ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై ‘టొబాకో ఫ్రీ’ జోన్లు | Government offices are no longer 'Tobacco-free' zones | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కార్యాలయాలు ఇకపై ‘టొబాకో ఫ్రీ’ జోన్లు

Published Sat, May 31 2014 2:11 AM | Last Updated on Mon, Aug 20 2018 9:16 PM

Government offices are no longer 'Tobacco-free' zones

  • కొత్త చట్టంతో నిబంధనలు కఠినతరం
  •  ఉల్లంఘిస్తే చర్యలు
  •  ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి యూటీ ఖాదర్
  •  సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో విధానసౌధ, వికాస సౌధ సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఇకపై పొగాకు ఉత్పత్తులను వినియోగించకుండా నూతన చట్టం తేనున్నట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి యూటీ ఖాదర్ వెల్లడించారు. విధానసౌధలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం నిషేధిస్తూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఎటువంటి ప్రయోజనం లేదన్నారు.

    అయితే రాష్ట్రంలో పొగాకు ఉత్పత్తుల వినియోగ నియంత్రణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందులో భాగంగా ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో పొగాకు ఉత్పత్తుల వినియోగాన్ని పూర్తిగా నిషేధిస్తూ అధికారిక ప్రకటన వెలువరించనున్నామన్నారు. ఇందుకు వ్యతిరేకంగా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

    పొరుగు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌తో పోలిస్తే కర్ణాటకలో పొగాకు వినియోగం పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోందన్నారు. దక్షిణ భారత దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే కర్ణాటకలో పొగాకు సాగు విస్తీర్ణం 25 శాతం ఎక్కువగా ఉందన్నారు. పొగాకు పంట సాగు విస్తీర్ణం రాష్ట్రంలో ప్రతి ఏడాది పెరిగిపోవడం మరింత ఆందోళన కలిగించే విషయమన్నారు.

    అందువల్ల పొగాకు పంట సాగు విస్తీర్ణాన్ని ప్రతి ఏడాది 5 నుంచి 10 శాతానికి తగ్గించాల్సిందిగా రాష్ట్ర వ్యవసాయ శాఖను కోరామన్నారు. రాష్ట్రంలోని మహానగర పాలికేల్లో పొగాకు నియంత్రణ కేంద్రాలను స్థాపించే ఆలోచన ఉందన్నారు. పొగాకు ఉత్పత్తులను వినియోగించడం వల్ల భారత దేశంలో ప్రతి ఏడాది 10 లక్షల మంది క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. వీరి చికిత్స కోసం ప్రతి ఏడాది కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల రుపాయలు ఖర్చు చేస్తోందన్నారు. బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేసి 2013-14లో 49 వేల మంది పట్టుబడ్డారన్నారు. వారి నుంచి రూ.63 లక్షలను అపరాధ రుసుం వసూలు చేశామని మంత్రి ఖాదర్ తెలిపారు.
     
    లెసైన్సు ప్రదర్శించడం తప్పనిసరి

     
    రాష్ట్రంలో నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని యూటీ ఖాదర్ తెలిపారు. ఇకపై ప్రైవేటు నర్సింగ్ హోం, క్లినిక్‌లను నిర్వహించే వైద్యులు తమ విద్యార్హతతో పాటు ప్రభుత్వం నుంచి పొందిన లెసైన్‌‌సను తప్పక సదరు క్లినిక్‌లలో ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు.

    ఈ మేరకు నూతన చట్టం తీసుకురానున్నామని తెలిపారు. అదే విధంగా అల్లోపతి, ఆయుష్, హోమియోపతి, సిద్ధ, యునాని పద్దతిలో వైద్య సేవలు అందించే వైద్యుల నేమ్ బోర్డులకు ప్రత్యేక రంగులను కేటాయించనున్నామన్నారు. సరైన విద్యార్హతలు లేకుండా వైద్యులమని చెప్పుకుంటూ క్లినిక్‌లు నిర్వహిస్తున్న 1,098 మందిపై కేసులు నమోదు చేశామని ఆయన వివరించారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement