తమిళ హాస్యనటుడు వడివేలు హీరోగా నిర్మించిన ‘జగబల భుజబల తెనాలిరామన్’ చిత్ర వివాదం చినికి చినికి గాలీ వానగా మారింది. రెండు రోజుల క్రితం రాజకీయ నేత సీమాన్, బుధవారం నాడు తమిళ సినీ దర్శకుడు గౌతమన్ , తెలుగు సంఘాల వారికి హెచ్చరికలు జారీచేసి వివాదానికి ఆజ్యం పోశారు.
చెన్నై, సాక్షి ప్రతినిధి: శ్రీకృష్ణదేవరాయలు ఒక్క తెలుగువారికే కాదు అందరికీ ఆరాధ్యుడు, ఆదర్శనీయుడు. వీరునిగా, కవి, పండితా పోషకుడుగా ప్రసిద్ధుడు. శ్రీకృష్ణదేవరాయల ఇతివృత్తంతో తెలుగులో వచ్చిన అనేక చిత్రాలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్రవేశాయి. అటువంటి మహానాయకుని ఒక జోకర్‌గానూ, బహుభార్యాతత్వం కలిగిన విలాసజీవిగా చిత్రీకరించినట్లుగా తెనాలిరామన్ ప్రచార చిత్రాలే చెబుతున్నాయి. ఇది తెలుగువారి హృదయాలను తీవ్రంగా గాయపరిచింది. ఈనెల 18న తెనాలిరామన్ తమిళనాడంతా విడుదలకు సిద్ధమైంది. తమకున్న అనుమానాల నివృత్తి కోసం విడుదలకు ముందే సినిమాను చూపాల్సిందిగా కొందరు తెలుగు ప్రముఖులు చిత్రదర్శకుడు యువరాజన్‌ను కోరగా ఆయన అంగీకరించారు. అయితే విడుదలకు ముందు సినిమాను చూపేది లేదని చిత్రనిర్మాత రంగరాజన్ మరుసటి రోజే ప్రెస్‌మీట్ పెట్టి మరీ రెచ్చగొట్టే ప్రకటన చేశారు. తెలుగువారంతా గవర్నర్ కే రోశయ్యను కలిసి ఈ వివాదంపై వినతిపత్రం అందజేశారు. తెలుగు సంఘాల ఐక్యవేదిక కింద సుమారు 20 తెలుగు సంఘాలు ఏకమై చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటామని హెచ్చరించారు. మరో తెలుగు బృందం వడివేలు ఇంటిని ముట్టడించే ప్రయత్నం చేసింది.
నిన్న సీమాన్, నేడు గౌతమన్
తెనాలిరామన్ చిత్రంపై నిరసనలను తీవ్రంగా పరిగణించిన నామ్ తమిళర్ కట్చి అధ్యక్షులు సీమాన్ రెండు రోజుల క్రితం ధ్వజమెత్తగా, బుధవారం తమిళ సినీ దర్శకుడు గౌతమన్ తెలుగు సంఘాలపై మండిపడ్డారు. తమిళనాడులో తమిళునికే బెదిరింపులా అంటూ ఒక ప్రకటన విడుదల చేశారు. ఆనాటి హాస్య ప్రముఖులు ఎన్‌ఎస్ కృష్ణన్, టనల్ తంగబాలు, గౌండమణిల సరసన వడివేలు అర్హత సంపాదించారన్నారు. అలాంటి వడివేలు ఇంటికే వెళ్లి బెదిరింపులకు పాల్పడటం అనాగరిక చర్యగా ఆయన అభివర్ణించారు. సినిమాకి ప్రధాన బాధ్యులైన కథా రచయిత, నిర్మాత, దర్శకులకు వివాదాన్ని చెప్పకుండా వడివేలును వేలెత్తిచూపడం తగదన్నారు. ఎంతోకాలం తరువాత విడుదలవుతున్న వడివేలు చిత్రం కోసం తమిళులంతా ఎదురుచూస్తుండగా తెలుగువారు అడ్డుకోవడం బాధాకరమన్నారు. దీన్ని ఒక తమిళునిపై దాడిగా తాము భావిస్తున్నామని చెప్పారు. తమిళులంతా ఏకమైతే జరగబోయే తీవ్రపరిణామాలను తెలుగు సంఘాలు ఎదుర్కొనక తప్పదని ఆయన హెచ్చరించారు.
కేతిరెడ్డి ఖండన
తెలుగు సంఘాలకు సీమాన్, గౌతమన్ చేసిన హెచ్చరికలనుతమిళనాడు తెలుగు యువశక్తి అధ్యక్షుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ఖండించారు. తెలుగువారి మనోభావాలను కించపరుస్తూ నిర్మించిన సినిమాను అడ్డుకునే హక్కు తెలుగువారికి లేదా అని ప్రశ్నించారు. మహోన్నతుడైన కృష్ణదేవరాయలకు 36 మంది భార్యలు, 52 మంది సంతానం ఉన్నట్లుగా చిత్రీకరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తమిళనాడులోనే పుట్టి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములైన తెలుగువారు తమ ఆత్మగౌరవాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. తెలుగువారిని స్థానికేతరులుగా భావిస్తూ కొందరు సాగించే బెదిరింపులకు తాము భయపడబోమని హెచ్చరించారు. అయితే సీమాన్, గౌతమన్ వరుస హెచ్చరికలపై తెలుగు సంఘాల ఐక్యవేదిక తరపున సంఘటితమైన తెలుగు సంఘాల ప్రతినిధుల వారెవ్వరూ ఇంతవరకు నోరు మెదపకపోవడం శోచనీయం.