జైలు శిక్ష అనుభవిస్తున్న సైనైడ్ మల్లికకు కింది కోర్టు విధించిన ఉరి శిక్షను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది.
సాక్షి, బెంగళూరు: పలు హత్య కేసుల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న సైనైడ్ మల్లికకు కింది కోర్టు విధించిన ఉరి శిక్షను కర్ణాటక హైకోర్టు రద్దు చేసింది. న్యాయమూర్తులు రవి మళిమఠ్, జాన్ మైకేల్ డి.కున్హాలతో కూడిన బెంచ్ ఈ మేరకు తీర్పు ఇచ్చింది. పదేళ్ల క్రితం దొడ్డబళ్లాపురలో నివాసం ఉంటున్న నాగలక్ష్మి అనే మహిళను హత్య చేసి నగలు, నగదు దోచుకున్న కేసులో సైనేడ్ మల్లిక నిందితురాలు.
బెంగళూరు గ్రామీణ కోర్టు మల్లికను దోషిగా తేల్చి ఆమెకు ఉరి శిక్షను విధిస్తూ తీర్పును ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ కేసులో సైనైడ్ మల్లికకు ఉరి శిక్షను ఖరారు చేయాల్సిందిగా రిజిస్టార్ జనరల్ హైకోర్టుకు విన్నవించారు. పరిశీలించిన హైకోర్టు ఉరిశిక్షను రద్దు చేయడంతో పాటు ఈ కేసును పునర్విచారించాలని బెంగళూరు గ్రామీణ కోర్టును హైకోర్టు పీఠం సూచించింది.
ఆరుగురిని ఆమె హతమార్చినట్టు ఆమె ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మల్లిక ప్రస్తుతం పరప్పణ అగ్రహార సెంట్రల్ జైల్లో ఉన్నారు. అన్నాడీఎంకే నాయకురాలు శశికళ పక్క సెల్‌లోనే ఆమె ఉంటున్నారు.