రగిలిన గోరూరు
రామనగర జిల్లా మాగడి తాలూకా గోరూరు గ్రామం వద్ద డంపింగ్ యార్‌డను ఏర్పాటు చేయరాదంటూ ఆందోళనచేస్తున్న గ్రామస్తులను ఆదుపులోకి తీసుకుంటున్న పోలీసులు. (ఇన్‌సెట్లో) మహిళపై లాఠీచార్‌జ చేస్తున్న పోలీస్
బెంగళూరు : బెంగళూరులో పడుతున్న చెత్తను తీసుకు వచ్చి ఇక్కడ వేసి గ్రామస్తులు ప్రాణాలతో చెలగాటం ఆడరాదని డిమాండ్ చేస్తు రామనగర జిల్లా మాగడి తాలుకా గ్రామస్తులు మండిపడుతున్నారు. ఈ విషయంపై శుక్రవారం పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. రామనగర జిల్లా మాగడి తాలూకా, సోలూరు సమీపంలోని గోరూరు గ్రామం దగ్గర 45 ఏకరాల్లో చెత్త డంపింగ్ యార్డు, విద్యుత్ ఉత్పాదన కేంద్రం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. గత వారం అధికారులు సర్వే చేయడానికి గోరూరు గ్రామం దగ్గరకు వెళ్లారు. స్థానికులు అడ్డుకోవడంతో వారు వెనుతిరిగారు. శుక్రవారం కూడా అధికారులు సర్వే చేస్తుండగా.. గోరూరు, బండేమఠ, సోలూరు, కనకేనహళ్ళి తదితర గ్రామస్తులు వచ్చి అడ్డుకున్నారు. రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులుతో వారు వాగ్వివాదానికి దిగారు. శాసన సభ్యులు బాలకృష్ణ, శ్రీనివాసమూర్తి తదితరులు ధర్నాకు నేతృత్వం వహించారు.
ఇక్కడ చెత్త డంపింగ్ యార్డు ఏర్పాటు చేయరాదని అధికారులు సమక్షంలో స్థానిక మహిళలు కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంటామని బెదిరించడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు విధిలేని పరిస్థితులలో లాఠీచార్జ్ చేయడంతో 11 మంది గాయపడ్డారు. కాగా, అధికారుల తీరును వ్యతిరేకిస్తు శనివారం ఉదయం నుంచి 48 గంటల పాటు జాతీయ రహదారిపై రాస్తారోకో చేయాలని స్థానికులు నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ జామ్‌దార్, సీనియర్ అధికారి రాజేంద్ర ప్రసాద్, రామనగర జిల్లాధికారి చంద్రగుప్త ఆ గ్రామంలోనే మకాం వేశారు. సర్వేని తాత్కలికంగా నిలిపివేశామని రామనగర జిల్లా కలెక్టర్ జామ్‌దార్ తెలిపారు.