పింప్రి, న్యూస్‌లైన్: దేశవ్యాప్తంగా బాలికల సంఖ్య వేగంగా తగ్గుముఖం పడుతున్న సంగతి తెలిసిందే. ఆడపిల్లలను భారంగా పరిగణించే సంస్కృతి, లైంగిక నేరాలు, సామాజిక దురాచారాలు, భ్రూణహత్యల వంటి సమస్యల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వం ఆడ శిశువుల జననాల రేటును పెంచడానికి ఎన్నో పథకాలను, చట్టాలను తెచ్చినప్పటికీ ఫలితం కనిపించడం లేదు. ఈ విషయంలో పుణే కార్పొరేషన్ చక్కని ఫలితాలు సాధించి మిగతా స్థానిక ప్రభుత్వాలకు ఆదర్శంగా నిలిచింది. కార్పొరేషన్ చేపట్టిన పలు సామాజిక సంక్షేమ పథకాలు, చర్యల వల్ల బాలికల జననాల రేటు చెప్పుకోదగ్గస్థాయిలో పెరిగిందని గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
గత ఆరు నెలల కాలంలో ఆడపిల్లల జననాల సంఖ్య సరాసరి 960కు (ప్రతి వెయ్యిమంది పురుషులకు) చేరింది. గత సంవత్సరం జననాలరేటు 934 మాత్రమే ఉండేదని కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు. భ్రూణహత్యలను నివారించేందుకు పుణే కార్పొరేషన్ ఏడాది పొడవునా గర్భిణుల సంక్షేమానికి పలు చర్యలు చేపట్టింది. జననీ సురక్ష, ఏక్ లడ్కీ వంటి ఆకర్షణీయ పథకాలను ప్రవేశపెట్టింది. నగరాలలోని సోనోగ్రఫీ (లింగనిర్ధారణ పరీక్షల కేంద్రాలు), అబార్షన్లు నిర్వహించే ఆస్పత్రులపై గట్టి నిఘా ఏర్పాటు చేసింది. అధికారుల బృందాలు తరచూ తనిఖీలు నిర్వహించాయి. నిబంధనలను ఉల్లంఘించిన వారి సోనోగ్రఫీ యంత్రాలను జప్తు చేయడం వంటి కఠిన చర్యలకు కూడా కార్పొరేషన్ వెనకాడలేదు. ఫలితంగా బాలికల సంఖ్య గణనీయంగా పెరిగింది. 2003 మధ్యకాలంలో ప్రతి వెయ్యిమంది బాలలకు బాలికల సంఖ్య 881 ఉండగా, ప్రస్తుతం అది 960కు చేరింది. ఈ ఏప్రిల్‌లోనే ఆడ శిశువుల జననాల రేటు ఏకంగా వెయ్యికి చేరింది. ఈ నెలలో నగరంలోని వివిధ ఆస్పత్రుల్లో 4,694 మంది శిశువులు జన్మించినట్లు కార్పొరేషన్ ఉప ఆరోగ్య అధికారి డాక్టర్ అంజలి సాబణే తెలిపారు. వీరిలో 2,347 మంది బాలలు, 2,347 మంది బాలికలు ఉన్నారు. అయితే బాలికల వార్షిక జననాల రేటు వెయ్యి కంటే అధికంగా నమోదు చేయడమే తమ లక్ష్యమని స్పష్టీకరించారు.
ఈ సంవత్సరం జననాల వివరాలు
ఈ ఏడాది జనవరిలో 4,662 మంది పిల్లలు జన్మించగా అందులో 2,013 మంది బాలలు, 2,449 మంది బాలికలు ఉన్నారు. మార్చిలో 5,225 మంది పిల్లలు జన్మించగా 2,723 మంది బాలలు, 2,502 మంది బాలికలు ఉన్నారు. అదేవిధంగా ఏప్రిల్‌లో 4,694 మంది శిశువుల్లో 2,347 మంది బాలలు, 2,347 మంది బాలికలు ఉన్నారు. మేలో 4,668 మంది పిల్లలు జన్మించగా వీరిలో 2,430 మంది బాలురు, 2,238 మంది బాలికలు ఉన్నారు. జూన్‌లో 4,128 మంది శిశువుల్లో 2,164 మంది బాలురు, 1,964 మంది బాలికలు ఉన్నారు. జూలైలో 4,359 మంది జన్మించగా, 2,234 మంది బాలురు, 2,125 మంది బాలికలు ఉన్నారు. ఆగస్ట్‌లో 4,362 మంది శిశువులు జన్మించగా బాలురు 2,225 మంది, బాలికలు 2,137 మంది ఉన్నారు.
ఇళ్ల వద్దకే ఆరోగ్య కార్యకర్తలు
భ్రూణహత్యలు అధికంగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించిన పుణే కార్పొరేషన్ అక్కడి ఆస్పత్రుల్లో గట్టి నిఘా ఉంచింది. గర్భిణుల వివరాల నమోదు కార్యక్రమాన్ని చేపట్టింది. వారి బాగోగులను చూసేందుకు ఇళ్ల వద్దకే సిబ్బందిని పంపి మాతా శిశు సంరక్షణకు అన్ని చర్యలూ తీసుకుంది. పైన వివరించిన చర్యల వల్లే మంచి ఫలితాలను రాబట్టగలిగామని కార్పొరేషన్ అధికారి ఒకరు తెలిపారు. ఆరోగ్య కార్యకర్తలను గ్రామాల్లో ప్రతి ఇంటికీ పంపి గర్భిణుల వివరాలను సేకరిస్తున్నారు. చికిత్స అవసరమనుకుంటే ఆస్పత్రులకు తరలిస్తున్నారు. భ్రూణహత్యల నివారణకు భారీగా చర్యలు తీసుకున్న పుణే కార్పొరేషన్ ఇతర సంస్థలకు ఆదర్శంగా నిలిచింది.