lineman posts
-
‘కరెంట్’ కొలువులు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్) 2,500 జూనియర్ లైన్మెన్, 25 జూనియర్ పర్సనల్ ఆఫీసర్, 500 జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు కలిపి మొత్తం 3,025 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ చేసింది. సంస్థ వెబ్సైట్లు https://www.tssouthernpower.com లేదా https:// tssouthernpower.cgg.gov.inలో ఈ నోటిఫికేషన్లను పొందుపరిచింది. ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనుంది. కొత్త జిల్లాల ప్రాతిపదికన పోస్టుల భర్తీని చేపట్టింది. జిల్లా, రిజర్వేషన్ కేటగిరీల వారీగా ఖాళీల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు. అర్హత వివరాలు.. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ పోస్టులకు బీఏ/బీకాం/బీఎస్సీ లేదా తత్సమాన విద్యార్హతతో పాటు 18–34 ఏళ్ల వయసు కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్లు, శారీరక వికలాంగులకు 10 ఏళ్ల వయోపరిమితి మినహాయింపు. జూనియర్ లైన్మెన్ పోస్టులకు 18–35 ఏళ్ల వయసుతో పాటు పదో తరగతితో పాటు ఎలక్ట్రికల్/వైర్‌మెన్ ట్రేడ్‌లో ఐటీఐ లేదా ఎలక్ట్రికల్ ట్రేడ్‌లో ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5 ఏళ్ల వయోపరిమితి మినహాయింపు. జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ ఆపరేటర్ ఫీజుల చెల్లింపు ప్రారంభ తేదీ: 30.10.2019 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 31.10.2019 ఫీజుల చెల్లింపునకు చివరి తేదీ: 20.11.2019 (సాయంత్రం 5 వరకు) ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 20.11.2019 (రాత్రి 11.59 వరకు) హాల్ టికెట్ల డౌన్లోడింగ్ ప్రారంభం: 11.12.2019 పరీక్ష తేదీ: 22.12.2019 జూనియర్ లైన్మెన్, జూనియర్ పర్సనల్ ఆఫీసర్ ఫీజుల చెల్లింపు ప్రారంభ తేదీ: 21.10.2019 దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం: 22.10.2019 ఫీజుల చెల్లింపునకు చివరి తేదీ: 10.11.2019 (సాయంత్రం 5 వరకు) ఆన్లైన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ: 10.11.2019 (రాత్రి 11.59 వరకు) హాల్ టికెట్ల డౌన్లోడింగ్ ప్రారంభం: 05.12.2019 పరీక్ష తేదీ: 15.12.2019 -
బిగుసుకుంటున్న ఉచ్చు
గ్రామ/వార్డు సచివాలయాల్లో జూనియర్ లైన్‌మన్ (జేఎల్ఎం) పోస్టుల ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులను ఏమారుస్తున్న దళారుల భరతం పట్టేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. నియామకాలను నిక్కచ్చిగా నిర్వహించాలని పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఈ బాగోతాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో మధ్యవర్తుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఇద్దరిపై చీటింగ్ కేసు పెట్టారు. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పీకర్ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేసి దళారీల పనిపట్టమని ఎస్పీని ఆదేశించారు. సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : ఆమదాలవలసకు చెందిన గుండ దుర్గాప్రసాద్ అనే అభ్యర్థి దళారీ గ్యాంగ్‌తో బేరసారాలాడుతూ ఈనెల 7న విద్యుత్ విజిలెన్స్ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన సంగతి జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్ అయ్యింది. సచివాలయ పోస్టుల్లో ఎక్కడా అక్రమాలు లేకుండా, పారదర్శకంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేసింది. అయితే అధికారుల చర్యలను సైతం పక్కదారి పట్టించిన దళారీ గ్యాంగ్.. పోల్ టెస్ట్‌లో పాసైన అభ్యర్థుల వివరాలను ఎప్పటికప్పుడు ఫోన్లోనే తెప్పించుకుని, వారినే టార్గెట్‌గా చేసుకుంటూ.. వసూళ్ల పర్వానికి తెరలేపింది. పరీక్షలకు సంబంధించిన హాల్ టిక్కెట్లు వచ్చేందుకు ఓ రేటు, వచ్చాక పోల్ క్లైంబింగ్ పరీక్షలో పాసైతే తుది మెరిట్ జాబితాలో పేరుండేందుకు మరో రేటు చొప్పున లక్షల్లో పలువురు అభ్యర్థుల నుంచి వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ పరీక్షలను ఎంతో పారదర్శకంగా నిర్వహించినప్పటికీ.. దళారీల గ్యాంగ్ మాత్రం కొందరు ప్రజాప్రతినిధుల పేర్లు వాడుకుని మరీ వసూళ్లకు పాల్పడినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అలాగే విద్యుత్ శాఖలో పనిచేస్తూనే.. దళారీ అవతారమెత్తిన కొందరి పాత్ర కూడా ఇందులో ఉన్నట్లుగా వార్తలు గుప్పుమంటుండడంతో.. వైఎస్సార్ విద్యుత్ ఉద్యోగుల సంఘంతోపాటు వివిధ విద్యుత్ ఉద్యోగుల సంఘాల నేతలు కూడా దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. నిరుద్యోగుల ఆశలతో ఆడుకోవడంతోపాటు ఈపీడీసీఎల్ సంస్థ పరువుకు సంబంధించిన అంశంగా కూడా దీన్ని పరిగణిస్తూ... దళారీ గ్యాంగ్ ఆటకట్టించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. తాజాగా లైన్‌మన్ ఉద్యోగార్థులు కూడా సోమవారం జిల్లా కలెక్టర్ జె.నివాస్‌ను ‘స్పందన’ కార్యక్రమంలో కలిసి.. దళారీల కారణంగా అర్హులైన వారికి పోస్టులు దక్కే అవకాశాలు తగ్గిపోతున్నాయని, ఆన్లైన్లో పదో తరగతి జీపీఏ పాయింట్ల నమోదులో తప్పుల కారణంగా ఇప్పటికే వందలాదిమంది అభ్యర్థులు పరీక్షలకు అనర్హులయ్యారని విన్నవించుకున్నారు. దీంతో నాలుగు వైపులా దళారీ గ్యాంగ్ టార్గెట్‌గా మారింది. ముమ్మరంగా గాలింపు విద్యుత్ లైన్‌మన్ పోస్టులిప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూళ్లు చేసిన వ్యవహారంలో విద్యుత్ శాఖకు చెందిన పలువురు ఉద్యోగుల పాత్ర కీలకంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై పోలీసులకు విద్యుత్ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్న ఆమదాలవలస అభ్యర్థి దుర్గాప్రసాద్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తోపాటు అతడి ఫోన్లో ఉన్న సమాచారం మేరకు పలువురి పాత్రను ప్రాథమికంగా గుర్తించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈమేరకు గోపాలరావు, శ్రీధర్ అనే ఇద్దరిపై టూటౌన్ పోలీసులు 420 చీటింగ్ కేసును నమోదు చేశారు. ఇందులో ఒకరు విద్యుత్ ఉద్యోగి కాగా, మరొకరు వ్యాపారి అని తెలుస్తోంది. ఇదిలావుంటే పోల్ పరీక్షల సమయంలో విద్యుత్ శాఖలో ఉన్నతాధికారులకు ఎటువంటి సమాచారం లేకుండా విధులకు రాని ఉద్యోగుల వివరాలను కూడా పోలీసులు సేకరించారు. పరీక్షలు నిర్వహించిన ఆర్ట్స్ కళాశాలలో ఈమేరకు సీసీ కెమెరాల నుంచి కూడా ఫుటేజిని సేకరించే పనిలో పడ్డారు. దీని ఆధారంగా అనుమానాస్పదంగా ఉన్న అభ్యర్థులు, ఉద్యోగులను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా ఇదే క్రమంలో పలువురి ఇళ్లకు వెళ్లి సోదాలు నిర్వహించి అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ, అప్పటికే ఇంటికి తాళాలు వేసి పరారీలో ఉన్నట్టు గుర్తించారు. జిల్లాలో మొత్తం 679 పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించగా.. పోల్ క్లైంబింగ్ టెస్ట్ అనంతరం 986 మంది అర్హత సాధించినట్టు అధికారులు ప్రకటించారు. తాజా పరిణామాలతో డబ్బులిచ్చిన అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఉద్యోగాల కోసం లక్షలాది రూపాయలు టోకెన్ అడ్వాన్స్‌గా ఇచ్చేయడంతో.. ఇప్పుడు పరిస్థితి ఏంటని ఆందోళన పడుతున్నారు. సమగ్ర దర్యాప్తు చేయాల్సిందే.... లైన్‌మన్ పోస్టుల విషయంలో దళారీల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌గా దర్యాప్తు చేయాలంటూ వైఎస్సార్ విద్యుత్ ఉద్యోగుల సంఘం, బీసీ విద్యుత్ ఉద్యోగుల సంఘం, తెలుగునాడు, అసిస్టెంట్ ఇంజినీర్ల సంఘ నేతలంతా డిమాండ్ చేశారు. పలు యూనియన్ నేతలంతా కలిసి ప్రత్యేక తీర్మానాన్ని చేశారు. వైఎస్సార్ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కె.వి.కృష్ణారావు, ఆర్.శ్రీనివాస్‌లు మాట్లాడుతూ మెరిట్లో వచ్చిన అభ్యర్థుల పేర్లు తప్పించే ప్రయత్నాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరారు. దళారీల వ్యవహారంపై కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యుత్ బీసీ ఉద్యోగుల సంఘ నేతలు సనపల వెంకటరావు, చల్లా వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ నిరుద్యోగుల నుంచి పోస్టుల పేరు చెప్పి మోసం చేయడం పెద్ద నేరమని, సొంత శాఖకు చెందిన ఓ యూనియన్ నేత ఇలాంటి నేరాలకు పాల్పడటంతో సంస్థకు చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఎన్నో లక్షలు వసూలు చేశారని, అలాగే ఇప్పుడు మెడికల్ ఇన్వాల్యుయేషన్పై ఆరోగ్యంగా ఉన్న ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులను దండుకుంటున్నారని, దీనిపై కూడా విచారణ జరగాలని డిమాండ్ చేశారు. తెలుగునాడు సంఘ నేత కె.వైకుంఠరావు మాట్లాడుతూ మెరిట్ లిస్ట్ ఎలా బయటకు వెళ్తుందో.. వారి డాటాను ఎవరు ఎవరికి పంపిస్తున్నారో శాఖాపరంగా విచారణ జరగాలని, రాష్ట్ర ప్రభుత్వం నియామక ప్రక్రియను పారదర్శకంగా చేస్తున్నప్పటికీ... ఇలాంటి ఘటనలు చెడ్డ పేరు తీసుకొస్తాయన్నారు. అసిస్టెంట్ ఇంజినీర్ల సంఘం బ్రాంచ్ సెక్రటరీ జి.వి.సురేష్ మాట్లాడుతూ దళారీ వ్యవస్థకు ఇప్పటికైనా చెక్ పడాలని, ఇంతవరకు ఎంతమంది జీవితాలో ఆవిరయ్యాయని, తాజా పోస్టుల వ్యవహారంలో అర్హులైన వారినే ఎంపిక చేసేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఎలాగైనా ఈ వ్యవహారంలో దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. దళారుల పనిపట్టండి.. లైన్‌మన్ పోస్టుల నియామకాల్లో దళారీల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం తీవ్రంగా స్పందించారు. కొందరు దళారులు అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పుకుని డబ్బులు దండుకుంటున్నారని, దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తును