాంకర్లతో ఎప్పటికప్పుడు నీటి సమస్య తీర్చడానికి కృషి చేయాలని, అందుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తే సమస్య తీరుతుందన్నారు. కార్యక్రమంలో మేయర్ నాగమ్మ, ఉపమేయర్ మాలన్‌బీ, సిటీ కార్పొరేషన్ ఇన్‌చార్జి కమిషనర్ విజయ మహాంతేష్ దానమ్మనవర్ తదితరులు పాల్గొన్నారు.