మాట నిలబెట్టుకోనున్న ఆప్ సర్కారు
తొలుత ఉచిత తాగునీటి సరఫరా, విద్యుత్ చార్జీల తగ్గింపు హామీల అమలు
అవినీతి బ్యూరో పునరుద్ధరణపై ప్రకటన జనతా దర్బార్‌ల స్థానంలో మరో యంత్రాంగం వేసవిలో కూరగాయల ధరలు పెరగకుండా తగు ఏర్పాట్లు ఈ దిశగా ఇప్పటికే అడుగులు పలువురు కేంద్ర మంత్రులతో భేటీ మేనిఫెస్టోలోని అంశాల అమలుకు కార్యాచరణ ప్రణాళిక ఇందులోభాగంగా అధికారులతో సంప్రదింపులు
న్యూఢిల్లీ: రామ్‌లీలా మైదాన్‌లో శనివారం ప్రమాణ స్వీకారం చేయనున్న ఆప్ సర్కారు... ఉచిత నీటి సరఫరా, విద్యుత్ చార్జీల తగ్గింపు హామీలను తొలుత అమలు చేయనుంది. ఆప్ ప్రభుత్వం మొదట 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందజేయడం, విద్యుత్తు చార్జీలను తగ్గించడం, అవినీతి నిరోధక బ్యూరోను పునరుద్ధరించడానికి సంబంధించిన ప్రకటనలు చేయనుందని ఆ పార్టీ ప్రతినిధి నాగేందర్ శర్మ చెప్పారు. కిందటిసారి మాదిరిగా ఆప్ సర్కారు సచివాలయం వద్ద జనతా దర్బార్ నిర్వహించబోదని , అయితే ప్రజల సమస్యలను , ఫిర్యాదులను పరిష్కరించడానికి మరో యంత్రాంగాన్ని రూపొందిస్తుందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల అమలుకు తమ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తుందని ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న మనీష్ సిసోడియా చెప్పారు. ఈ దిశగా తాము ఇప్పటికే పనిచేయడం ప్రారంభించామని, పలువురు కేంద్ర మంత్రులను కూడా కలిశామన్నారు. వేసవిలో పళ్లు, కూరగాయల ధరలు పెరగకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
అన్ని ప్రభుత్వ విభాగాల అధిపతులకు తమ పార్టీ మేనిఫెస్టోను అందజేస్తామన్నారు. అందులో పేర్కొన్న 70 అంశాల అమలుకు ఎంత సమయం పడుతుంది? వాటిని ఎలా అమలు చేయవచ్చో తెలుపుతూ కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఈ నెల 19న తమ ముందుంచాలని ఆదేశించారు. ఆ తరువాత ప్రభుత్వం ఇందుకు సంబంధించి ప్రకటన చేయనుంది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ (సీఏజీ) నివేదిక వచ్చేలోగా విద్యుత్ చార్జీలను సగానికి తగ్గించడం, 20 వేల లీటర్ల నీటిని ఉచితంగా అందజేయడం కోసం సబ్సిడీలను కొనసాగించడం మినహా ఆప్ సర్కారుకు మరోమార్గం లేదు.
ఉచిత నీటి హామీ అమలుపై చర్చించడం కోసం ఢిల్లీ నీటి సంస్థ (డీజేఈబీ) శుక్రవారం అత్యవసర సమావేశం నిర్వహించింది. అవినీతిని అరికట్టడం కోసం యాంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ)ని పునరుద్ధరించనుంది. ఇందుకోసం ఎయిమ్స్ మాజీ చీఫ్ విజిలెన్స్ అధికారి సంజీవ్ చతుర్వేదిని విజిలెన్స్ చీఫ్‌గా నియమించే అంశాన్నికూడా ఆప్ పరిశీలిస్తోందంటున్నారు. తమ సర్కారు ఏర్పాటైన తరువాత చతుర్వేది సేవలను వినియోగించుకుంటామని ఆప్ గతంలో ప్రకటించిన విషయం విదితమే. జన్‌లోక్‌పాల్ స్వరాజ్ చట్టం ఆప్ హామీలలో ప్రధానమైనది. ఈ బిల్లును మరోసారి విధానసభలో ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. అన్ని కోణాల నుంచి పరిశీలించి రూపొందించిన ఈ బిల్లులను మరోసారి సమీక్షించాల్సిన అవసరం అభిప్రాయపడుతోంది.
విధానసభ రెండో సమావేశంలో ఈ బిల్లులను ప్రవేశపెట్టాలని, ఎల్జీ వద్దకు పంపకుండానే నేరుగా విధానసభ ముందు బిల్లు ఉంచాలని యోచిస్తోంది. విధానసభ ఆమోదించిన తరువాత కేంద్రం ఆమోదం కోసం పంపాలని భావిస్తున్నారు.
ప్రమాణస్వీకారానికి సర్వం సిద్ధం
న్యూఢిల్లీ: కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాంలీలా మైదానంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ విషయాన్ని సంబంధిత అధికారులు తెలియజేశారు. ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్‌తో పాటు ఆ పార్టీ నేతలు మనీష్ సిసోడియా సహా మరో న లుగురు ఆప్ ఎమ్మెల్యేలు మంత్రులుగా శనివారం ప్రమాణ ం చేయనున్నారు. ఈ మైదానంలో 16 అంగుళాల ఎల్‌ఈడీ స్క్రీన్‌లతో పాటు, ప్రమాణ స్వీకార మహోత్సవానికి హాజరయ్యే అభిమానుల సౌకర్యార్ధం మొబైల్ టాయ్‌లెట్‌లను ఏర్పాటు చేశారు. భారీ సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించారు. కాగా గత ఏడాది ఫిబ్రవరి 14న ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన కేజ్రీవాల్ ... ఈ ఏడాది అదే రోజు ముఖ్యమంత్రిగా తిరిగి ప్రమాణ స్వీకారం చేయనుండడం గమనార్హం.