సాక్షి, ముంబై : తెలంగాణ ప్రభుత్వం ఈ నెల 19న సమగ్ర కుటుంబ సర్వే చేపడుతున్నందున మహారాష్ట్రకు వలస వచ్చి స్థిరపడిన వేలాది మంది స్వగ్రామాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. ఈ మేరకు ఇప్పటికే తెలంగాణ వైపు వెళ్లే బస్సులు, రైళ్లు దాదాపు అన్నింటిలోనూ రిజర్వేషన్లు అయిపోయాయి. మరోవైపు అనేక మంది వెళ్లలేని పరిస్థితి.. పొట్టచేతబట్టుకుని ముంబైకి వచ్చిన కూలీలు ఒక్కసారిగా సొంత గ్రామాలకు వెళ్లాలంటే అన్నీ ఇన్నీ ఇబ్బందులు కావు.. సెలవులు దొరకవు.. సమయానికి చేతిలో డబ్బులుండవు.. ఇలా నానా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందినవారైనప్పటికీ సొంత గ్రామాలకు వెళ్లలేకపోతున్నారు.
ముంబై ప్రజలకు హామీ టీ సర్కార్ హామీ
ముంబైలో నివసించే లక్షలాది మంది ప్రజలు ఈ నెల 19న జరగనున్న సమగ్ర కుటుంబ సర్వే విషయంపై తీవ్ర అయోమయంలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ విషయంపై ముంబై టీఆర్‌ఎస్ నాయకులతోపాటు నగరంలోని అనేక సంఘాల ప్రతినిధులు ఫోన్లు, ఇతర సమాచార సాధనాల ద్వారా టీ మంత్రులకు ఇక్కడి వారి సమస్యను తెలియపరిచారు. టీ మంత్రులు కూడా ముంబై ప్రజలకు సమగ్ర కుటుంబ సర్వే విషయంపై ఆందోళన వద్దని హామీ ఇచ్చారని వీరు తెలుపుతున్నారు.
ఇదిలా ఉండగా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి సమగ్ర సర్వే నిర్వహించేందుకు కేసీఆర్ సర్కార్ నిర్ణయించింది. రాష్ట్రంలో ప్రభుత్వం చేపట్టనున్న సంక్షేమ పథకాలు అసలైన లబ్ధిదారులకు చేరాలంటే సమగ్ర సర్వే అవసరమని భావించింది. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఒకేరోజు సర్వే చేపట్టేందుకు కార్యాచరణ రూపొందించారు. సుమారు 4 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులతో ఈ నె ల 19వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజులో సర్వే పూర్తిచేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ఆ రోజు తెలంగాణవాసులంతా ఇళ్లల్లోనే ఉండాలని కోరారు.
ఆ రోజు ఇచ్చిన సమాచారం మేరకు రూపొందించిన సర్వేనే అన్ని సంక్షేమ పథకాలకు ఆధారంగా మారుతుందని తెలిపారు. దీంతో తెలంగాణ జిల్లాల నుంచి మహారాష్ట్రకు వలసపోయిన కుటుంబాల్లో కలవరం మొదలైంది. 19వ తేదీనాటికి ఇళ్లకు రావాలని వారివారి బంధువులు ఎక్కడోఉన్న వారికి సమాచారాలిస్తున్నారు. దీంతో పరాయి రాష్ట్రాలకు ఉపాధి నిమిత్తం తరలివెళ్లిన వారంతా కుటుంబాలతో ఆ రోజునాటికి ఇళ్లకు చేరుకోవాలని ఆతృత పడుతున్నారు.
దీంతో ఒక్కసారిగా అందరు ఊరిబాట పట్టడంతో రైళ్లు, బస్సుల్లో టిక్కెట్లు లభించడంలేదు. కొందరు ప్రైవేట్ వాహనాల ద్వారా తమ స్వగ్రామాలకు బయలుదేరుతున్నారు. అనేక మంది పొట్టచేతబట్టుకుని వచ్చిన కూలీలున్నారు. చిరు ఉద్యోగాలు చేసేవారున్నారు. ఇలా వీరందరికి ఒక్కసారిగా కుటుంబసమేతంగా వెళ్లాలంటే ఆర్థిక పరిస్థితులు అనుకూలించడంలేదు. ముంబై, భివండీ చుట్టుపక్కల పరిసరాల్లోనే లక్షలాది మంది ప్రజలు స్వగ్రామాలకు వెళ్లలేని పరిస్థితిలో ఉన్నారు.
ఈ నేపథ్యంలో ఈ నెల 17వ తేదీ తెలంగాణ వైపు వెళ్లేందుకు ప్రత్యేక రైలు లేదా కనీసం తెలంగాణ వైపు వెళ్లే రైళ్లకు అదనంగా బోగీలను అమర్చాలని వీరు కోరుతున్నారు. మరోవైపు తెలంగాణ ప్రభుత్వం అదనంగా ఆర్టీసీ బస్సులను కూడా నడపాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. ఇలా ఈ విషయంపై ముంబైలోని వివిధ సంఘాల ప్రతినిధులతోపాటు ముంబై టీఆర్‌ఎస్ నాయకులు ఇక్కడి పరిస్థితులు, ప్రజల సమస్యలను టీ మంత్రుల దృష్టికి తీసుకవెళ్లారు. దీంతో కుటుంబం మొత్తం తరలిరావాల్సిన అవసరం లేదని, కుటుంబ వివరాలు మొత్తం చెప్పగలిగే ఒకరుంటే చాలని తెలంగాణ మంత్రులు, నాయకులు సూచించినట్టు ముంబై టీఆర్‌ఎస్ అధ్యక్షుడు బద్ది హేమంత్ కుమార్ తెలిపారు.
ఇసీవక్త్ ఘర్ చలో..
Published Sat, Aug 9 2014 10:37 PM | Last Updated on Sat, Sep 2 2017 11:38 AM
Advertisement
Advertisement