సాక్షి, ముంబై: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించ తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వేపై అటు స్వరాష్ట్రంలోనే కాకుండా ఇటు ముంబైలోనూ సందడి మొదలైంది. సర్వేరోజున కుటుంబ సభ్యులందరూ ఇంట్లో ఉండాలని తెలంగాణ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసిన నేపథ్యంలో ముంబైలోని తెలంగాణ ప్రజలకు స్వగ్రామాల నుంచి ఫోన్లు వస్తున్నాయి. 19వ తేదీ రోజున ఇంట్లో ఉండేలా బయలుదేరి రావాలని సదరు ఫోన్ల సారాంశం.
నాలుగు రాళ్ల కోసం పొట్టచేత పట్టుకొని నగరానికి వచ్చిన తెలంగాణ ప్రజలు ముంబై, ఠాణే, పుణే నగరాల్లో లక్షల సంఖ్యలో ఉన్నారు. వీరంతా ఇప్పుడు తెలంగాణకు పయనమయ్యే యోచనలో ఉన్నారు. అయితే సర్వే అధికారులకు వివరాలు చెప్పేందుకు కుటుంబంలో ఒకరు ఉంటే సరిపోతుందా? లేక సభ్యులంతా ఆరోజు ఇంట్లో ఉండాల్సిందేనా? ఉద్యోగ రీత్యా ఇక్కడికి వచ్చినవారి పరిస్థితి ఏంటి? ఏవైనా కారణాలవల్ల ఆ రోజు సొంత ఊరికి వెళ్లలేకపోతే కుటుంబంలో వారి పేరు గల్లంతవుతుందా? ప్రైవేటు కార్యాలయాల్లో పనిచేస్తున్నవారికి సెలవు దొరకకపోతే ఎలా వెళ్లేది? ఇలా సవాలక్ష సమస్యలు ప్రవాస తెలంగాణ ప్రజలను అయోమయంలోకి నెట్టుతున్నాయి.
న్యూస్ చానళ్లు, దినపత్రికల్లో వస్తున్న కథనాలను చదివి మరింత ఆందోళనకు గురవుతున్నారు. ఉన్నఫలంగా స్వగ్రామాలకు బయలుదేరాలంటే వేల రూపాయల ఖర్చు ఓ వైపు, మరోవైపు వెళ్లలేని పరిస్థితి తెలంగాణ ప్రజలకు సంకటంగా మారింది. సర్వే గురించి స్థానిక తెలంగాణ ప్రజలు ‘సాక్షి’ కార్యాలయానికి, ప్రతినిధులకు ఫోన్లు చేసి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
ఊరిబాట పట్టిన జనం...
ఈ నెల 19న సమగ్ర కుటుంబ సర్వే చేయనున్నారన్న ప్రకటనతో అనేక మంది ఊరిబాట పట్టారు. దీంతో తెలంగాణవైపు వెళ్లే బస్సులు, రైళ్లలో రద్దీ పెరిగింది. ఈ నెల 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు రైళ్లతోపాటు ఆర్‌టీసీ, ప్రైవేట్ బస్సుల టికెట్లన్నీ అమ్ముడుపోయాయి. ఈ తేదీల మధ్య టికెట్లు కావాలన్నా దొరకడంలేదు. దీంతో అనేక మంది ఇప్పటి నుంచే ఊరికి బయలుదేరి వెళ్తున్నారు. పరిణామంగా రైళ్లు, బస్సులలో పెద్దసంఖ్యలో తెలంగాణ ప్రజలు కనిపిస్తున్నారు.
ఆధార్ తర్వాత మళ్లీ ఇప్పుడు....!
ఆధార్ కార్డుల కోసం స్వగ్రామాల బాటపట్టిన తెలంగాణ ప్రజలు మళ్లీ ఇప్పుడు సమగ్ర కుటుంబ సర్వే కారణంగా సొంత ఊరికి వెళ్తున్నారని భారత్ ట్రావెల్స్ యజమాని కె. జనార్ధన్, కుమార్ ట్రావెల్స్ యజమాని గుర్రపు నర్సింహస్వామి, ఆరెంజె ట్రావెల్స్ యజమాని మర్రి జనార్ధన్ ‘సాక్షి’కి తెలిపారు. సర్వే ప్రకటన తర్వాత ప్రయాణికుల సంఖ్య బాగా పెరిగిందన్నారు. దీంతో 15వ తేదీ నుంచి దాదాపు తెలంగాణకు వెళ్లే బస్సులన్నీ ఫుల్ అయ్యాయని చెప్పారు. చాలా మంది టిక్కెట్లు కావాలంటు ఫోన్లు చేస్తున్నారని, గతంలో ఆధార్‌కార్డు సమయంలో కూడా ఇలాగే జరిగిందన్నారు.
వలస బిడ్డలను మరిచారా...?
ఎన్నికలకు ముందు వలస బిడ్డలకు న్యాయం చేస్తామని ప్రకటించిన టీఆర్‌ఎస్, నేడు ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం వలసబిడ్డలను మరిచిపోయిందా? అని పలువురు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ ఏర్పాటు కోసం ఇక్కడి వలస బిడ్డలు ప్రత్యక్షంగా పరోక్షంగా చేసిన పోరాటాం గుర్తు లేదా? అని నిలదీస్తున్నారు. సమగ్ర కుటుంబ సర్వే విషయంలో ముంబైతోపాటు రాష్ట్రంలో నివసించే వలస బిడ్డలను తెలంగాణ ప్రభుత్వం మరిచిపోయినట్లు కనిపిస్తోందని ఆరోపించారు. పరాయి రాష్ట్రాల్లో నివసిస్తున్న తెలంగాణ వలస బిడ్డల కోసం కొన్ని మినహాయింపులు ఇవ్వాలని కోరుతున్నారు. ఆర్థిక పరిస్థితి దయనీయంగా ఉందని, ఉన్నఫలంగా బయల్దేరి రావడం కష్టమనే ఆవేధన ను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ ప్రజలే అత్యధికం....
ముంబైతోపాటు రాష్ట్రవ్యాప్తంగా సుమారు ఒక కోటి మంది తెలుగు ప్రజలున్నారు. వీరిలో సుమారు 80 శాతం మంది తెలంగాణ ప్రాంతాలకు చెందినవారే. అయితే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారిలో కూడా పెద్ద ఎత్తున ఇక్కడే స్థిరపడిన వారున్నారు. దీంతో ఇలా స్థిరపడినవారిలో సమగ్ర కుటుంబ సర్వే విషయంపై పెద్దగా ఎలాంటి కనిపించడంలేదు. అయితే స్వగ్రామాలతో సంబందాలు కలిగి, ఉద్యోగరీత్యా ఇక్కడ ఉంటున్నవారు, తాత్కాలికం గా కూలి, ఇతర పనులపై కొన్ని మాసాలపాటు వచ్చిపోయే వారు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. వలస కూలీల సంఖ్య లక్షల్లో ఉంటుందని, ఒక్క మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ప్రతి సంవత్సరం వేలాది మంది కూలీ పనులకోసం వచ్చి, మళ్లీ స్వగ్రామాలకు వెళ్తుంటారు.
సర్వే సందడి 19న ఊరికి పోవాలె!
Published Thu, Aug 7 2014 10:20 PM | Last Updated on Sat, Sep 2 2017 11:32 AM
Advertisement
Advertisement