పాకిస్తాన్‌కు పో...!
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మెట్రోలో ప్రయాణిస్తున్న ఓ ముస్లిం సీనియర్ సిటిజన్‌కు తీవ్ర అవమానం ఎదురైంది. కొందరు యువకులు వద్దనికి సీటు ఇవ్వడానికి నిరాకరించడమేకాక అతనిని పాకిస్తానీ అంటూ దుర్భాషలాడారు. ఈ ఘటన ఢిల్లీ మెట్రో యెల్లో లైన్‌లో జరిగింది. సీనియర్ సిటిజన్ సీట్లో కూర్చున్న ఇద్దరు యువకులు ముస్లిం వృద్ధునికి సీటు ఇవ్వడానికి నిరాకరించారు. రైల్లో రద్దీ అధికంగా ఉండడంతో ఆయన వారిని లేచి సీటివ్వమని కోరారు. కానీ వారు సీటు ఖాళీ చేయడానికి నిరాకరించడమేకాక రైల్ కోచ్‌లో సీటు కావాలంటే పాకిస్తాన్‌కు వెళ్లిపో అంటూ అపహాస్యం చేశారు.
ఫేస్‌బుక్ పోస్టుతో వెలుగులోకి...
మహిళా హక్కుల కార్యకర్త కవితా కృష్ణమూర్తి ఈ విషయాన్ని ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెలుగులోకి తెచ్చారు. ఏఐసీసీఈయూ జాతీయ కార్యదర్శి సంతోష్ రాయ్ కొన్ని రోజుల కిందట యెల్లో లైన్ మెట్రోలో ప్రయాణిస్తుం డగా ఈ ఘటన జరిగిందని ఆమె తెలిపారు. రాయ్ ఎదురుగా సీనియర్ సిటిజన్ల సీట్లలో ఇద్దరు యువకులు కూర్చుని ఉన్నారని, ఓ వృద్ధుడు వారిని సీటు ఇవ్వవలసిందిగా అడిగినప్పుడు వారు అందుకు నిరాకరించా రని ఆమె తెలిపారు.
ఆయన మరోసారి వారిని సీటు నుంచి లేవమని కోరినప్పుడు ఈ సీటు హిందుస్తానీల కోసమని, నీ వంటి పాకిస్తానీల కోసం కాదని అపహాస్యం చేశారు. అది చూసిన రాయ్ వెంటనే జోక్యం చేసుకుని సీనియర్ ïసిటిజన్‌కు క్షమాపణ చెప్పవలసిందిగా యువకులను డిమాండ్ చేశారు. కానీ మరి కొందరు యువకులు ఇద్దరు యువకులకు అండగా వచ్చి రాయ్ కాలర్ పట్టుకుని పాకిస్తాన్ వెళ్లిపో అంటూ అవమానించారు. దీంతో కొందరు మెట్రో ప్రయాణీకులు రాయ్‌కు మద్దతుగా వచ్చారు.
మెట్రో రైలు ఖాన్ మార్కెట్ స్టేషన్‌లో ఆగినప్పుడు ఓ గార్డు కంపార్ట్ మెంట్‌లోకి వచ్చాడు. అతను రాయ్‌తో పాటు ముస్లిం సీనియర్ సిటిజన్‌ను, ఇద్దరు యువకులను పండారా రోడ్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. కొన్ని రోజుల తరువాత రాయ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లినప్పుడు సీనియర్ సిటిజన్ యువకులను క్షమించి వదిలేశాడని పోలీసులు చెప్పారు. కుర్రచేష్టగా పరిగణించి యువకుల క్షమాపణను స్వీకరిస్తున్నట్లు సీనియర్ సిటిజన్ రాసిచ్చిన లేఖను పోలీసులు రాయ్‌కు చూపారు. ఆ తర్వాత యువకులు రాయ్‌కు కూడా క్షమాపణలు తెలిపారు.