ముంబై: తొలుత వరుసగా మూడో రోజు సరికొత్త గరిష్టాలను అందుకున్నదేశీ స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం ఆటుపోట్ల మధ్య సానుకూలంగా కదులుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) రెండో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించడంతో వీఎస్‌టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ కౌంటర్‌కు డిమాండ్ పెరిగింది. మరోవైపు ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో అంచనాలకు తగిన పనితీరు చూపడంతోపాటు.. సొంత ఈక్విటీ షేర్ల కొనుగోలు(బైబ్యాక్)కు బోర్డు అనుమతించిన వార్తలతో మయూర్ యూనికోటర్స్ కౌంటర్ సైతం వెలుగులోకి వచ్చింది. వెరసి ఈ రెండు కౌంటర్లూ భారీ లాభాలతో సందడి చేస్తున్నాయి. వివరాలు చూద్దాం..
వీఎస్‌టీ టిల్లర్స్
ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో వీఎస్‌టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ నికర లాభం ఐదు రెట్లు ఎగసి రూ. 30 కోట్లకు చేరింది. నికర అమ్మకాలు సైతం 37 శాతం పెరిగి రూ. 220 కోట్లను తాకాయి. ఇబిటా మార్జిన్లు 5.9 శాతం బలపడి 17.1 శాతానికి చేరాయి. పవర్ టిల్లర్ అమ్మకాలు 41 శాతం అధికంగా 7,924 యూనిట్లను తాకగా.. ట్రాక్టర్ల విక్రయాలు సైతం 25 శాతం వృద్ధితో 2,751 యూనిట్లుగా నమోదయ్యాయి. ఈ కాలంలో కంపెనీ రూ. 140 కోట్ల నగదును సముపార్జించింది. ఫలితాల నేపథ్యంలో వీఎస్‌టీ షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 11 శాతం దూసుకెళ్లి రూ. 1,939ను తాకింది. ప్రస్తుతం 9 శాతం జంప్‌చేసి రూ. 1,911 వద్ద ట్రేడవుతోంది.
మయూర్ యూనికోటర్స్
ఈ ఏడాది క్యూ2(జులై- ఆగస్ట్)లో మయూర్ యూనికోటర్స్ నికర లాభం 9 శాతం క్షీణించి రూ. 20 కోట్లకు పరిమితమైంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన మొత్తం ఆదాయం సైతం 4 శాతం తక్కువగా రూ. 126 కోట్లను తాకింది. అయితే ఇబిటా మార్జిన్లు 5.6 శాతం బలపడి 23 శాతానికి చేరాయి. కాగా.. షేరుకి రూ. 400 ధర మించకుండా కంపెనీ ఈక్విటీలో 1.65 శాతం వాటాను బైబ్యాక్ చేసేందుకు బోర్డు అనుమతించినట్లు మయూర్ యూనికోటర్స్ తెలియజేసింది. ఇందుకు రూ. 30 కోట్లవరకూ వెచ్చించనుంది. ఈ నేపథ్యంలో మయూర్ యూనికోటర్స్ షేరు తొలుత ఎన్‌ఎస్‌ఈలో దాదాపు 8 శాతం జంప్‌చేసి రూ. 275ను తాకింది. ప్రస్తుతం 4.5 శాతం లాభంతో రూ. 267 వద్ద ట్రేడవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment