తూత్తుకుడి పర్యటనలో రజనీకాంత్ (ఫైల్)
ఉద్యమకారుల్ని సంఘ విద్రోహ శక్తులతో పోల్చుతూ తలైవా రజనీకాంత్ చేసిన వ్యాఖ్యలు కేసు నమోదుకు దారితీసేనా అన్న ప్రశ్న బయలుదేరింది. ఈ విషయంగా కింది కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు బుధవారం మద్రాసు హైకోర్టు సూచించడం గమనార్హం. కాగా, కాల్పుల ఘటనపై సీబీసీఐడీ విచారణ తూత్తుకుడిలో మొదలైంది.
సాక్షి, చెన్నై : తూత్తుకూడిలో రజనీ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదయ్యే పరిస్థితి కనిపిస్తోంది. స్టెరిలైట్ ఉద్యమం పయనంలో భాగంగా గత నెల సాగిన ర్యాలీ కాల్పులకు దారితీసిన విషయం తెలిసిందే. ఇందులో 13 మంది బలయ్యారు. సంచలనం రేపిన ఈ ఘటనలో బాధితుల్ని అన్ని పార్టీ ల నేతలు పరామర్శిస్తూ వచ్చారు. అలాగే, దక్షిణ భారత చలనచిత్ర సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం బాధితుల్ని పరామర్శించారు. మీడియాతో మాట్లాడే క్రమంలో ఆయన నోరు జారారు. ఉద్యమ కారుల్ని సంఘ విద్రోహశక్తులుగా పోల్చుతూ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. పోలీసుల మీద దాడి జరగడంతోనే కాల్పులకు పరిస్థితులు దారితీసినట్టు, సంఘ విద్రోహశక్తులు ఉన్నట్టుగా ఆయన చేసిన వ్యాఖ్యల్ని అస్త్రంగా చేసుకుని హొసూరు శిలంబరసన్ పోలీసుల్ని ఆశ్రయించారు.
కేసు నమోదు చేయాలని కోరారు. పోలీసులు ఖాతరు చేయకపోవడంతో మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి ప్రకాశ్ ‘కింది కోర్టును ఎందుకు ఆశ్రయించ లేదు’ అని పిటిషనర్‌ను ప్రశ్నించారు. రజనీకాంత్‌పై కేసు నమోదు విషయంగా కింది కోర్టును ఆశ్రయించాలని పిటిషనర్‌కు న్యాయమూర్తి సూచించారు. దీంతో కింది కోర్టును ఆశ్రయించేందుకు తగ్గ ప్రయత్నాల మీద శిలంబరసన్ దృష్టి పెట్టారు. కింది కోర్టు ఏదేని ఆదేశాలు ఇచ్చిన పక్షంలో తలైవా మీద కేసు నమోదు అయ్యేనా అన్న ప్రశ్న బయలుదేరింది.
సీబీసీఐడీ విచారణ
తూత్తుకుడి కాల్పుల ఘటనపై సీబీసీఐడీ విచారణకు శ్రీకారం చుట్టింది. ఆ విభాగం ఎస్పీ ప్రవీణ్ కుమార్ అభినవ్ నేతృత్వంలోని బృందం బుధవారం తూత్తుకుడికి చేరుకుంది. అక్కడి సీబీసీఐడీ కార్యాలయంలో సిబ్బందితో భేటీ తదుపరి సంఘటన జరిగిన ప్రాంతాల్లో అభినవ్ పర్యటించారు. కాల్పుల ఘటన, అల్లర్లకు దారితీసిన పరిస్థితులను అధ్యయనం చేశారు. అలాగే, జిల్లా ఎస్పీ మురళీ రంభతో భేటీ అయ్యారు. స్థానికపోలీసులు నమోదుచేసిన ఐదు రకాల సెక్షన్లతో కూడిన కేసుల వివరాల్ని తెలుసుకున్నారు. తమదైన శైలిలో విచారణను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు సీబీసీఐడీ ఎస్సీ అభినవ్ నేతృత్వంలోని బృందం ముందుకు సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment