మహిళ కడుపులో బ్యాండేజ్
ప్రభుత్వ డాక్టర్లు, నర్సుకు అరెస్టు వారెంట్
టీ.నగర్: ప్రసవం చేసే సమయంలో మహిళ కడుపులో బ్యాండేజ్‌తో కుట్లు వేసిన ప్రభుత్వ డాక్టర్లు, నర్సుకు కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. దిండివనం తిరువళ్లువర్ నగర్‌కు చెందిన చోళయప్పన్ (48) కీళమావిళంగైలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. ఇతని భార్య ధరణి (39). ఈమెను గత 26 మే 2004లో ప్రసవం కోసం పుదుచ్చేరి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెకు 7 జూన్ 2004లో శస్త్ర చికిత్సను చేయగా మగబిడ్డ జన్మించింది. ఆ సమయంలో ఆమెకు కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్స చేశారు. అనంతరం 15 జూన్ 2004న ధరణి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.
అయితే ఆమె 30–06–2004 వరకు తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ వచ్చారు. దీంతో ఆమెను మళ్లీ పుదుచ్చేరి ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ ఆమెకు చికిత్సలు అందించి 13 జులై 2004లో డిశ్చార్జ్ చేశారు. అయితే ఇంటికి వచ్చిన ధరణికి ఆపరేషన్ చేసిన స్థలం నుంచి రక్తస్రావం జరుగుతూ వచ్చింది. ఆ తరువాత దిండివనం, విల్లుపురం, చెన్నై ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్సలు పొందారు. 23 సెప్టెంబర్ 2004న చెన్నై ప్రైవేటు ఆసుపత్రిలో స్కాన్ చేయగా కడుపులో బ్యాండేజ్ ఉన్నట్లు తెలిసింది.
దీంతో చోళయప్పన్ పుదుచ్చేరి ప్రభుత్వ ఆసుపత్రిలో ఫిర్యాదు చేశారు. ధరణికి చికిత్సలు అందించిన డాక్టర్లు విజయభాను, జయంతి, నర్సు ఉమలపై పుదుచ్చేరి సెషన్స్ కోర్టులో కేసు దాఖలు చేశారు. ఈ కేసు 13 ఏళ్లుగా విచారణ జరుగుతూ వచ్చింది. అయితే ఇద్దరు డాక్టర్లు, నర్సు విచారణకు కోర్టులో హాజరు కాలేదు. దీంతో మెజిస్ట్రేట్ దయాళన్ డాక్టర్లు, నర్సుకు నాన్‌బెయిలబుల్ అరెస్టు వారెంట్ శనివారం జారీ చేశారు.