mayur
-
అప్పుడే డిసైడ్ అయ్యా...జేసీ మయూర్ అశోక్..
సాక్షి, విశాఖపట్నం: రంగుల ప్రపంచంలో స్వేచ్ఛా విహంగం బాల్యం. కొత్త ప్రపంచంలోకి నడిపించే శైశవదశలో ప్రతి విషయం ఓ మధుర జ్ఞాపకమే అన్నారు జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్. బాలల దినోత్సవం సందర్భంగా తన చిన్న నాటి జ్ఞాపకాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. బాల్యంలో జరిగిన ఒక సంఘటన తన జీవితాన్ని మలుపుతిప్పిందని చెప్పారు. ‘మా సొంతూరు మహారాష్ట్రలోని బీడ్. నేను 6వ తరగతి చదువుతున్న రోజులవి. స్కూల్లో ఉన్న సమయంలో గుజరాత్‌లోని భుజ్‌లో భారీ భూకంపం వచ్చిందని మా టీచర్లు చెప్పారు. స్కూల్లో ఉదయం ప్రతిజ్ఞ సమయంలో వార్తలు చదివేవాళ్లం. దేశం యావత్తూ భుజ్ భూకంప బాధితులకు సహాయం చేసేందుకు ముందుకొస్తోందని.. మనం కూడా సాయమందిద్దామని టీచర్లు చెప్పారు. ఫండ్ కలెక్ట్ చేసేందుకు టీమ్ లీడర్‌గా నన్ను ఎంపిక చేశారు. ప్రతి విద్యార్థి నుంచి ఫండ్ కలెక్ట్ చేస్తూ.. దానికి సంబంధించిన లెక్కలను ఎప్పటికప్పుడు హెడ్ సర్కి చెప్పేవాడిని. అప్పుడే ఒక ఆర్థిక బాధ్యత, నాయకత్వ లక్షణాలు, సమయపాలన అలవర్చుకున్నాను. ఫండ్ ఎంత ఎక్కువగా ఇస్తే.. అంత మందికి సాయం చేయగలమన్న ఆలోచన నాలో వచ్చింది. అందుకే ప్రతి విద్యార్థీ వీలైనంత పెద్ద మొత్తంలో డబ్బులు అందించేలా ప్రోత్సహించాను. ప్రతి క్లాస్‌కు వెళ్లి మోటివేషన్ స్పీచ్ ఇచ్చేవాడిని. అది అందర్నీ ఆకట్టుకుంది. అప్ప ట్లోనే మా స్కూల్ తరఫున దాదాపు రూ.5లక్షల వరకు సేకరించగలిగాం. దీంతో నన్ను టీచర్లు అభినందించారు. ఈ మొత్తాన్ని జిల్లా కలెక్టర్‌కు అప్పగించే బాధ్యతను నాకే అప్పగించారు. అప్పుడే మొదటిసారి కలెక్టరేట్‌కు వెళ్లాను.అక్కడ కలెక్టర్ చాంబర్ చూశాను. ఐఏఎస్ అధికారి ఎలా ఉంటారన్నది చూసిన నాకు అక్కడ వాతావరణం ప్రేరేపించింది. నాలో కొత్త ఆలోచనలను రేకెత్తించేలా చేసింది. ఐఏఎస్ అధికారి కావాలన్న లక్ష్యాన్ని నాలో కలిగించిందీ ఆ సంఘటనే.. అప్పటి నుంచి ఐఏఎస్ అవ్వాలంటే ఏం చేయాలని మా టీచర్లను, తల్లిదండ్రులను అడిగేవాడిని. వారు చెప్పినదానికనుగుణంగా ప్లాన్ చేసుకున్నాను. ఐఐటీ బాంబేలో కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో బీటెక్ పూర్తి చేశాను. ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా చదివాను. తర్వాత 2018లో సివిల్స్‌కు ఎంపికై .. నా కలను నెరవేర్చుకున్నాను. ప్రణాళికాబద్ధంగా శైశవదశను ఆస్వాదిస్తే.. ప్రతి ఒక్కరి బాల్యం మనకు కథ అవుతుంది. భావితరాలకు చరిత్రగా మారుతుంది’ అని జేసీ మయూర్ అశోక్ చెబుతూ.. అందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.ఆ సంఘటనే మలుపు తిప్పిందిచిల్డ్రన్స్ డే రోజున ఏదో ఒక గేమ్‌లో ప్రైజ్‌లు వచ్చేవి. నాకు బాగా గుర్తుంది.. ఒకటో తరగతిలో స్వాతంత్య్ర సమరయోధుల వేషధారణలపై పోటీలు నిర్వహించారు. నేను నేతాజీ సుభాష్ చంద్రబోస్ గెటప్‌లో వెళ్లి డైలాగ్‌లు చెప్పాను. నాకే ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అని జేసీ గుర్తు చేసుకుంటూ సంబరపడ్డారు. -
