మిన్నంటిన తెలంగాణ సంబురాలు | grandly celebrated of mumbaikars of telangana formation day | Sakshi
Sakshi News home page

మిన్నంటిన తెలంగాణ సంబురాలు

Published Mon, Jun 2 2014 10:41 PM | Last Updated on Sat, Aug 11 2018 7:30 PM

grandly celebrated of mumbaikars of telangana formation day

సాక్షి, ముంబై: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలను ముంబైలోని తెలంగాణ ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. టీఆర్‌ఎస్, ఎంటీజాక్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం ఉదయం చెంబూర్ నాకా వద్ద తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంటీజాక్‌కు చెందిన వందలాది మంది కార్యకర్తలు ఆటపాటలతో సందడి చేశారు. ఈ వేడుకల్లో తెలంగాణేత ర ప్రజలు కూడా పాల్గొన్నారు. మిఠాయిలు పంచుకుంటూ, గులాబీ పువ్వులను వెదజల్లుతూ నాకాను గులాబిమయం చేశారు.

 ఈ కార్యక్రమానికి అతిథులుగా విచ్చేసిన నిజామాబాద్ జిల్లా ‘జాక్’ కన్వీనర్ చాకు లింగం పద్మశాలి చేతుల మీదుగా ‘టీ అధికారిక రాజముద్రను’ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన రాజముద్రలో పొందుపర్చిన కాకతీయ చిహ్నం, సత్యమేవ జయతే, చార్మినార్ చిహ్నాల గురించి సువిస్తారంగా వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంటీజాక్ కన్వీనర్ దేవానంద్ నాగిల్ల, డాక్టర్ శ్రీగాది లక్ష్మణ్, ఎస్.అంజయ్య, బహుజన కళాకారులు నాగ్‌రాజ్, బి.రాములు మాదిగ, శంకర్, భీంరత్న మాల, టీఆర్‌ఎస్ ముంబైశాఖ ప్రధాన కార్యదర్శి శివరాజ్ బొల్లె, పాండురంగ్ పద్మశాలి, బి.ద్రవిడ్ మాదిగ, మూల్‌నివాసి మాల తదితరులు పాల్గొన్నారు.

 తెలంగాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో..
 ముంబై తెలంగాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఉదయం తూర్పు బాంద్రా  తెలంగాణ సంబురాలు జరుపుకున్నారు. 60 సంవత్సరాల సుదీర్ఘ పోరాటాల ఫలితంగా తెలంగాణ వచ్చినందుకు కార్మిక సంఘం సభ్యులందరూ బాణసంచా పేల్చి మిఠాయిలు పంచారు. ఈ సందర్భంగా పు ష్పాల సత్తయ్య మాట్లాడుతూ.. ఇది తెలంగాణ అ మర వీరుల త్యాగ ఫలితమనీ, వారి కృషి, పో రాటం వల్ల వచ్చిన తెలంగాణను వారికే అంకిత మి వ్వాలని పిలుపునిచ్చారు.

 తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్‌ఎస్ నాయకులందరికీ ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. అంతేకాకుండా నగరానికి వలస వచ్చిన కార్మికులందరికీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఆదుకోవాలని కోరారు. ముంబైలోని తెలంగాణ ప్రజలు కుల ధ్రువీకరణ పత్రం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తెలంగాణ కుల ధ్రువీకరణ పత్రాలు రాష్ట్రంలో వర్తించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రేషన్, ఓటింగ్, ఆధార్ కార్డులు తెలంగాణలో ఉండే విధంగా చూడాలని కోరారు. అధ్యక్షుడు జట్ట కృష్ణ, ఉపాధ్యక్షుడు జె.రాంచందర్, ప్రధాన కార్యదర్శి కుండ చంద్రయ్య, కార్యదర్శి పిట్టల గణేష్, కోశాధికారి పుష్పాల సత్తయ్య, కార్యకర్తలు బొల సిద్దులు, కె. యాదగిరి, కంచర్ల ఉప్పలయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 వర్లిలో...
 స్థానిక తెలుగు సంఘాల ఆధ్వర్యంలో తెలంగాణ  ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. ఆదివారం రాత్రి 10 గంటల నుంచి సాగిన ఈ సంబరాల్లో మహిళలు, వృద్ధులతోపాటు భారీ సంఖ్యలో జనం పాల్గొన్నారు. సంబరాల్లో భాగంగా అన్నపూర్ణ, నారాయణ తదితరులు తెలంగాణ పాటలు పాడి ఉత్తేజపరిచారు. మహిళలు బోనాలతో ఊరేగింపు తీశారు. రాత్రి 12 గంటలకు భారీ కేక్ కట్‌చేసి నోరు తీపి చేసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. బంగారు తెలంగాణ నిర్మాణానికి తమవంతు సహకారాన్ని అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్ట గౌరవాన్ని ఈ మరాఠీ నేలపై ఇనుమడింపచేయాల్సిన బాధ్యత ప్రతి తెలంగాణ వ్యక్తిదన్నారు. మాతృసంస్థ అయిన ఆంధ్రమహాసభలో కూడా తెలంగాణ వారికి తగిన గౌరవమర్యాదలు లభించేలా చర్యలు తీసుకోవాలన్నారు.