చేపట్టాలని జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డికి ఆయన ఆదేశించారు. దళారీ వ్యవహారంలో ఎంతటి వారున్నా ఏమాత్రం క్షమించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సచివాలయ పోస్టులన్నీ పారదర్శకంగానే భర్తీ చేస్తున్నామని, ఇందులో ఎలాంటి అపోహలు వద్దని అన్నారు. దళారీ గ్యాంగ్ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నామని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
పోస్టులున్నా..భర్తీ చేయడం లేదు
సాక్షి, విజయనగరం : ఈ నెల 20న పట్టణంలోని ప్రదీప్‌నగర్ ప్రాంతంలో ఉదయం 7.30 గంటలకు నిలిచిపోయిన విద్యుత్ సరఫరా 11 గంటల వరకు రాలేదు. సుమారు 3.30 గంటల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బంది పడ్డారు. విషయాన్ని విద్యుత్ శాఖ అధికారులకు తెలిజేస్తే సమస్య ఎక్కడ ఉత్పన్నమైందో తెలుసుకునేందుకు అధిక సమయం తీసుకున్నారు. సుమారు 80 డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్లను ఇద్దరు లైన్మన్లు తనిఖీ చేసే సరికి ఆ సమయం పట్టింది. సమస్యను అన్వేషించి పరిష్కార చర్యలు చేపట్టలోగా ఆ ప్రాంత వాసులు పడిన ఇబ్బందులు అన్ని ఇన్నీ కావు. ఈ పరిస్థితి కేవలం విజయనగరం పట్టణంలోని ప్రదీప్‌నగర్ ప్రాంతానికి చెందిన ప్రజలకే పరిమితం కాదు.. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ఇటువంటి సమస్యలు పునరావృతమవుతూనే ఉన్నాయి. ప్రధానంగా భారీ ఈదురుగాలులు వీచే సమయాల్లో.. భారీ వర్షాలు కురిసే సమయంలో పరిస్థితి మరింత దయనీయంగా మారుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. రోజు రోజుకూ అన్ని రంగాల్లో అభివృద్ధి పరంగా విస్తరిస్తున్న విజయనగరం డివిజన్లో ఇటువంటి సమస్యలను గుర్తించి, పరిష్కరించే కీలకమైన ఉద్యోగులు తక్కువగా ఉండడం శోచనీయం. 200 మందితోనే నడిపిస్తున్నారు.. విద్యుత్ శాఖలో కీలకమైన లైన్‌మన్ పోస్టుల నియామకాలు, భర్తీ విషయంలో జాప్యం జరుగుతుండడంతో.. ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. చిన్నపాటి సమస్య వచ్చినా స్తంభమెక్కెందేకు అవసరమైన సిబ్బంది లేక వినియోగదారులకు జేబులు గుల్ల చేసుకుంటున్న పరిస్థితులు కోకొల్లలు. విజయనగరం డివిజన్లో 3.50 లక్షల విద్యుత్ సర్వీసులుండగా.. చిన్న, చిన్న సమస్యలు పరిష్కరించేందుకు 200 మంది మాత్రమే లైన్మన్లు ఉన్నారు. వాస్తవానికి దశాబ్దాల కిందట ఉన్నతాధికారులు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం అప్పటి సర్వీసులకు అనుగుణంగా 300 మంది వరకు జూనియర్, సీనియర్ లైన్‌మన్ ఉండాలి. అయితే 100 మంది సిబ్బంది తక్కువగా ఉండడంతో ఉన్న వారిపైనే అదనపు పని భారం పడుతోంది. సా«ధారణ రోజుల్లో ఎటువంటి సమస్య లేకుండా వీరంతా సేవలందిస్తున్నప్పటికీ విపత్కర సమయాల్లో (భారీ ఈదురుగాలులు, వర్షాలు కురిసే) మాత్రం ప్రాణాలకు తెగించి అర్ధరాత్రి, అపరాత్రి తేడా లేకుండా వి«ధులు నిర్వహించాల్సి వస్తున్నట్లు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఎడతెగని జాప్యం.. అత్యవసర సేవల్లో ఒక్కటిగా మారిన విద్యుత్ సేవల విషయంలో జాప్యం జరిగితే వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. క్షణ కాలం విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఆపసోపాలు పడిపోతున్నారు. అటువంటిది గంటల సమయం కోత విధిస్తే ఇక అంతే మరి. ఈనెల 16వ తేదీ సాయంత్రం వీచిన భారీ ఈదురుగాలులకు రాత్రి 7.45 గంటల నుంచి అర్ధరాత్రి 1.15 గంటల వరకు సరఫరా నిలిచిపోయింది. దీంతో ఆ రాత్రంతా వినియోగదారులకు కంటిమీద కునుకులేకుండా పోయింది. మారుతున్న వాతావరణ పరిస్థితులు, కాలనుగుణంగా ప్రతి ఇంటిలోనూ ఏసీలు, ఫ్రిజ్‌లు వంటి విద్యుత్ గృహోపకరణాల వినియోగం రోజు రోజుకు అధికమవుతుండగా... విద్యుత్ సరఫరా చేయడం అధికారులకు సైతం పెను సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో సిబ్బంది నియామకాలు పూర్తి స్థాయిలో జరగాల్సిన అవసరం ఉందన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. ఎంత మంది ఉండాలంటే...? విద్యుత్ చట్టం ప్రకారం ప్రతి 1000 విద్యుత్ సర్వీసులకు ఒక లైన్‌మన్ ఉండాలి. ఇది విద్యుత్ చట్టం చెబుతున్న సత్యం. అయితే విజయనగరం డివిజన్లో మాత్రం ఉన్న సర్వీసులకు అనుగుణంగా అవసరమైన లైన్మన్లు లేకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. డివిజన్లో 3లక్షల 50 వేల విద్యుత్ సర్వీసులు ఉన్నాయి. ఈ లెక్కన 350 మంది వరకు లైన్మన్లు ఉండాల్సి ఉంటుంది. కాని ప్రస్తుతం 200 మంది మాత్రమే ఉన్నారు. దీంతో విద్యుత్ శాఖలో తలెత్తే సాంకేతిక సమస్యల పరిష్కారానికి ఎక్కువ సమయం పడుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వీరంతా క్షేత్ర స్థాయిలో సమస్యను గుర్తించి స్తంభమెక్కి వాటిని సరి చేయాల్సి ఉంటుంది -
9,500 లైన్‌మైన్ పోస్టుల భర్తీ
మంత్రి డీకే శివకుమార్ సాక్షి, బెంగళూరు : ఇంధన శాఖలో 9,500 లైన్‌మైన్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేస్తామని మంత్రి డీకే శివకుమార్ వెల్లడించారు. పోస్టుల భర్తీలో పారదర్శకతను అమలు చేయడానికి వీలుగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించామన్నారు. కర్ణాటక విద్యుత్ మండలి రూపొందించిన నూతన సంవత్సరం డైరీ, క్యాలండర్‌ను బెంగళూరులో ఆదివారం ఆవిష్కరించిన ఆయన మాట్లాడారు. ఇంధనశాఖలో క్షేత్రస్థాయి ఉద్యోగాలైన లైన్‌మైన్ పోస్టులు ఎక్కువ సంఖ్యలో ఖాళీగా ఉండటం వల్ల తాగు, సాగునీటికి చాలా ఇబ్బందులు ఎదుర్కొనాల్సి వస్తోందన్నారు. సమస్య పరిష్కారం కోసం త్వరలో 9,500 లైన్‌మైన్ పోస్టులను భర్తీ చేస్తామన్నారు. అక్రమాలకు తావులేకుండా నియామకాలు చేపడుతామన్నారు. అందువల్ల నిరుద్యోగులు దళారులను నమ్మి మోసపోకూడదని సూచించారు. లైన్‌మైన్ పోస్టులతో పాటు ఇంధన శాఖలో ఖాళీగా ఉన్న అన్ని రకాల పోస్టులను సాధ్యమైనంత త్వరగా భర్తీ చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో విద్యుత్ చోరీ పెరుగుతోందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్థానిక ఇంజనీర్లు ప్రత్యేక దృష్టి సారించి సమస్యను పరిష్కరించాలన్నారు. నిరంతర జ్యోతి విద్యుత్ పథకంలో అవకతవకలు జరిగినట్లు తేలితే ఇందుకు స్థానిక డివిజనల్ ఇంజనీర్‌ను బాధ్యుడిని చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో కర్ణాటక విద్యుత్ మండలి అధ్యక్షుడు వెంటకట శివారెడ్డి, కేపీటీసీఎల్ డెరైక్టర్ ఎస్ సుమంత్, బెస్కాం డెరైక్టర్ హెచ్ నాగేశ్ తదితరలు పాల్గొన్నారు.