మయూర్- వీఎస్టీ టిల్లర్స్ జూమ్
ముంబై: తొలుత వరుసగా మూడో రోజు సరికొత్త గరిష్టాలను అందుకున్నదేశీ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం ఆటుపోట్ల మధ్య సానుకూలంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో వీఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో అంచనాలకు తగిన పనితీరు చూపడంతోపాటు.. సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు అనుమతించిన వార్తలతో మయూర్ యూనికోటర్స్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం.. వీఎస్టీ టిల్లర్స్ ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో వీఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ నికర లాభం ఐదు రెట్లు ఎగసి రూ. 30 కోట్లకు చేరింది. నికర అమ్మకాలు సైతం 37 శాతం పెరిగి రూ. 220 కోట్లను తాకాయి. ఇబిటా మార్జిన్లు 5.9 శాతం బలపడి 17.1 శాతానికి చేరాయి. పవర్ టిల్లర్ అమ్మకాలు 41 శాతం అధికంగా 7,924 యూనిట్లను తాకగా.. ట్రాక్టర్ల విక్రయాలు సైతం 25 శాతం వృద్ధితో 2,751 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ కాలంలో కంపెనీ రూ. 140 కోట్ల నగదును సముపార్జించింది. ఫలితాల నేపథ్యంలో వీఎస్టీ షేరు తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 11 శాతం దూసుకెళ్లి రూ. 1,939ను తాకింది. ప్రస్తుతం 9 శాతం జంప్‌చేసి రూ. 1,911 వద్ద ట్రేడవుతోంది. మయూర్ యూనికోటర్స్ ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో మయూర్ యూనికోటర్స్ నికర లాభం 9 శాతం క్షీణించి రూ. 20 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 4 శాతం తక్కువగా రూ. 126 కోట్లను తాకింది. అయితే ఇబిటా మార్జిన్లు 5.6 శాతం బలపడి 23 శాతానికి చేరాయి. కాగా.. షేరుకి రూ. 400 ధర మించకుండా కంపెనీ ఈక్విటీలో 1.65 శాతం వాటాను బైబ్యాక్ చేసేందుకు బోర్డు అనుమతించినట్లు మయూర్ యూనికోటర్స్ తెలియజేసింది. ఇందుకు రూ. 30 కోట్లవరకూ వెచ్చించనుంది. ఈ నేపథ్యంలో మయూర్ యూనికోటర్స్ షేరు తొలుత ఎన్ఎస్ఈలో దాదాపు 8 శాతం జంప్‌చేసి రూ. 275ను తాకింది. ప్రస్తుతం 4.5 శాతం లాభంతో రూ. 267 వద్ద ట్రేడవుతోంది. -
తన ఫొటోలు, వీడియోల వైరల్‌పై ఫిర్యాదు
సాక్షి,సిటీబ్యూరో/సుల్తాన్‌బజార్ : మయూర్ పాన్‌షాప్‌ల యజమాని కుమారుడు ఉపేంద్ర వర్మ చేతిలో మోసపోయినట్లు కాచిగడూ పోలీసులకు ఫిర్యాదు చేసిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ శనివారం సిటీ సైబర్ క్రైమ్ ఠాణాను ఆశ్రయించారు. తన అనుమతి లేకుండా తనకు సంబంధించిన కొన్ని ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంపై ఆమె ఫిర్యాదు చేశారు. ఫేస్బుక్ ద్వారా 2013లో పరిచయమైన బాధితురాలిని ఉపేంద్ర