చెన్నై ,టీ.నగర్: భార్యతో ఫోన్‌లో మాట్లాడుతూ తిన్న పరోటా గొంతులో చిక్కుకని ఊపిరాడక నవవరుడు మృతిచెందాడు. ఈ సంఘటన తిరుమాంబాక్కంలో జరిగింది. వివరాలు.. పుదుచ్చేరి కరువడి కుప్పం భారతీనగర్‌కు చెందిన పురుషోత్తమన్ (32) తిరుమాంబాక్కంలోని కార్ల విక్రయ షోరూంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య షణ్ముగ సుందరి. వీరికి ఆరు నెలల క్రితం వివాహమైంది. షణ్ముగ సుందరి సొంత ఊరు తిరునెల్వేలి. ఈమె కొద్ది రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. పురుషోత్తమన్ ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. బుధవారం రాత్రి పరోటా కొనుక్కుని వచ్చిన అతను దాన్ని తింటున్నాడు.
అదే సమయంలో భార్య ఫోన్ చేసింది. ఆమెతో నవ్వుతూ మాట్లాడుతూ భోజనం చేశాడు. ఆ సమయంలో పరోటా గొంతులో చిక్కుకోవడంతో మాట్లాడేందుకు వీలుకాలేదు. అతని గొనుగుడు మాత్రమే వినిపించింది. దీంతో దిగ్భ్రాంతి చెందిన ఆమె ముత్యాలపేటలోని బంధువులకు ఫోన్ చేసి విషయం తెలిపింది. వెంటనే వారు భారతీనగర్‌కు వెళ్లారు. ఇంటిలోపల గడియ పెట్టుకున్న పురుషోత్తమన్‌ను పిలుస్తూ తలుపులు తట్టాడు. తలుపులు తెరుచుకోకపోవడంతో ఇరుగుపొరుగు వారి సాయంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ స్ఫృహతప్పిన స్థితిలో ఉన్న పురుషోత్తమన్‌ను ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అతను మృతి చెందినట్టు తెలిపారు. అతను తిన్న పరోటా గొంతులోనే చిక్కుకోవడంతో పురుషోత్తమన్ మృతి చెందినట్టు డాక్టర్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment