కుందులి ఘటనపై సిట్ విచారణ ఆదేశాలు జారీ చేసినట్లు ప్రకటిస్తున్న ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్
భువనేశ్వర్: కొరాపుట్ జిల్లాలోని పొట్టంగి సమితి కుందులి గ్రామంలో బాలికపట్ల జరిగిన సామూహిక లైంగికదాడి ఘటన, తదనంతర పరిణామాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. జాతీయ మానవ హక్కుల కమిషన్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఈ సంఘటనపట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసి విచారణకు చొరవ కల్పించుకుంటున్నాయి. మరో వైపు ప్రతిపక్షాలు ఈ సంఘటనపై సీబీఐ దర్యాప్తుకు ఆదేశించాలని పట్టుబడుతున్నాయి. ఈ పరిస్థితుల దృష్ట్యా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ బుధవారం తాజా ప్రకటన చేశారు. ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ సంఘటనపై విచారణ జరుపుతుందని ప్రకటించారు. దీంతో ఈ ఉదంతం కొత్త మలుపు తిరిగింది. న్యాయస్థానం పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం కుందులి బాలికపట్ల సామూహిక లైంగిదాడి అనంతర పరిణామాలపై విచారణ చేపడుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
నిందితులను బహిరంగ పరచాలి
గ్రామంలో బాలిక ఆత్మహత్య తరువాత పలు వివాదాస్పద ఆరోపణలు వెలుగు చూస్తున్నాయి. సహజ న్యాయం కల్పించే ధ్యేయంతో మహిళలకు భద్రత కల్పించి గౌరవ ప్రతిష్టలు కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలో ఈ సంఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ వివరించారు. న్యాయస్థానం పర్యవేక్షణలో ఈ మేరకు ఉత్తర్వులు జారీ కావాలని ఆయన అభిప్రాయ పడ్డారు. ఈ బృందం దర్యాప్తు నివేదికను అత్యంత పారదర్శకతతో సకాలంలో ప్రదానం చేస్తే న్యాయం చేసినట్లవుతుందని నవీన్ పట్నాయక్ అభిప్రాయపడ్డారు. కుందులి గ్రామంలో బాలికపట్ల సామూహిక లైంగికదాడి అత్యంత విచారకరం. ఈ సంఘటనపై న్యాయ వ్యవస్థ తనదైన శైలిలో చర్యల్ని చేపట్టడంలో ఎటువంటి భయభ్రాంతులకు లోనుకాకుండా పారదర్శకతతో వ్యవహరించి నిందితుల్ని బహిరంగపరచాలని ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ విజ్ఞప్తి చేశారు. లోగడ ఈ సంఘటనపై విచారణ జరిపేందుకు రాష్ట్ర క్రైం శాఖను ఆదేశించి హై కోర్టు సిటింగ్ న్యాయమూర్తితో న్యాయ విచారణ జరిపేందుకు ముఖ్యమంత్రి ఆదేశించిన విషయం విదితమే.
వివాదాస్పదమైన ఫోరెన్సిక్ నివేదికలు
గత ఏడాది అక్టోబర్ 10వ తేదీన కుందులి గ్రామంలో బాలిక సామూహిక లైంగికదాడికి గురైంది. ఈ సంఘటనపై వైజ్ఞానిక పరీక్షలు నిర్వహించిన రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ జారీ చేసిన ప్రాథమిక, తుది నివేదికలకు పొంతన లేకుండా పోయింది. ఈ సంస్థ జారీ చేసిన ప్రాథమిక నివేదికలో బాధిత బాలిక వస్త్రాలపై వీర్యపు మరకలు ఉన్నట్లు గుర్తించింది. ఈ మరకలు ఇద్దరు వేర్వేరు వ్యక్తులకు చెందినవిగా స్పష్టం చేసింది. తదుపరి జారీ చేసిన తుది నివేదికలో ఈ మేరకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా దుమారం చెలరేగింది. పరిస్థితి చేయి దాటడంతో కోల్‌కత్తాలో పనిచేస్తున్న జాతీయ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో బాలిక సామూహిక లైంగికదాడి సంఘటన అనుబంధ పరీక్షలకు రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శర్మ ఆదేశించారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన మరింత ఉద్ధృతం కావడంతో సీబీఐ దర్యాప్తుకు ఒత్తిడి పెరుగుతోంది
Comments
Please login to add a commentAdd a comment