- సీఎం విపరీత ప్రచారంతోపెట్టుబడులకు గండం
- కేంద్రానికి తప్పుడు లెక్కలు
- నిధులు పంచుకుతిన్న ’పచ్చ’ నేతలు
- వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్
సాక్షి, విశాఖపట్నం : విశాఖకు హుద్‌హుద్ తుఫాను తెచ్చిన నష్టం కంటే ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన ప్రచారం వల్లే ఎక్కువ నష్టం వాటిల్లిందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. ప్రకృతిని జయించిన వీరుడిలా, హుద్‌హుద్ తుఫానును జయించిన ధీరుడిలా చంద్రబాబు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. హుద్‌హుద్ వచ్చి రెండేళ్లయిన సందర్భంగా బుధవారం సాయంత్రం నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు.
హుద్‌హుద్ తర్వాత ఒక టీడీపీ ఎంపీ విశాఖలో ఎవరూ పెట్టుబడులు పెట్టవద్దని, మళ్లీ అలాంటి తుఫాను వస్తే నష్టపోతారని ప్రకటించారన్నా రు. హుద్‌హుద్ నష్టంపై సీఎం విశాఖలో ఎవ రూ నిలదొక్కుకోలేర నేలా పదేపదే ప్రచారం చేయడం వల్ల ఇక్కడ పెట్టుబడులకు ముందు కు రాలేదని చెప్పారు.
హుద్‌హుద్ తర్వాత విశాఖ వచ్చిన ప్రధానికి రూ.లక్ష కోట్ల నష్టం వాటిల్లిందని, రూ.10 వేల కోట్ల సాయం అం దించాలని కోరడంతో తక్షణమే రూ.వెయ్యి కోట్ల సాయం ప్రకటించారన్నారు. ఇప్పటిదాకా అందులో రూ.680 కోట్లు విడుదలయ్యాయన్నారు. తుఫానులో పప్పులు, ఉప్పులు, ఉల్లిపాయలు, టమాటాలకు రూ. 400 కోట్లు ఖర్చయినట్టు చంద్రబాబు కేంద్రానికి లెక్కలు చూపించారని తెలిపారు. అవి తప్పుడు లెక్కలని పసిగట్టిన కేంద్రం నిత్యావసర సరకులకు కేవలం రూ.30 కోట్లను మాత్ర మే విడుదల చేసిందన్నారు. అంతేకాదు.. హుద్‌హుద్ నష్టంపై చంద్రబాబు ప్రభుత్వం వేసిన అంచనాలు కూడా తప్పేనన్నారు.
సాయం సొమ్ము ఏమయింది?
హుద్‌హుద్ తర్వాత ప్రపంచ దేశాలు, వివిధ సంస్థలు సాయం కింద ఇచ్చిన సొమ్ము ఏమయిందని, ఈ ప్రాంతానికి ఆ నిధులు ఖర్చు చేశారా? అని అమర్‌నాథ్ ప్రశ్నించారు. ఆ తుఫాన్‌కు లక్షా 40 వేల ఇళ్లు దెబ్బతిన్నాయని, 49 వేల పూరిగుడిసెలు నేలమట్టమయ్యాయని, ఇప్పటికి ఒక్క ఇల్లయినా కట్టించారా? అని నిలదీశారు. జిల్లాలోని పూడిమడకలో ఓ సాఫ్ట్‌వేర్ సంస్థ 200 ఇళ్లు నిర్మిస్తే సీఎం వాటి ప్రారంభోత్సవానికి వెళ్లడం సిగ్గుచేటన్నారు.
స్టీల్‌ప్లాంట్‌కు రూ.3 వేల కోట్ల నష్టం వాటిల్లితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. కేవలం రూ.100 కోట్ల బీమా సొమ్ము తప్ప ఇంకేమీ రాలేదని, నవరత్న సంస్థను కాపాడడానికి సాయం చేయలేదని విమర్శించారు. హుద్‌హుద్‌లో పంటలు, తోటలు బాగా నష్టపోయాయని, వాటికి పూర్తిస్థాయిలో పరిహారం కూడా అందలేదన్నారు. ’హుద్‌హుద్ తర్వాత బస్సులో ఉంటూ పునరావాస కార్యక్రమాలు పర్యవేక్షించానంటున్న చంద్రబాబు ఆర్టీసీ బస్సులో ఉన్నారా? తన బావమరిది బాలకృష్ణకు చెందిన షూటింగ్ బస్సులో రోజుకు రూ.24 వేల డీజిల్ ఖర్చు చేసి బసచేశారు’ అని గుర్తు చేశారు.
పచ్చ నాయకులకు దసరా పండగ హుద్‌హుద్ రూపంలో వచ్చిందన్నారు. హైదరాబాద్‌లో హైటెక్స్ నిర్మాణం మినహా చంద్రబాబు ఇంకేమీ అభివృద్ధి చేయలేదన్నారు. ప్రచారంలో దిట్టయిన బాబు.. పెద్దింటి పెళ్లిళ్లకు ఈవెంట్ మేనేజర్‌గా పనికొస్తారన్నారు. ఆయన తన ప్రచారాన్ని పేదలను ఆదుకోవడానికి చేస్తే మంచిదని హితవు పలికారు.
ఆ భూములపై బహిరంగ చర్చకు సిద్ధం
టీడీపీ నేతలు కబ్జాకు యత్నిస్తున్న రూ.వెరుు్య కోట్లకు పైగా విలువైన నగరంలోని దసపల్లా భూములపై బహిరంగ చర్చకు సిద్ధమని అమర్‌నాథ్ ప్రకటించారు. ఏ టీవీ ఛానల్ నేతృత్వంలోనైనా చర్చకు రావాలని ఆయన సవాల్ విసిరారు. ఈ భూములపై అవసరమైతే సుప్రీంకోర్టుకు కూడా వెళ్తామని స్పష్టం చేశారు.
సమావేశంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొయ్య ప్రసాదరెడ్డి, ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రవిరెడ్డి, సమన్వయకర్త తిప్పల నాగిరెడ్డి, ఎస్సీసెల్ జిల్లా అధ్యక్షుడు బోని శివరామకృష్ణ, సేవాదళ్ నగరాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, సాంస్కృతిక విభాగం అధ్యక్షురాలు రాధ తదితరులు పాల్గొన్నారు.