ముంబై: చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా జరుపుకునే దీపావళిని ముంబై వ్యాప్తంగా ఆదివారం ఘనంగా నిర్వహించారు. వ్యాపారులంతా లక్ష్మీపూజలు నిర్వహించడం కనిపించింది. రాముడు లంకాధీశుడు రావణాసురుడిపై విజయం సాధించి సతీసమేతంగా రాజ్యానికి తిరిగిరావడానికి గుర్తుగా దీపావళిని జరుపుకుంటారని హిందూ పురాణాలు చెబుతాయి. ఆదివారం కార్తీక అమావాస్య కావడం వల్ల గ్రహణం రావాల్సి ఉన్నా భారత్‌లో కనిపించలేదని నిపుణులు తెలిపారు. వ్యాపారులు ఆదివారం సాయంత్రం 6.02 గంటల నుంచి 8.35 గంటల మధ్య లక్ష్మీపూజలు నిర్వహించారు. చాలా మంది గృహస్తులు కొత్తగా కొనుగోలు చేసి బంగారు, వెండి ఆభరణాలకు కూడా పూజాధికాలు నిర్వహించారు.
ముంబాదేవి, మహాలక్ష్మి, స్వామినారాయణ్ ఆలయాల్లో సంప్రదాయ చోప్డీ పూజ నిర్వహించారు. ‘దాదాపు వెయ్యి ఖాతా పుస్తకాలకు ఇక్కడ పూజలు చేశాం. ఇంతకుముందైతే చాలా పుస్తకాలు వచ్చేవి. అయితే చాలా మంది కంప్యూటర్లలోనే ఖాతాలను నిర్వహించడం వల్ల ఈ సంఖ్య తగ్గింది’ అని దాదర్ స్వామినారాయణ్ ఆలయ పూజారి నాగర్ తెలిపారు. కొందరు కంప్యూటర్ తెరముందు నోటుపుస్తకాలు ఉంచి చోప్డీ పూజ నిర్వహిస్తారు. దీపావళి పర్వదినాన స్నేహితులు, బంధువులకు మిఠాయిలు, కానుకలు తప్పనిసరిగా పంచాలని, దురదృష్టవశాత్తూ నగర జీవనశైలిలో ఈ సంప్రదాయం కనుమరుగవుతోందని నాగర్ అన్నారు. ఇక ముంబై మార్కెట్లన్నీ శని, ఆదివారాల్లో కళకళలాడాయి. పెద్ద ఎత్తున బాణసంచా విక్రయాలు జరిగాయి.
షిర్డీలో ఘనంగా దీపోత్సవాలు
దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని షిర్డీలో ఘనంగా దీపోత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా భక్తులు భారీసంఖ్యలో పాల్గొన్నారు. ఆబాలగోపాలం అంతా వేలాది దీపాలను వెలిగించారు. షిర్డీలోని ద్వారకమాయిలో దీపావళి సందర్భంగా నీటితోనే సాయిబాబా దీపాలను వెలిగించినట్టు భక్తులు చెబుతుంటారు. దీంతో ప్రతి దీపావళి పండుగ సందర్భంగా షిర్డీ ఆలయంలో దీపోత్సవాలను నిర్వహిస్తారు. ఈసారి కూడా నాలుగు రోజులపాటు జరిగే ఉత్సవాల్లో వేలాది దీపాలను వెలిగించారు. దీంతో ఈ దీపాలను చూసేం దుకు భారీ ఎత్తున భక్తులు షిర్డీకి తరలివస్తున్నారు. ఈ ఉత్సవాలతోపాటు దీపావళి సెల వుల కారణంగా షిర్డీలో భక్తుల రద్దీ కూడా గణనీయంగా పెరిగిందని ఆలయ ట్రస్ట్ అధికారులు పేర్కొన్నారు.