పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా
బెంగళూరులో ప్రారంభమైన బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సమావేశాలు
బెంగళూరు:దేశంలోని చాలా మంది ప్రస్తుతం బీజేపీ వైపు చూస్తున్నారని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అన్నారు. దేశ చర్రితలో ఎన్నడూ లేని విధంగా 2014లో పూర్తి మెజారిటీతో కాంగ్రెసేతర పార్టీ కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, అంతేకాక అదే ఏడాదిలో జరిగిన పలు రాష్ట్రాల ఎన్నికల్లో సైతం బీజేపీ అఖండ విజయాన్ని కైవసం చేసుకుందని హర్షం వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత తొ లిసారిగా బెంగళూరులోని లలిత్ అశోక హోటల్‌లో జాతీయ కార్యనిర్వాహక సభ్యుల సమావేశం శుక్రవారం ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశాలకు వివిధ రాష్ట్రాల నుంచి 330 మంది కార్యనిర్వాహక సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర, హర్యాణ, జార్ఖండ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేవేంద్రఫడ్నావిస్, మనోహర్ లాల్ ఖత్తార్, రఘుబార్‌దాస్‌లతో పాటు గోవా ముఖ్యమంత్రి లక్ష్మీకాంత్ పార్సేకర్, జమ్మూకాశ్మీర్ ఉపముఖ్యమంత్రి నిర్మల్‌కుమార్‌సింగ్‌ను అమిత్ షాతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ సత్కరించారు. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ... తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో బీజేపీలో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని అన్నారు.
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వం చేసిన పనులే ఇందుకు ప్రధాన కారణమని అన్నారు. పాలనలో పారదర్శకత తీసుకురావడం వల్ల ప్రభుత్వ ఖజానాకు ఎన్నో లక్షల కోట్ల ఆదాయం చేకూరిందన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశ వృద్ధిరేటు 4.4 నుంచి 7.4 శాతానికి పెరిగిందన్నారు. పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకువెళ్లాలన్నారు. దేశంలోని ఏ రాజకీయ పార్టీలోనూ లేని విధంగా బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉందని అన్నారు. అందువల్లే సామాన్య పార్టీ కార్యకర్తగా ప్రయాణం మొదలు పెట్టిన నరేంద్రమోదీ ప్రస్తుతం ప్రధానిగా మారారని అన్నారు. కష్టపడి పనిచేసే వారికి సరైన గుర్తింపు ఉంటుంది అని చెప్పడానికి ఇంతకంటే ప్రత్యక్ష ఉదాహరణ ఏదీ లేదన్నారు. బీహార్‌లో తాము జేడీయూతో కలిసి ఉన్నంత వరకు పాలన బాగానే సాగిందని, అయితే తమ మైత్రీ బంధాన్ని జేడీయూ వద్దనుకున్న తర్వాత అక్కడ మళ్లీ ఆటవిక రాజ్యం(జంగల్ రాజ్య్-2) పాలన ప్రారంభమైందని అన్నారు. ఈ నేపథ్యంలో బీహార్ ప్రజలు అక్కడి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహావేశాలతో ఉన్నారని తెలిపారు. త్వరలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఆటవిక పాలనకు వ్యతిరేకంగా పోరాడాలని, అక్కడి ప్రజలు తప్పక బీజేపీకి సంపూర్ణ మెజారిటీ అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అందరి లక్ష్యం ‘బీజేపీ’
Published Sat, Apr 4 2015 2:02 AM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM
Advertisement