అమరావతి షాపింగ్ ఫెస్టివల్ పేరిట ప్రభుత్వం హడావుడి ...!
స్టాల్స్ పెడతారా...లేదా అని హెచ్చరికలు
విముఖత చూపుతున్న వ్యాపార ఏజెన్సీలు
ఎంకి పెళ్లి సుబ్బి చావు కొచ్చిందంటే ఇదేనేమో!...అమరావతి షాపింగ్ ఫెస్టివల్ పేరిట ప్రభుత్వ ప్రచార ఆర్భాటం వ్యాపారులకు సంకట ప్రాయంగా మారింది. వ్యాపారాలు లేక అల్లాడుతుంటే ప్రభుత్వ ప్రచారం కోసం తాము స్టాల్స్ ఏర్పాటు చేయలేమని వాపోతున్నారు. అయితే ప్రభుత్వం తనదైన శైలిలో కొరడా ఝుళిపిస్తోంది. ‘స్టాల్స్ ఏర్పాటు చేయకపోతే మీ వ్యాపారాల సంగతి తేలుస్తాం’ అని అధికారులు హెచ్చరిస్తున్నారు.
సాక్షి, అమరావతి బ్యూరో : విజయవాడ, గుంటూరులలో వ్యాపార ఏజెన్సీలకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్న షాపింగ్ ఫెస్టివల్ మాయాజాలం ఇది.. రెండేళ్లుగా వ్యాపారం డల్‌గా ఉందని వాపోతున్న వ్యాపారులు దసరా నుంచి సంక్రాంతి సీజన్ వరకు కొంతవరకైనా పెరగకపోతుందా అని ఆశిస్తున్నారు. ఇంతలో ప్రభుత్వం ఏకపక్షంగా అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌ను ప్రకటించింది. ఇందులో అన్ని వ్యాపార సంస్థలు తప్పనిసరిగా తమ స్టాల్స్ ఏర్పాటు చేయాలని స్పష్టం చేసింది.
ప్రధానంగా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్- గృహోపకరణాలు, రియల్ ఎస్టేట్ సంస్థలపై దృష్టి సారించింది. ఆ సంస్థల స్టాల్స్ 100కుపైగా ఉండాలని నిర్దేశించింది. వాటిని సందర్శించేందుకే ప్రజలు ఎక్కువ ఆసక్తి చూపుతారన్నది ప్రభుత్వ ఉద్దేశం. ఒక్కో స్టాల్‌కు రూ.40వేల చొప్పున డీడీ చెల్లించి మరీ ఏర్పాటు చేయాలని చెప్పింది. దాంతోపాటు ఇతర నిర్వహణ ఖర్చులు ఉండనే ఉంటాయి.
కానీ ఆ ఫెస్టివల్‌లో ప్రభుత్వ షో తప్ప అసలు వ్యాపారం ఉండదని ఏజెన్సీలు గ్రహించి ఆసక్తి చూపించలేదు. పీక్ సీజన్‌లో తమ షోరూంలలో వ్యాపారాలపై దృష్టి పెట్టాలిగానీ షాపింగ్ ఫెస్టివల్‌లో స్టాల్స్ పెట్టలేమని భావించారు. స్టాల్స్ పెడితే సిబ్బందిని అక్కడ వినియోగించాల్సి వస్తుందని... దీంతో తమ షోరూంలలో వ్యాపారం దెబ్బతింటుందన్నది వారి ఆందోళన.
రియల్ ఎస్టేట్ సంస్థలు రాష్ట్ర విభజన తరువాత కూడా ఆశించినంత బూమ్ లేదని నిరాశతో ఉన్నాయి. ఇటీవల విజయవాడ శివారు ప్రాంతాల్లో నిర్మాణాలను కేవలం రాజకీయ కారణాలతో కూల్చివేస్తుండడం కూడా వారిని ఆవేదనకు గురి చేస్తోంది. దాంతో షాపింగ్ ఫెస్టివల్ ప్రకటించి 15రోజులు అవుతున్నా ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్ -గృహోపకరణాల ఏజన్సీలు సానుకూలంగా స్పందించలేదు. షాపింగ్ ఫెస్టివల్‌ను గురువారం ప్రారంభించాల్సి ఉందని తెలిసినా బుధవారం రాత్రి వరకు ఏ ఏజెన్సీలు స్టాల్స్ ఏర్పాటుకు సుముఖత చూపించలేదు.
‘స్టాల్స్ పెట్టకపోతే మీ సంగతి చూస్తాం’
నిర్దేశించిన మేరకు స్టాల్స్ లేకపోతే సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేస్తారని అధికారులు ఆందోళన చెందారు. జిల్లా ఉన్నతాధికారి వివిధ శాఖల ఉన్నతాధికారులతో బుధవారం రాత్రి మాట్లాడి ఎలాగైనా సరే స్టాల్స్ ఏర్పాటు చేయించాలని ఆదేశించారు. అందుకు సామ దాన దందోపాయాలు ప్రయోగించాలని కూడా స్పష్టం చేశారు. రవాణా శాఖ అధికారి ఒకరు ఆటోమొబైల్ డీలర్లతో మాట్లాడి ఒక్కొక్కరు రెండేసి స్టాల్స్ ఏర్పాటు చేయాల్సిందేనని హుకుం జారీ చేశారు. లేకపోతే షోరూంలలో విక్రయించే వాహనాలకు కల్పిస్తున్న టెంపరరీ రిజిస్ట్రేషన్ సౌకర్యాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తామని హెచ్చరించారు.
దీంతో డీలర్లు బెంబేలెత్తారు. అయిష్టంగానే ఒక్కొక్క స్టాల్ ఏర్పాటుకు సమ్మతించాల్సి వచ్చింది. ఎలక్ట్రానిక్స్ - గృహోపకరణాల ఏజెన్సీలను కూడా సేల్స్, కమర్షియల్ ట్యాక్స్ అధికారులు ‘తమదైన శైలి’లో హెచ్చరించారు. ఇక స్టాల్స్ ఏర్పాటు చేయని రియల్ ఎస్టేట్ సంస్థలను బ్లాక్‌లిస్టులో పెట్టి ఇకముందు లే అవుట్లు, భవన నిర్మాణాలకు అనుమతులు ఇవ్వమని కూడా రెవెన్యూ, సీఆర్‌డీఏ అధికారులు తేల్చిచెప్పారు.
ఈ పరిణామాలతో వ్యాపార వర్గాలు బెంబేలెత్తాయి. అమరావతి షాపింగ్ ఫెస్టివల్‌లో స్టాల్స్ ఏర్పాటుకు సమ్మతించాల్సి వచ్చింది. అదండీ సంగతి... రాజు తలచుకుంటే అన్న రీతిలో వ్యాపారుల మెడలు వచ్చి మరీ ఒప్పించారు.
సంగతి చూస్తాం!
Published Fri, Oct 7 2016 8:50 AM | Last Updated on Fri, May 25 2018 7:10 PM
Advertisement
Advertisement