సాక్షి, ముంబై: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో హవాలా మార్గంలో పెద్ద ఎత్తున సొమ్ము రాష్ట్రంలోకి చాప కింద నీరులా చేరుతోంది. కమీషన్ కోసం ఆశపడి పలువురు యువకులు ఈ మార్గంలో సొమ్ము తరలించేందుకు ముందుకు వస్తున్నారు. దీంతో పోలీసులకు కూడా ఈ హవాలా రాకెట్‌ను అరికట్టడం కష్టంగా మారుతోంది. ప్రస్తుతం ఎన్నికల్లో ఖర్చుల నిమిత్తం పలువురు రాజకీయ నాయకులు లెక్కకు మించి సొమ్ము ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. దీనికోసం వివిధ మార్గాల్లో సొమ్మును సేకరించడం మొదలుపెట్టారు. ఇదే క్రమంలో ‘హవాలా’ సొమ్ము వరదలా రాష్ర్టంలోకి చేరుతోంది. దీంతో పోలీసులు అప్రమత్తమై డేగ కళ్లతో సోదాలు చేస్తున్నారు.
ఇటీవల భాండూప్ పోలీస్‌స్టేషన్ ఇన్‌స్పెక్టర్ నితిన్ గిజే నేతృత్వంలోని బృందం దాడుల్లో రూ.25 లక్షల నగదు పట్టుబడింది. ఈ మొత్తాన్ని కువైట్ నుంచి హవాలా మార్గం ద్వారా భారత్‌కు తరలించినట్లు ఆశ్చర్యకరమైన విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం భాండూప్‌లోని సోనాపూర్ ప్రాంతంలో కూరగాయల సంచిలో రూ.25 లక్షలు తీసుకుని ఆటో వెళుతున్నట్లు సమాచారం అందింది. దీంతో నితిన్ నేతృత్వంలోని బృందం డబ్బును తీసుకెళుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మహబూబ్ అలీఖాన్ (60), ఇనాముల్ ఖాన్ (32), రాంప్రసాద్ యాదవ్ (36)గా గుర్తించారు.
ఈ మొత్తాన్ని తన కుటుంబ సభ్యుడొకరు కువైట్ నుంచి తీసుకుని వచ్చినట్లు మహబూబ్ వెల్లడించాడు. ప్రతీ జిల్లాలో ఇలా హవాలా మార్గంలో డబ్బు తీసుకొచ్చేవారు దాదాపు వందకుపైనే ఉన్నట్లు వీరు వెల్లడించారు. కమీషన్ డబ్బులకు ఆశపడి పలువురు యువకులు ఈ ఉచ్చులో చిక్కుకుపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు దాదాపు రూ.2.72 కోట్ల సొమ్ము హవాలా మార్గంలో వచ్చినట్లు పట్టుబడిన ఓ ఏజంట్ తెలపడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు.
డబ్బు.. మంచినీళ్ల ప్రాయం
ఎలాంటి ఎన్నికలు జరిగినా రాజకీయ పార్టీలు విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేయడం పరిపాటిగా మారింది. ఇందులో కొంత డబ్బు అధికారికంగా ఖర్చు చేయగా ఎక్కువ శాతం డబ్బు గుట్టుచప్పడు కాకుండా చేస్తారు. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ డబ్బులు ఖర్చు చేయడం మరింత ఎక్కువవుతుంది. ఈ శాసనసభ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలన్నీ సొంతంగా బరిలో దిగడంవల్ల అభ్యర్థులకు విజయం కత్తిమీద సామే. ముఖ్యంగా ఈ ఎన్నికలను వారు సవాలుగా తీసుకుని శక్తినంతా కూడగట్టుకుని ప్రచారాలు చేస్తున్నారు. సభలు, ర్యాలీలు, ఇంటింటికి తమ గురించి ప్రచారం చేయడం తదితరాలకు ప్రతీ అభ్యర్థికి సుమారు రూ.8-10 కోట్లు వృథా కానున్నాయి.
నియోజక వర్గాల్లో అభ్యర్థుల ఖర్చు ఇలా ...
1. ప్రతి సంఘానికి, హౌసింగ్ సొసైటీ సంస్థలకు రూ.50- 60 వేలు రహస్యంగా చెల్లిస్తారు.
2. ప్రతి ప్రచార కార్యక్రమానికి వచ్చే ఒక్కో అద్దె కార్యకర్తకు రూ.600 చెల్లించాల్సి ఉంటుంది.
3. మహిళా సంఘాలకు రహస్యంగా రూ.10-15 వేలు చెల్లిస్తారు.
4. రోజూ భోజనం, అల్పాహారానికి రూ.15-20 వేలు ఖర్చు.
5. ఆఖరు రోజు ఒక్కో ఓటరుకు రూ.రెండు వేల నుంచి రూ.మూడు వేల వరకు గుట్టుచప్పుడు కాకుండా ఇస్తారు.
6. ఎన్నికల రోజు పార్టీ బూత్‌లో కూర్చుండే ఒక్కో కార్యకర్తకు రూ.1,500, పదాధికారికి రూ.4-5 వేలు చెల్లిస్తారు.
7. తాత్కాలిక పార్టీ బూత్ నిర్మాణానికి దాదాపు రూ. మూడు వేలు ఖర్చు.
చాపకింద నీరులా.. ‘హవాలా’!
Published Sat, Oct 4 2014 10:29 PM | Last Updated on Sat, Sep 2 2017 2:20 PM
Advertisement