ముంబై: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) తరఫున చండీగఢ్ నియోజకవర్గం నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగి పరాజయం పాలైనప్పటికీ బాలీవుడ్ నటి గుల్‌పనాగ్ ఎంతమాత్రం డీలాపడిపోలేదు. ఆప్ నేత అర్వింద్‌తో మున్ముందు కూడా కలసి పనిచేస్తానంది. దాదాపుగా రాజకీయాల్లోనే కొనసాగుతానంటూ అనుపమ్ ఖేర్ సతీమణి కిరణ్‌ఖేర్‌తో తలపడి పరాజయం పాలైన గుల్‌పనాగ్ తన మదిలో మాట బయటపెట్టింది. కేవలం ఈ ఎన్నికల కోసమే ఇక్కడికి రాలేదని, సుదీర్ఘ కాలం కొనసాగుతానని అంది. ప్రజలు ఇచ్చిన తీర్పును శిరసావహిస్తానంది. ‘చండీగఢ్‌వాసులు తమ ఓటుహక్కును ప్రశాంతంగా వినియోగించుకున్నారు. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చారు.
ఈ తీర్పుతో నేను ఎంతో ప్రశాంతంగా ఉన్నా. నా పట్ల చూపిన అభిమానానికి, నాకు మద్దతుగా నిలిచినందుకు చండీగఢ్‌వాసులందరికీ ధన్యవాదాలు’ అని అంది. తొలిసారిగా బరిలోకి దిగిన తనకు ఎంతో బాగా సహకరించిందంటూ ఈ మాజీ బ్యూటీ ఆప్‌ను అభినందించింది. ‘కేంద్ర పాలిత ప్రాంతంలో బరిలోకి దిగడం ఇదే తొలిసారి. నాలుగో వంతు ఓట్లు మాకు వచ్చాయి. అందువల్ల తమ గొంతుకను ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడానికి ఎంతమాత్రం వీల్లేదు’ అని చెప్పింది. ‘భవిష్యత్తుపై ఎంతో ఆశతో ఉన్నా. ప్రజలు ఎంతో నమ్మకంతో తీర్పు ఇచ్చినందువల్ల ఎన్డీయే బాధ్యతాయుతంగా వ్యవహరిస్తుందని భావిస్తున్నా’ అని అంది. జాతి నిర్మాణంలో మీతోపాటు మీ పార్టీ పాత్ర ఏమిటని ప్రశ్నించగా ‘చండీగఢ్‌వాసులకు నిరంతరం సేవలందిస్తా. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం విషయంలో కట్టుబడి ఉంటాను’ అని వివరించింది.
రాజకీయాల్లోనే ఉంటా
Published Mon, May 19 2014 11:01 PM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement
Advertisement