
విడుదలకు ముందే నెట్‌లో రిలీజ్
జీవీ.ప్రకాశ్‌కుమార్ ఫిర్యాదు
తమిళసినిమా: తన చిత్రం విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో రిలీజ్ కావడంతో ఆ చిత్ర హీరో జీవీ.ప్రకాశ్‌కుమార్, యూనిట్ దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంతకు ముందు చిత్రానికి సంబంధించిన ఒకటిరెండు పాటలు గానీ, కొన్ని సన్నివేశాలు గానీ అనధికారికంగా నెట్‌లో ప్రచారం అయ్యేవి. అలాంటిది చిత్రం మొత్తం విడుదలకు ముందే నెట్‌లో రిలీజ్ కావడం అన్నది ఇదే మొదటి సారి. ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ.ప్రకాశ్‌కుమార్ కథానాయకుడిగానూ రాణిస్తున్న విషయం తెలిసిందే.
ఆయన నటించిన తాజా చిత్రం ఉనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. అయితే అంతకు ముందు రోజే నెట్‌లో రిలీజైన విషయం చిత్ర యూనిట్‌కు తెలిసింది. దీంతో చిత్ర హీరో జీవీ.ప్రకాశ్‌కుమార్ సోమవారం నగర పోలీస్ కమిషనర్ కార్యాలయానికి వెళ్లి పోలీస్ కమిషనర్ టీకే.రాజేంద్రన్‌కు ఫిర్యాదు చేశారు.
చిత్రం విడుదలకు ముందే ఇంటర్నెట్‌లో రిలీజ్ కావడంతో తాము తీవ్ర నష్టానికి గురవుతున్నట్లు, కాబట్టి దొంగతనంగా తమ చిత్రాన్ని ఇంటర్నెట్‌లో ప్రచారం చేసిన వారెవరో కనిపెట్ట వారిపై తగిన చర్యలు చేపట్టాల్సిందిగా జీవీ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదును నమోదు చేసుకున్న కమిషనర్ తగిన చర్చలు చేపడుతామని హామీ ఇచ్చారు.