చామరాజపేటెలోని ఈద్గా మైదానంలో విక్రయానికి ఉంచిన పొట్టేళ్లు
సాక్షి బెంగళూరు: ముస్లింల పండుగ అయిన బక్రీద్ సమీపిస్తుండటంతో నగరంలో చామరాజపేటెలోని ఈద్గా మైదానంలో గొర్రెలు, మేకల వ్యాపారం పుంజుకుంది. పక్క రాష్ట్రాలతో పాటు విదేశాల నుంచి కూడా పొట్టేళ్లు విక్రయానికి వచ్చాయి. ఇందులో ఆస్ట్రేలియా నుంచి రూ.85 వేలు విలువ చేసే టెగరు జాతి పొట్టేలు అబ్బురపరుస్తోంది. సుమారు 17 నెలల వయసు ఉన్న పొట్టేలు 100 కిలోలు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. కోలార్‌కు చెందిన వ్యక్తి దీనిని కొనుగోలు చేశాడు. అయితే వారం రోజులుగా అక్కడే ప్రదర్శనకు ఉంచారు. మరో వ్యక్తి రూ.55 వేలు వెచ్చించి నలుపు రంగులో ఉన్న పొట్టేలును కొన్నాడు. దీని బరువు సుమారు 75 కేజీలుగా అంచనా వేశారు. ఇంకొకటి 90 కిలోలు ఉండగా రూ.60 వేలు ధరగా నిర్ణయించారు. కనిష్టంగా రూ.5 వేల నుంచి గరిష్టంగా రూ. లక్ష రకు విలువ చేసే గొర్రెలు, పొట్టేళ్లను విక్రయానికి ఉంచారు.
బన్నూరు గొర్రెలకు గిరాకీ
బెంగళూరుతో పాటు కోలారు, రామనగర, బెంగళూరు రూరల్, చిక్కబళ్లాపుర తదితర జిల్లాల్లో గొర్రెలు, పొట్టేళ్ల విక్రయాలు అక్కడక్కడా విక్రయిస్తున్నారు. ఈ సందర్భంగా పలువురు మాంసం వ్యాపారులు పెద్దసంఖ్యలో కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. బన్నూరు జాతికి చెందిన గొర్రెలకు గిరాకీ పెరిగిందని వ్యాపారులు చెబుతున్నారు. అయితే గతేడాదితో పోలిస్తే ఈసారి వ్యాపారం తక్కువగా ఉన్నట్లు జీవాల వ్యాపారులు తెలిపారు. పండుగకు మరో వారం రోజులు గడువు ఉండటంతో వ్యాపారం పెరగవచ్చని ఆశాభావంతో ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment