బిగుసుకుంటున్న ఉచ్చు  | Irregularities In Village Secretary Lineman Posts In Srikakulam | Sakshi
Sakshi News home page

బిగుసుకుంటున్న ఉచ్చు 

Published Tue, Sep 10 2019 7:50 AM | Last Updated on Tue, Sep 10 2019 7:50 AM

Irregularities In Village Secretary Lineman Posts In Srikakulam - Sakshi

ప్రతీకాత్మక చిత్రం

గ్రామ/వార్డు సచివాలయాల్లో జూనియర్‌ లైన్‌మన్‌ (జేఎల్‌ఎం) పోస్టుల ఎంపిక ప్రక్రియలో అభ్యర్థులను ఏమారుస్తున్న దళారుల భరతం పట్టేందుకు అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. నియామకాలను నిక్కచ్చిగా నిర్వహించాలని పట్టుదలతో ఉన్న ప్రభుత్వం ఈ బాగోతాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో మధ్యవర్తుల చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. ఇప్పటికే ఇద్దరిపై చీటింగ్‌ కేసు పెట్టారు. నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. ఈ వ్యవహారంపై స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఆగ్రహం వ్యక్తం చేసి దళారీల పనిపట్టమని ఎస్పీని ఆదేశించారు. 

సాక్షి, అరసవల్లి(శ్రీకాకుళం) : ఆమదాలవలసకు చెందిన గుండ దుర్గాప్రసాద్‌ అనే అభ్యర్థి దళారీ గ్యాంగ్‌తో బేరసారాలాడుతూ ఈనెల 7న విద్యుత్‌ విజిలెన్స్‌ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా చిక్కిన సంగతి జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది. ఈ వ్యవహారంతో రాష్ట్ర ప్రభుత్వం అలెర్ట్‌ అయ్యింది. సచివాలయ పోస్టుల్లో ఎక్కడా అక్రమాలు లేకుండా, పారదర్శకంగా నిర్వహించేందుకు పక్కాగా ఏర్పాట్లు చేసింది. అయితే అధికారుల చర్యలను సైతం పక్కదారి పట్టించిన దళారీ గ్యాంగ్‌.. పోల్‌ టెస్ట్‌లో పాసైన అభ్యర్థుల వివరాలను ఎప్పటికప్పుడు ఫోన్లోనే తెప్పించుకుని, వారినే టార్గెట్‌గా చేసుకుంటూ.. వసూళ్ల పర్వానికి తెరలేపింది. పరీక్షలకు సంబంధించిన హాల్‌ టిక్కెట్లు వచ్చేందుకు ఓ రేటు, వచ్చాక పోల్‌ క్లైంబింగ్‌ పరీక్షలో పాసైతే తుది మెరిట్‌ జాబితాలో పేరుండేందుకు మరో రేటు చొప్పున లక్షల్లో పలువురు అభ్యర్థుల నుంచి వసూలు చేసినట్లుగా తెలుస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ పరీక్షలను ఎంతో పారదర్శకంగా నిర్వహించినప్పటికీ.. దళారీల గ్యాంగ్‌ మాత్రం కొందరు ప్రజాప్రతినిధుల పేర్లు వాడుకుని మరీ వసూళ్లకు పాల్పడినట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. అలాగే విద్యుత్‌ శాఖలో పనిచేస్తూనే.. దళారీ అవతారమెత్తిన కొందరి పాత్ర కూడా ఇందులో ఉన్నట్లుగా వార్తలు గుప్పుమంటుండడంతో.. వైఎస్సార్‌ విద్యుత్‌ ఉద్యోగుల సంఘంతోపాటు వివిధ విద్యుత్‌ ఉద్యోగుల సంఘాల నేతలు కూడా దీనిపై తీవ్రంగా స్పందిస్తున్నారు. నిరుద్యోగుల ఆశలతో ఆడుకోవడంతోపాటు ఈపీడీసీఎల్‌ సంస్థ పరువుకు సంబంధించిన అంశంగా కూడా దీన్ని పరిగణిస్తూ... దళారీ గ్యాంగ్‌ ఆటకట్టించాలంటూ డిమాండ్‌ చేస్తున్నారు. తాజాగా లైన్‌మన్‌ ఉద్యోగార్థులు కూడా సోమవారం జిల్లా కలెక్టర్‌ జె.నివాస్‌ను ‘స్పందన’ కార్యక్రమంలో కలిసి.. దళారీల కారణంగా అర్హులైన వారికి పోస్టులు దక్కే అవకాశాలు తగ్గిపోతున్నాయని, ఆన్‌లైన్‌లో పదో తరగతి జీపీఏ పాయింట్ల నమోదులో తప్పుల కారణంగా ఇప్పటికే వందలాదిమంది అభ్యర్థులు పరీక్షలకు అనర్హులయ్యారని విన్నవించుకున్నారు. దీంతో నాలుగు వైపులా దళారీ గ్యాంగ్‌ టార్గెట్‌గా మారింది. 

ముమ్మరంగా గాలింపు
విద్యుత్‌ లైన్‌మన్‌ పోస్టులిప్పిస్తామంటూ నిరుద్యోగుల నుంచి లక్షల్లో వసూళ్లు చేసిన వ్యవహారంలో విద్యుత్‌ శాఖకు చెందిన పలువురు ఉద్యోగుల పాత్ర కీలకంగా కనిపిస్తోంది. ఇప్పటికే ఈ వ్యవహారంపై పోలీసులకు విద్యుత్‌ శాఖ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో ప్రస్తుతానికి పోలీసుల అదుపులో ఉన్న ఆమదాలవలస అభ్యర్థి దుర్గాప్రసాద్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తోపాటు అతడి ఫోన్లో ఉన్న సమాచారం మేరకు పలువురి పాత్రను ప్రాథమికంగా గుర్తించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈమేరకు గోపాలరావు, శ్రీధర్‌ అనే ఇద్దరిపై టూటౌన్‌ పోలీసులు 420 చీటింగ్‌ కేసును నమోదు చేశారు. ఇందులో ఒకరు విద్యుత్‌ ఉద్యోగి కాగా, మరొకరు వ్యాపారి అని తెలుస్తోంది. ఇదిలావుంటే పోల్‌ పరీక్షల సమయంలో విద్యుత్‌ శాఖలో ఉన్నతాధికారులకు ఎటువంటి సమాచారం లేకుండా విధులకు రాని ఉద్యోగుల వివరాలను కూడా పోలీసులు సేకరించారు.

పరీక్షలు నిర్వహించిన ఆర్ట్స్‌ కళాశాలలో ఈమేరకు సీసీ కెమెరాల నుంచి కూడా ఫుటేజిని సేకరించే పనిలో పడ్డారు. దీని ఆధారంగా అనుమానాస్పదంగా ఉన్న అభ్యర్థులు, ఉద్యోగులను పట్టుకునేందుకు ముమ్మరంగా గాలిస్తున్నారు. కాగా ఇదే క్రమంలో పలువురి ఇళ్లకు వెళ్లి సోదాలు నిర్వహించి అదుపులోకి తీసుకునే ప్రయత్నాలు చేసినప్పటికీ, అప్పటికే ఇంటికి తాళాలు వేసి పరారీలో ఉన్నట్టు గుర్తించారు. జిల్లాలో మొత్తం 679 పోస్టులను భర్తీ చేసేందుకు నిర్ణయించగా.. పోల్‌ క్లైంబింగ్‌ టెస్ట్‌ అనంతరం 986 మంది అర్హత సాధించినట్టు అధికారులు ప్రకటించారు. తాజా పరిణామాలతో డబ్బులిచ్చిన అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఉద్యోగాల కోసం లక్షలాది రూపాయలు టోకెన్‌ అడ్వాన్స్‌గా ఇచ్చేయడంతో.. ఇప్పుడు పరిస్థితి ఏంటని ఆందోళన పడుతున్నారు. 

సమగ్ర దర్యాప్తు చేయాల్సిందే....
లైన్‌మన్‌ పోస్టుల విషయంలో దళారీల వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్‌గా దర్యాప్తు చేయాలంటూ వైఎస్సార్‌ విద్యుత్‌ ఉద్యోగుల సంఘం, బీసీ విద్యుత్‌ ఉద్యోగుల సంఘం, తెలుగునాడు, అసిస్టెంట్‌ ఇంజినీర్ల సంఘ నేతలంతా డిమాండ్‌ చేశారు. పలు యూనియన్‌ నేతలంతా కలిసి ప్రత్యేక తీర్మానాన్ని చేశారు. వైఎస్సార్‌ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు కె.వి.కృష్ణారావు, ఆర్‌.శ్రీనివాస్‌లు మాట్లాడుతూ మెరిట్‌లో వచ్చిన అభ్యర్థుల పేర్లు తప్పించే ప్రయత్నాలపై ఉన్నతాధికారులు దృష్టి సారించాలని కోరారు. దళారీల వ్యవహారంపై కఠినంగా వ్యవహరించి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. విద్యుత్‌ బీసీ ఉద్యోగుల సంఘ నేతలు సనపల వెంకటరావు, చల్లా వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ నిరుద్యోగుల నుంచి పోస్టుల పేరు చెప్పి మోసం చేయడం పెద్ద నేరమని, సొంత శాఖకు చెందిన ఓ యూనియన్‌ నేత ఇలాంటి నేరాలకు పాల్పడటంతో సంస్థకు చెడ్డపేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కూడా ఎన్నో లక్షలు వసూలు చేశారని, అలాగే ఇప్పుడు మెడికల్‌ ఇన్‌వాల్యుయేషన్‌పై ఆరోగ్యంగా ఉన్న ఉద్యోగుల పిల్లలకు ఉద్యోగాలు ఇప్పిస్తామని డబ్బులను దండుకుంటున్నారని, దీనిపై కూడా విచారణ జరగాలని డిమాండ్‌ చేశారు.  

తెలుగునాడు సంఘ నేత కె.వైకుంఠరావు మాట్లాడుతూ మెరిట్‌ లిస్ట్‌ ఎలా బయటకు వెళ్తుందో.. వారి డాటాను ఎవరు ఎవరికి పంపిస్తున్నారో శాఖాపరంగా విచారణ జరగాలని, రాష్ట్ర ప్రభుత్వం నియామక ప్రక్రియను పారదర్శకంగా చేస్తున్నప్పటికీ... ఇలాంటి ఘటనలు చెడ్డ పేరు తీసుకొస్తాయన్నారు. అసిస్టెంట్‌ ఇంజినీర్ల సంఘం బ్రాంచ్‌ సెక్రటరీ జి.వి.సురేష్‌ మాట్లాడుతూ దళారీ వ్యవస్థకు ఇప్పటికైనా చెక్‌ పడాలని, ఇంతవరకు ఎంతమంది జీవితాలో ఆవిరయ్యాయని, తాజా పోస్టుల వ్యవహారంలో అర్హులైన వారినే ఎంపిక చేసేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. ఎలాగైనా ఈ వ్యవహారంలో దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. 

దళారుల పనిపట్టండి..
లైన్‌మన్‌ పోస్టుల నియామకాల్లో దళారీల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్‌ తమ్మినేని సీతారాం తీవ్రంగా స్పందించారు. కొందరు దళారులు అధికార పార్టీ నాయకుల పేర్లు చెప్పుకుని డబ్బులు దండుకుంటున్నారని, దీనిపై పూర్తి స్థాయి దర్యాప్తును చేపట్టాలని జిల్లా ఎస్పీ అమ్మిరెడ్డికి ఆయన ఆదేశించారు. దళారీ వ్యవహారంలో ఎంతటి వారున్నా ఏమాత్రం క్షమించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. రాష్ట్రంలో సచివాలయ పోస్టులన్నీ పారదర్శకంగానే భర్తీ చేస్తున్నామని, ఇందులో ఎలాంటి అపోహలు వద్దని అన్నారు. దళారీ గ్యాంగ్‌ వ్యవహారాన్ని సీరియస్‌గా పరిగణిస్తున్నామని తమ్మినేని ఆగ్రహం వ్యక్తం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement