
వీడిన 26 ఏళ్ల అజ్ఞాతం!
సాక్షి చొరవతో స్వగ్రామానికి చేరుకున్న గల్ఫ్ బాధితుడు
కోరుట్ల/కోరుట్ల రూరల్: పొట్ట చేతపట్టుకొని గల్ఫ్ వెళ్లాడు.. ఉత్తి చేతులతో ఇంటికి తిరిగి రావడానికి మనసొప్పక.. ఇంటికి సమాచారం ఇవ్వకుండా అక్కడే అష్టకష్టాలు పడ్డాడు. చివరికి ‘సాక్షి’కథనం.. ఓ సోషల్ వర్కర్ చేయూతతో 26 ఏళ్ల తర్వాత గల్ఫ్ బాధితుడు శనివారం స్వగ్రామానికి చేరుకున్నాడు. చిన్న నాడు వదిలి వెళ్లిన పిల్లలు ఎదిగిన వైనాన్ని చూసి కన్నీళ్ల పర్యంతమయ్యాడు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం సంగెం గ్రామానికి చెందిన శనిగారం గంగారాంకు భార్య పెద్దు లు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. 1991 మేలో ఉపాధి కోసం దుబాయ్ వెళ్లి, అక్కడి అల్ అప్తూర్ కంపనీలో లేబర్ పనికి అగ్రిమెంట్‌తో 6 సంవత్సరాలుగా పనిచేశాడు.
జీతం సరి పోవడం లేదని బయటి ఇండ్లల్లో పని చేసుకుంటే ఎక్కువ సంపాదించవచ్చనే ఉద్దేశం తో కల్లివిల్లి(కంపెనీ వదిలి బయట పని చేయడం) అయ్యాడు. అప్పటి నుండి అతడి ఆచూకీ లేక ఇంట్లో భార్య పెద్దులు, పిల్లలు ఆవేదన చెందేవారు. ఎక్కడ ఉన్నాడో..ఏం చేస్తున్నాడో తెలియక ఎడతెగని ఆందోళనలో కాలం గడిపారు. ఊర్లోకి దుబాయి నుంచి ఎవరు వచ్చినా తన భర్త ఆచూకీ కోసం పెద్దు లు ఆరా తీసేది. ఎవరు సరైన సమాధానం చెప్పకపోయే సరికి నిరాశతో కాలం గడిపింది. చివరికి భర్త గంగారాం దుబాయ్‌లో ఉండగానే ఇద్దరు కూతుళ్ల పెళ్లిళ్లు చేసింది. ఏడు నెలల క్రితం దుబాయ్ పోలీసులు గంగారాంను పట్టుకుని వీసా సరైన ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో జైల్లో ఉంచారు.
సాక్షి చొరవ..సోషల్ వర్కర్ సాయం
దుబాయ్‌జైలులో గంగారాం అనే వ్యక్తి ఉన్నా డనే సమాచారంతో మూడు నెలల క్రితం ‘సాక్షి’గంగారం కుటుంబ వ్యథను ప్రచురిం చింది. అంతటితో ఆగకుండా రెవెన్యూ అధికారులతో మాట్లాడి సంగెం గ్రామానికి చెందిన వాడేనని ధ్రువీకరణ పత్రం అందేలా సాయపడింది. ఈ క్రమంలో హైదరాబాద్‌కు చెందిన శశికళ అనే సోషల్‌వర్కర్ దుబాయి జైల్లో ఉన్న గంగారాంను చూసి వివరాలు అడిగి తెలుసుకుంది. తన వద్ద ఎలాంటి ఆధా రాలు లేవని చెప్పటంతో ఆమె వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, ఆధారాలు తీసుకోమని చెప్పింది. ఈ క్రమంలో గ్రామ సర్పంచ్ కేర్తి రాజమణి, సింగిల్‌విండో చైర్మన్ చీటి వెంక ట్రావ్, కులపెద్ద శనిగారం రాజం సహకారం తో గంగారాంకు చెందిన ధృవీకరణ పత్రాలు దుబాయ్ ఎంబసీకి పంపించారు. ఈ పత్రా లను చూపిన శశికళ రెండు రోజుల క్రితం గంగారాంను ఇండియా విమానం ఎక్కించి పంపించారు. చివరికి శుక్రవారం గంగారాం తన స్వగ్రామమైన సంగెంకు చేరుకుని కుటుం బ సభ్యులకు కలుసుకుని కన్నీరుమున్నీర య్యాడు. ఇరవై ఆరేళ్ల తరువాత భర్త గంగా రాం ఇంటికి రావడంతో భార్య పెద్దులు ఆనందానికి అవధులు లేకుండాపోయాయి.
చాలా కష్టాలు పడ్డాను
దుబాయ్‌లో చాలా కష్టాలు పడ్డాను. మొదట వెళ్లిన కంపెనీలో జీతం సరిపోక వేరే కంపెనీలు చాలా వాటిలో చేశాను. దుబాయ్ నుంచి డబ్బులతో తిరిగి వస్తాన ని నా కుటుంబసభ్యులు అనుకు న్నారు. ఉట్టిగనే తిరిగిరావడానికి నాకు మన సొప్పలేదు. అందుకే ఇంటి వాళ్లకు ఏమి చెప్పకుండా అక్కడే ఉండి ఏదో ఓ పని చేస్తూ గడిపాను. ఆరు నెలల క్రితం నా దగ్గర పాస్‌పోర్టు..వీసా కాగితాలు సరిగా లేక జైల్లో పడ్డాను. చివరికి శశికళ నన్ను చూసి ఇక్కడికి పంపించింది. చివరికి నేను కుటుంబ సభ్యులను కలుసుకోగలిగాను.
–గంగారాం, సంగెం,కోరుట్ల