సాక్ష్యాలున్నాయ్
డీకే అవినీతికి సంబంధించిన ఆధారాలను త్వరలో బయటపెడతాం
‘బెళగావి’ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తాం
9న సువర్ణసౌధను ముట్టడిస్తాం
సీఎం సిద్ధుతో కుమారస్వామి కుమ్మక్కు
25న సుపరిపాలనా రోజుగా వాజ్‌పేయి జన్మదినోత్సవం
బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి
బెంగళూరు : రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి డీకే శివకుమార్ తన శాఖలో అనేక అవినీతి కార్యకలాపాలకు పాల్పడ్డారని, ఇందుకు సంబంధించిన ఆధారాలను త్వరలోనే బయటపెడతామని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు ప్రహ్లాద్ జోషి తెలిపారు. బుధవారమిక్కడ నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్ర ఇంధన శాఖలో అవినీతి జరిగిన విషయం ఇటీవలే బయటికి వచ్చిందని, ఇందుకు సంబంధించిన ఆధారాలను సైతం తాము సేకరించామని చెప్పారు. వీటిని త్వరలోనే బయటపెడతామని తెలిపారు. ఇక రాష్ట్ర మంత్రులు చేసిన అవినీతి కార్యకలాపాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయని, బెళగావిలో నిర్వహించనున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఈ విషయంపై నిలదీస్తామని చెప్పారు. అంతేకాక అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు మంత్రులను మంత్రివర్గం నుంచి తప్పించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఈనెల 9న సువర్ణసౌధను సైతం ముట్టడిస్తామని పేర్కొన్నారు.
తమ పోరాటాలను అణచివేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించిందని, అయితే వీటికి తామెంతమాత్రం భయపడబోమని అన్నారు. ఇక రాష్ట్రంలో తమ పార్టీ ఉనికిని కాపాడుకునేందుకు జేడీఎస్ నేత కుమారస్వామి ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. ఇందులో భాగంగానే ఈ అసెంబ్లీ సమావేశాల్లో సైతం ప్రభుత్వానికి మద్దతుగా నిలిచేందుకు ఒప్పుకున్నారని విమర్శించారు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీతో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు ప్రారంభమయ్యాయని, మంత్రి అంబరీష్ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై బహిరంగంగానే విమర్శలకు దిగడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఇక ఈనెల 25న మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి జన్మదినాన్ని సుపరిపాలనా దినంగా నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో అదే రోజున రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని వెల్లడించారు.