జిల్లాలో బుధవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈ కారణంగా రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఈదురు గాలుల తీవ్రతతో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి.
షోలాపూర్, న్యూస్‌లైన్: జిల్లాలో బుధవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈ కారణంగా రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఈదురు గాలుల తీవ్రతతో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు నేలకూలడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అనేకమంది నిరాశ్రయులయ్యారు. పలుచోట్ల తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా కొద్దిసేపు నిలిచిపోయింది. దీంతో పట్టణంలోని కొన్ని ప్రాంతాలు అంధకారమయ్యాయి. గోదుతాయి పరులేకర్ బీడీ వర్కర్స్ కాంప్లెక్స్‌లో చెట్టు విరిగి పడడంతో మయూర్ (11) అనే బాలుడు మృతి చెందాడు. నీలంనగర్‌లో పాఠశాల పైకప్పు ఊడి పడడంతో 13 మంది విద్యార్థులు గాయపడ్డారు.
స్వాగత్‌నగర్‌లో ఇంటి కప్పు పడడంతో ఇద్దరు గాయపడ్డారు. పట్టణంలో, శివారు ప్రాంతాల్లో 400 లకు పైగా విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. తేర్హే గ్రామపొలిమేరలోని సిద్ధానాథ్ చక్కెర ఫ్యాక్టరీలో ఉంచిన దాదాపు లక్ష చక్కెర సంచులు వర్షానికి తడిసిపోయాయి. దీంతో సుమారు రూ.11 లక్షల మేర నష్టం వాటిల్లింది. మాడా, పండర్‌పూర్, మంగళవేడా, మొహుల్, దక్షిణ, ఉత్తర షోలాపూర్, అక్కల్‌కోట్ తదితర తాలూకాల్లో మామిడి, శనగ, గోధుమ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటితోపాటు ద్రాక్ష, అరటి పండ్ల తోటలకు కూడా నష్టం వాటిల్లింది.