నన్ను ప్రత్యేక ఖైదీగా గుర్తించండి: శశికళ
బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలుశిక్ష పడ్డ అన్నా డీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ బెంగళూరు కోర్టులో లొంగిపోయిన నేపథ్యంలో పరప్పణ అగ్రహార జైలు పరిసరాల్లో భారీగా పోలీసులను మోహరించారు. చెన్నై నుంచి రోడ్డు మార్గం ద్వారా ఆమె బెంగళూరు చేరుకున్నారు. తనను ప్రత్యేక ఖైదీగా గుర్తించాలని శశికళ న్యాయస్థానాన్ని కోరారు. ఇంటి భోజనం, మినరల్ వాటర్, ఏసీ, టీవీ సౌకర్యం కల్పించాలని కోరుతూ ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో పిటిషన్ వేశారు.
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళతో పాటు మరో ముగ్గురిని దోషులుగా సుప్రీంకోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో శశికళకు నాలుగేళ్ల శిక్షతో పాటు రూ. 10 కోట్ల జరిమానా విధించింది. వెంటనే లొంగిపోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు శశికళ బెంగళూరు కోర్టులో హాజరయ్యారు. ఈ కేసులో జయలలితతో కలసి శశికళ గతంలో ఆర్నెళ్లు పరప్పణ అగ్రహార జైలులో ఉన్నారు. ఈ ఆరు నెలల శిక్షకాలాన్ని పరిగణనలోకి తీసుకుని ఇప్పుడు శశికళ మిగిలిన మూడున్నరేళ్ల జైలుశిక్షను అనుభవించాలి. ఈ కేసులో దోషులుగా తేలిన సుధాకరన్, ఇళవరసి కూడా ఇదే శిక్షను అనుభవించాల్సి ఉంటుంది. ఈ కేసులో దిగువ కోర్టులో దోషిగా తేలిన జయలలిత మరణించిన నేపథ్యంలో ఆమెపై దాఖలైన అప్పీళ్లను రద్దు చేస్తున్నట్లు సుప్రీంకోర్టు ప్రకటించింది.