ఆ'ధారం' కావాలి | handloom workers happy for new district of rajanna sircilla | Sakshi
Sakshi News home page

ఆ'ధారం' కావాలి

Published Mon, Oct 17 2016 1:05 PM | Last Updated on Mon, Sep 4 2017 5:30 PM

handloom workers happy for new district of rajanna sircilla

నేతన్నల్లో చిగురిస్తున్న ఆశలు
కొత్త జిల్లా ఆవిర్భావం ఫలితం
 
సిరిసిల్ల : సిరిసంపదలతో తులతూగిన శ్రీశాల ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకుంది. దానిని సంక్షోభంలోంచి గట్టెక్కించేందుకు రాజన్న జిల్లా ఏర్పాటుతో మార్గం సుగమమైంది. మరమగ్గాల మధ్య పన్నెండు గంటలపాటు అలుపెరగకుండా శ్రమించే వారికి పూటగడవడం గగనమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా 42వేల మరమగ్గాలు ఉండగా.. ఒక్క సిరిసిల్లలోనే 33 వేలు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని 24 వేల చేనేత మగ్గాలపై ఆధారపడి 30వేల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. పవర్‌లూమ్స్‌(మరమగ్గాల)పై మరో 25 వేల మంది పనిచేస్తున్నారు. వస్త్రపరిశ్రమలోని సమస్యలు, సవాళ్లు, పరిష్కారాలపై కథనమిదీ..
 
ఇదీ నేతన్న బతుకు..
శివనగర్‌లో సాంచాలు నడుపుతున్న ఇతడి పేరు కొండబత్తిని సూర్యనారాయణ(46). భీమదేవరపల్లి మండలం కొప్పూరు స్వగ్రా మం. ఉపాధి కోసం ఆరేళ్లక్రితం సిరిసిల్ల వచ్చి పాలిస్టర్‌ మరమగ్గాల్లో పని చేస్తున్నా డు. అంతకు ముందు 20 ఏళ్ల పాటు భీవండిలో పనిచేశాడు. భార్య విజయ, కుమారుడు, కూతురు ఉన్నారు. రోజూ 12 గంటలు పనిచేస్తే నెలకు రూ.10వేల వరకు వేతనం వస్తుంది. గైర్హాజరైన రోజు వేతనంకోత ఉంటుంది. పిల్లల చదువులు, ఇంటిఅద్దెకు, నిత్యావసరాలు, కరెంట్‌ బిల్లుకు వేతనం సరిపోవడంలేదు. అనారోగ్యానికి గురైతే వైద్యం కోసం అప్పు చేయకతప్పదు. నేత కార్మికులకు ఇచ్చే 35 కిలోల బియ్యం(ఏఏవై) కార్డు లేదు. కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. ఇది ఒక్క సూర్యనారాయణ దుస్థితే కాదు.. ఇతడితోపాటే పనిచేసే చిప్ప విజయ్‌కుమార్‌(35)దీ ఇదే పరిస్థితి. ఇలా మరమగ్గాల మధ్య పని చేసే కార్మికుల అందరిదీ ఇదే దుస్థితి.
 
పెత్తనమంతా పెట్టుబడిదారులదే..
వస్త్రపరిశ్రమలో మూడంచెల విధానం కొనసాగుతోంది. మిల్లుల ద్వారా యజమానులు (మాస్టర్‌ వీవర్స్‌) నూలును దిగుమతి చేసి సైజింగుల్లో భీములను నింపి ఆసాముల (వీవర్స్‌)కు ఇస్తారు. ఆ భీములను తమ సాంచాలపై (మరమగ్గాలు) బిగించి వస్త్రం తయారు చేశాక ఆ గుడ్డను మళ్లీ యజమానులకే విక్రయిస్తారు. ఆసాములు మగ్గాలు నడుపుతూనే మరో ఒకరిద్దరు కార్మికులకు ఉపాధి కల్పిస్తారు. మగ్గాల యజమానే కరెంటు బిల్లులు భరిస్తాడు. ఇక్కడ యజమాని, ఆసామి, కార్మికుడు అనే మూడంచెల విధానం అమలవుతోంది. 50మంది వరకు యజమానులు, 5 వేల మంది ఆసాములు ఉన్నారు. వీరితోపాటు 25వేల మంది కార్మికులు వస్త్రపరిశ్రమలో పని చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వానికి అజమాయిషీ లేదు. పెత్తనమంతా పెట్టుబడిదారులదే.
 
ఇవీ పరిష్కారాలు..
వస్త్రపరిశ్రమలో తక్షణమే 8 గంటల పని విధానం అమలు చేయాలి
ముడిసరుకు సరఫరా కోసం ప్రభుత్వమే అన్నిరకాల వస్త్రం తయారీకి అనువైన నూలు డిపోలు ఏర్పాటు చేయాలి.
మూస పద్ధతికి స్వస్తి చెప్పి మార్కెట్‌లో డిమాండ్‌ను బట్టి గుడ్డ ఉత్పత్తి చేయాలి. ఇందుకోసం యజమానులు, ఆసాములు, కార్మికులను ప్రోత్సహించాలి. 
అందుబాటులో ఆధునిక సైజింగ్, వార్పింగ్, డైయింగ్, ప్రాసెసింగ్, ప్రింటింగ్‌ యూనిట్స్‌ ఏర్పాటు చేసి ప్రపంచ మార్కెట్‌లో పోటీని తట్టుకునేలా వస్త్రాన్ని ఉత్పత్తి చేయించాలి. 
వస్త్రం కొనుగోలుకు ఆప్కో తరహాలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలి. ధర పతనమైనప్పుడు నిల్వ చేసుకునే ఉత్పత్తిదారులకు రుణవసతి కల్పించాలి. 
రాష్ట్రప్రభుత్వం ఈసారి విద్యార్థుల యూనిఫామ్స్‌ కోసం 1.14 కోట్ల మీటర్ల వస్త్రాన్ని కొనుగోలు చేసింది.
మ్యాక్స్‌ సొసైటీలకు యార్న్‌ కొనుగోలుకు 50 శాతం అడ్వాన్స్‌ డబ్బులు చెల్లించాలి.
ప్రభుత్వ సంస్థలైన మున్సిపల్, సింగరేణి, ఆస్పత్రులు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లు వస్త్రం కొనుగోలు చేయాలి.
ప్రభుత్వ శాఖల ఆర్డర్లకు ముందే  కార్మికుల కూలి రేట్లను జౌళిశాఖ నిర్ణయించాలి.
కార్మికులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వాలి.
పీఎఫ్‌ సౌకర్యం కల్పించాలి, జనశ్రీ బీమా పథకం వర్తింపజేయాలి
చేనేత కార్మికుల మాదిరిగా ‘ట్రిప్ట్‌’ పథకం ద్వారా సిరిసిల్ల మరమగ్గాల కార్మికులకు పొదుపు సదుపాయం కల్పించాలి.
చేనేత కార్మికులకు కూలిలో నిత్యం రూ.15 కోత వి«ధించి వారి వ్యక్తిగతబ్యాంకు ఖాతాలో జమ చేస్తున్నారు. ప్రభుత్వం మరో రూ.15 ఇస్తుంది. పని దినాల ఆధారంగా నెలకు రూ.800 జమ అవుతుంది. ఈ విధానంతో ఎంతోకొంత భరోసా కలుగుతోంది.
అర్హులైన కార్మికులకు ఏఏవై కార్డులు అందించాలి. అనర్హలను తొలగించాలి.
మరమగ్గాలపై వస్త్రోత్పత్తితోపాటు దోమలతెరలు, చీరలు, ఆస్పత్రులకు అవసరమైన వస్త్రాల ఉత్పత్తి ప్రోత్సహించాలి.
చేనేత సహకార సంఘాల మాదిరిగానే పవర్‌లూం సహకార సంఘాలను ఏర్పాటు చేయాలి.
వీటికి ప్రభుత్వం ద్వారా ఆర్థికసాయం, బ్యాంకు రుణ వసతి కల్పించాలి.
ఆధునిక మగ్గాలపై వస్త్రోత్పత్తి, డిజైన్‌ వస్త్రాల ఉత్పత్తి కోసం కార్మికుల్లో వృత్తి నైపుణ్యం పెంచేందుకు శిక్షణ ఇవ్వాలి.
మహిళలకు కుట్లు, అల్లికల్లో శిక్షణ ఇవ్వాలి.
బీడీలకు ప్రత్నామ్యాయ ఉపాధి చూపించాలి. గార్మెంట్‌ పరిశ్రమను విస్తరించాలి.
 
మంత్రిపైనే ఆశలు
రాజన్న సిరిసిల్ల జిల్లా ఏర్పాటుతో తమకు ఉపాధి మెరుగవుతుందని నేతకార్మికులు స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, మున్సిపల్‌శాఖ మంత్రి కె.తారక రామారావుపై ఆశలు పెంచుకున్నారు. వీరికి మెరుగైన ఉపాధి కల్పించాలి. 50 శాతం విద్యుత్‌ రాయితీ ఆసాములు, యజమానులకే వర్తిస్తుండగా ఆ మేరకు కార్మికులకు ప్రయోజనం దక్కడం లేదు. ఇందుకు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. వస్త్రపరిశ్రమకు ప్రత్యామ్యాయ పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలి.
 
సమస్యలు.. సవాళ్లు
వస్త్ర పరిశ్రమ ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉంది.
కొందరు మార్వాడీలు నూలు సరఫరా చేస్తూ వస్త్రాన్ని వారే కొనుగోలు చేస్తారు.
పొరుగు రాష్ట్రాల నుంచి వస్త్రం మన రాష్ట్రానికి దిగుమతి అవుతుంది. ఇక్కడ ఉత్పత్తి వ్యయానికి, గిట్టుబాటు ధరకు మధ్య వ్యత్యాసం చాలా ఉండడంతో నష్టానికి బట్టను అమ్మాల్సి వస్తోంది.
మీటరు పాలిస్టర్‌ వస్త్రం ఉత్పత్తికి రూ.5 ఖర్చు అవుతుండగా.. అంతే ధరతో విక్రయించాల్సి వస్తోంది. మార్కెట్‌ సౌకర్యం లేక ఒక్కోసారి రూ.4.50 కే అప్పగించాల్సి వస్తోంది.
మరమగ్గాల మరమ్మతు, మరమ్మతు దరలు పెరగడం, ముడిసరుకు ధరలు ఆకాశాన్నంటడం, పొరుగు రాష్ట్రాల నుంచి భారీఎత్తున వస్త్రం వచ్చి చేరడం ఇందుకు కారణమైంది.
రాత్రి,పగలు 12గంటలపాటు పని చేయడం ద్వారా కార్మికులు, ఆసాములు శారీరకంగా, మానసికంగా అలసిపోతున్నారు. అనారోగ్యం బారినపడుతున్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement