కాంగ్రెస్ కుట్రలకు భయపడం
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్
సాక్షి, హైదరాబాద్: అవినీతిని రూపుమాపడానికి, నల్లధనాన్ని వెలికి తీయడానికి అడ్డంపడుతూ.. కాంగ్రెస్ పార్టీ చేస్తున్న కుట్రలకు భయపడే ప్రసక్తిలేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. ఆదివారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, దేశంలో పేదరికం, అవినీతి వంటివాటిని పెంచి పోషించిన కాంగ్రెస్ పార్టీయే వ్యవస్థ ప్రక్షాళన కోసం ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలను వ్యతిరేకిస్తోందని ఆరోపించారు. పెద్దనోట్లను రద్దు చేసిన 50 రోజుల తర్వాత దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వరాలను ప్రకటించారని చెప్పారు. అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నదన్నారు.
గృహ నిర్మాణ రంగంలో రాబోయే రోజుల్లో ఒక విప్లవం రాబోతున్నదన్నారు. జీడీపీ వృద్ధి కోసం మోదీ చర్యలు పునాది వేస్తాయన్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరగడం ద్వారా నిరుద్యోగులకు మేలు జరుగుతుం దన్నారు. ప్రజలకోసం కఠిన చర్యలు తీసుకుంటున్న పధాని మోదీ చరిత్రలో నిలిచిపోతారని లక్ష్మణ్ అన్నారు. కిసాన్‌కార్డును రూపే కార్డుగా మార్చడం వల్ల రైతులకు ఉపయోగం జరుగుతుందన్నారు. బ్యాంకర్లతో తెలంగాణ ప్రభుత్వం సమావేశం ఏర్పాటుచేసి ప్రజలకు కేంద్ర పథకాలను చేరువచేయాలని లక్ష్మణ్ సూచించారు.