వర్మ 2017లో వివాహం చేసుకున్నాడు. అప్పటికే వివాహితుడైన విషయం దాచి ఆమెతో హనీమూన్‌కు వెళ్ళివచ్చాడు. ఆపై అసలు విష యం చెప్పడంతో పాటు తన వద్ద ఉన్న ఆమెకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత వీడియోలు, ఫొటో లు ఇంటర్నెట్లో పెడతానని బెదిరించాడు. దీంతో బాధితురాలు కాచిగూడ పోలీసులకు ఆశ్రయించగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు శుక్రవారం ఉపేంద్ర వర్మతో పాటు అతడికి సహకరించిన మరో ముగ్గురు స్నేహితుల్ని అరెస్టు చేశారు. ఇది జరిగిన తర్వాత ఉపేంద్ర వర్మతో బాధితురాలు ఉన్న అనేక ఫొటోలు, వీడియోలు సోషల్‌మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న ఆమె శనివారం సైబర్ క్రైమ్ పోలీసులు ఆశ్రయించారు. వీటిని పోస్ట్ చేసిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నారు. పాన్‌షాప్ ముట్టడి యువతులపై అత్యాచారాలకు పాల్పడుతున్న ముయూరి పాన్‌షాప్ యజమాని ఉపేందర్‌వర్మను ఉరి తీయాలని అంతర్జాతీయ మానవ హక్కుల కమిషన్ గ్రేటర్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి శీలం సరస్వతీ డిమాండ్ చేశారు. శనివారం శీలం సరస్వతి ఆధ్వర్యంలో బొగ్గులకుంటలోని మయూరి పాన్శాప్ను మహిళ సంఘం నాయకులు ముట్టడించారు. ఉపేందర్‌వర్మను ఉరితీసి, దుకాణాన్ని సీజ్ చేయాలని ప్లకార్డులు ప్రదర్శించి ధర్నాకు దిగారు. కార్యక్రమంలో సంఘం నాయకులు రాధిక, శోభ, శారద, నాగమణి, లత, ఆర్ఎ. వినోద్‌కుమార్, శ్రావణి, పద్మ, నికాత్బేగం తదితరులు పాల్గొన్నారు. -
షోలాపూర్ జిల్లాలో వడగండ్ల వాన
షోలాపూర్, న్యూస్‌లైన్: జిల్లాలో బుధవారం సాయంత్రం వడగండ్ల వాన కురిసింది. ఈ కారణంగా రైతులకు అపార నష్టం వాటిల్లింది. ఈదురు గాలుల తీవ్రతతో ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు నేలకూలడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. అనేకమంది నిరాశ్రయులయ్యారు. పలుచోట్ల తీగలు తెగిపోవడంతో విద్యుత్ సరఫరా కొద్దిసేపు నిలిచిపోయింది. దీంతో పట్టణంలోని కొన్ని ప్రాంతాలు అంధకారమయ్యాయి. గోదుతాయి పరులేకర్ బీడీ వర్కర్స్ కాంప్లెక్స్‌లో చెట్టు విరిగి పడడంతో మయూర్ (11) అనే బాలుడు మృతి చెందాడు. నీలంనగర్‌లో పాఠశాల పైకప్పు ఊడి పడడంతో 13 మంది విద్యార్థులు గాయపడ్డారు. స్వాగత్‌నగర్‌లో ఇంటి కప్పు పడడంతో ఇద్దరు గాయపడ్డారు. పట్టణంలో, శివారు ప్రాంతాల్లో 400 లకు పైగా విద్యుత్ స్తంభాలు కూలిపోయాయి. తేర్హే గ్రామపొలిమేరలోని సిద్ధానాథ్ చక్కెర ఫ్యాక్టరీలో ఉంచిన దాదాపు లక్ష చక్కెర సంచులు వర్షానికి తడిసిపోయాయి. దీంతో సుమారు రూ.11 లక్షల మేర నష్టం వాటిల్లింది. మాడా, పండర్పూర్, మంగళవేడా, మొహుల్, దక్షిణ, ఉత్తర షోలాపూర్, అక్కల్కోట్ తదితర తాలూకాల్లో మామిడి, శనగ, గోధుమ పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వీటితోపాటు ద్రాక్ష, అరటి పండ్ల తోటలకు కూడా నష్టం వాటిల్లింది.