మూడు ముళ్ల బంధం
- పెళ్లి పేరిట బాల్యం బందీ
- రాష్ట్రంలో ఏడాదికేడాది పెరుగుతున్న బాల్యవివాహాలు
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో బాల్యం పెళ్లి పేరిట బందీ అవుతోంది. పట్టుమని పదిహేనేళ్లు కూడా దాటకుండానే బాలికలు అత్తారింటికి వెళ్లిపోతున్నారు. బాల్యవివాహ నిషేధ చట్టం గురించి రేడియోల్లో, టీవీల్లో, వార్తాపత్రికల్లో ప్రచారానికే ప్రభుత్వం పరిమితమవుతోందంటూ సామాజికవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యువతులకు 18 ఏళ్లు, యువకులకు 21 ఏళ్లు వచ్చేంత వరకూ వివాహం చేయడం బాల్య వివాహ నిషేధ చట్టం -06ను అనుసరించి నిషేధం.
అయితే రాష్ట్రంలో ఈ చట్టం అమలు ఏ మాత్రం కనిపించడం లేదు. ఈ మూడేళ్లలో 1,018 బాల్య విహాలు జరిగినట్లు రాష్ర్ట మహిళా శిశు సంక్షేమ శాఖ గణంకాలు స్పష్టం చేస్తున్నాయి. పేదరికం, వెనుకబాటుతనం కారణంగా బాగల్‌కోటె, బళ్లారి, కొప్పళ, రాయచూరు, ధార్వాడ, మండ్య, బెల్గాం, గదగ్, దావణగెరె, బీజాపుర, చిత్రదుర్గా, చామరాజనగర జిల్లాల్లో బాల్య వివాహలు ఎక్కువగా జరుగుతున్నట్లు సమాచారం.
ఇక హక్కిబిక్కి, బుడగ, జంగమ వంటి తెగల్లో ఇప్పటికీ యుక్తవయసు రాకుండానే ఆడపిల్లలకు వివాహం చేసి పంపించే సంప్రదాయం ఉంది. వివాహనంతరం చిన్నవయసులోనే గర్భం దాల్చి, ప్రసవ సమయంలో ఇబ్బందులు తలెత్తడంతో మాతాశిశుమరణాలు ఎక్కువగా సంభవిస్తున్నాయి.
ఇంత జరగుతున్నా ప్రభుత్వం ఉదాసీనతతో వ్యవహరిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తల్లిదండ్రుల ఆర్థిక స్థితి మెరుగుపరిచేలా చర్యలు చేపట్టినప్పుడే బాల్య వివాహాలు ఆపగలమని బాలల హక్కులు, సంక్షేమం కోసం కృషి చేస్తున్న సీఆర్‌వై (క్రై) సంస్థ ప్రతినిధి రమేష్ బాటియా తెలిపారు. రాష్ట్ర శిశుసంక్షేమశాఖ వద్ద నమోదైన గణాంకాలకు దాదాపు మూడురె ట్లు ఎక్కువగా బాల్యవివాహాలు జరిగినట్లు తమ సంస్థ పరిశీలనలో తేలిందని ఆయన పేర్కొన్నారు.