తరగతి గదిలో ఘాతుకం
సాక్షి, చెన్నై: తరగతి గదిలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థిని మాజీ విద్యార్థి కొట్టి చంపాడు. ఈ సంఘటన తమిళనాడులోని కరూర్‌లో చోటుచేసుకుంది. కరూర్‌లోని ఓ ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో శివగంగై జిల్లా మానామదురైకు చెందిన సోనాలి మూడో సంవత్సరం సివిల్ ఇంజినీరింగ్ చదువుతోంది. యథాప్రకారం మంగళవారం ఉదయం 11 గంటలకు తరగతి గదిలో ప్రొఫెసర్ చెప్పే పాఠాలను వింటూ కూర్చుంది. ఈ సమయంలో హఠాత్తుగా లోనికి ప్రవేశించిన ఓ యువకుడు చేతిలో ఉన్న దుడ్డుకర్రతో ఆమె తలపై దాడి చేశాడు.
ఉన్మాది వలే హఠాత్తుగా అతడు ప్రవర్తించిన తీరు నుంచి అక్కడి విద్యార్థులు తేరుకునేలోపు తీవ్రంగా దాడి చేసి పారిపోయాడు. రక్తపు మడుగులో పడి ఉన్న సోనాలిని సహచర విద్యార్థులు, కళాశాల సిబ్బంది స్థానికంగా ఉన్న సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మదురైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందింది. ఈ ఘాతుకానికి ఒడిగట్టిన ఉదయకుమార్ అనే యువకుడ్ని పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో ఉదయకుమార్ కళాశాల నుంచి సస్పెండ్ అయినట్టు తేలింది.
సోనాలి తండ్రి నాలుగు నెలల క్రితం మరణించాడు. ఆమె తల్లి చెన్నైలో ఓ చిన్న సంస్థలో పని చేస్తూ తన కుమార్తెను చదివిస్తున్నట్టు విచారణలో తేలింది. తన ప్రేమను తిరస్కరించడంతో వల్లే ఉదయకుమార్ ఈ ఘాతుకానికి పాల్పడినట్టు అనుమానిస్తున్నారు. రెండు నెలల క్రితం ఇదేతరహాలో చెన్నైలో ఇన్ఫోసిస్ ఉద్యోగిని స్వాతి హత్యకు గురైంది. తనను తిరస్కరించిందనే కోపంతో స్వాతిని ఓ యువకుడు రైల్వే స్టేషన్ లో నరికి చంపాడు.