 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వర్లి పద్మశాలి సమాజ సుధారక మండలి అధ్యక్షులు వాసాల శ్రీహరి, ప్రధాన కార్యదర్శి కస్తూరి హరిప్రసాద్, ధర్మకర్తల మండలి కార్యదర్శి డాక్టర్ వీరబత్తిని చంద్రశేఖర్, ఆంధ్రమహాసభ అధ్యక్షులు సంకు సుధాకర్, అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక కార్యదర్శి మచ్చ ప్రభాకర్, తెలుగు సాహిత్య వేదిక ప్రధాన కార్యదర్శి సంగెవేని రవీంద్ర, ముంబై తెలుగు మిత్రబృందం చైర్మన్ మర్రి జనార్ధన్, పద్మశాలి యువక సంఘం అధ్యక్షులు గంజి గోవర్ధన్, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు అశోక్ కంటే, మోడ్రన్ ఇంగ్లిష్ స్కూల్ వ్యవస్థాపకులు గాలి మురళి తదితరులతోపాటు మండలి ప్రతినిధులు వేముల మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

 ముంబై టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో...
 చెంబూర్ నాకా వద్ద ముంబై టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాణసంచా పేల్చి సంబరాలు జరుపుకున్నారు. ఒకరికొకరు మిఠాయిలు పంచుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రధాన కార్యదర్శి శివ్‌రాజ్ బొల్లే ఆధ్వర్యంలో జరిగిన ఈ సంబరాలలో వందలసంఖ్యలో కార్యకర్తలు జెండాలు పట్టుకొని ‘జై తెలంగాణ’ అంటూ నినాదాలు చేశారు.

 తెలంగాణ యువజన కార్మిక సంఘం  ఆధ్వర్యంలో...
 తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ యువజన కార్మిక సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ సంబరాలను ధూంధాంగా నిర్వహించారు. సోమవారం ఉదయం బోరివలి స్టేషన్ సమీపంలో తెలుగు నాకా వద్ద జరిగిన సంబరాల్లో వందల సంఖ్యలో తెలంగాణ వాదులు పాల్గొని ఒకరికొకరు మిఠాయిలు పంచుకున్నారు. డ్యాన్సులు చేస్తూ రంగులు చల్లుకుంటూ  ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. సంఘం అధ్యక్షుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ కల సాకారమైందని కొనియాడారు. తెలంగాణ నూతన రాష్ట్రానికి ప్రప్రథమంగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించిన కె. చంద్రశేఖర్‌రావుకు శుభాకాంక్షలు తెలిపారు.

 కార్యక్రమంలో సంఘం ఉపాధ్యక్షులు నూర సతయ్య, పెంట గంగన్న, కోశాధికారి తోట సత్తయ్య, కమిటీ చైర్మన్ నీరటి భూమన్న, సాంస్కృతిక కార్యదర్శి గాజుల నర్సారెడ్డి, సుఠారి నారాయణ, పురంశెట్టి గోపాల్, పంతులుగారి సత్యనారాయణ, గంగాధరి లచ్చన్న, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement