బ్లాక్ డే అలర్ట్!
Published Fri, Dec 6 2013 3:11 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM
సాక్షి, చెన్నై:1992 డిసెంబర్ 6 దేశ చరిత్రకు మాయని మచ్చను సృష్టించిన రోజు. బాబ్రీ మసీదును కూల్చి వేసిన ఈ రోజున బ్లాక్ డే గా పరిగణిస్తూ వస్తున్నారు. ఈ రోజున విధ్వంసాలకు తీవ్ర వాదులు తెగబడొచ్చన్న సమాచారంతో ప్రతి ఏటా భద్రతను కట్టు దిట్టం చేస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రంలో తీవ్ర వాదుల కార్యకలాపాలు ఒక దాని తర్వాత మరొకటి వెలుగులోకి వస్తుండటంతో భద్రతను ప్రశ్నార్థకం చేస్తున్నది. బెంగళూరు బాంబు పేలుళ్ల కేసు రాష్ట్రం చుట్టూ తిరుగుతున్న సమయంలో, హిందూ నేతల్ని టార్గెట్ చేస్తున్న తీవ్ర వాదుల ముఠా కదలికలు వెలుగులోకి వచ్చాయి. ఎట్టకేలకు తీవ్రవాదులైన ఇస్మాయిల్, బిలాల్, ఫక్రీద్దీన్‌లను బంధించారు.
అయితే, వారి అనుచరులతో పాటుగా మరో తీవ్రవాది అబూబక్కర్ జాడ కానరాలేదు. వీరి కోసం వేట తీవ్రంగానే సాగుతోంది. ఈ సమయంలో బ్లాక్ డేనుపురస్కరించుకుని రాష్ట్రంలో దాడులకు కుట్రలు జరిగిన సమాచారం పోలీసులను కలవరంలో పడేసింది. చొరబాటు: పది కిలోల అమ్మోనియంతోపాటుగా పేలుడుకు ఉపయోగించే పదార్థాలతో ముగ్గురు తీవ్ర వాదులు రాష్ట్రంలోకి చొరబడినట్లు నిఘా వర్గాలకు సమాచారం అందింది. తిరునల్వేలి, కోయంబత్తూరు, తిరుచ్చి, మదురై నగరాల్ని వీరు టార్గెట్ చేసి ఉన్నట్టుగా వచ్చిన సంకేతాలతో ఆ ప్రాంతాల్లో భద్రతను ఆరు అంచెలు పెంచారు. ఆలయాలు, ప్రార్థనా మందిరాలకు భద్రత కల్పించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాల్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జన సంచారం అధికంగా ఉండే ప్రాంతాల్లో మఫ్టీల్లో సిబ్బంది నిఘాను పర్యవేక్షిస్తున్నారు.
అలర్ట్: ఆ నాలుగు జిల్లాల్లోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేస్తూ ఎస్పీలకు డీజీపీ రామానుజం ఆదేశాలు జారీ చేశారు. దీంతో చెన్నైతోపాటుగా అన్ని జిల్లాల్లోనూ భద్రతను పెంచారు. రాష్ట్ర సరిహద్దుల్లో, ఆయా జిల్లా కేంద్రాల సరిహద్దుల్లో చెక్ పోస్టుల్ని ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ముమ్మరంగా చేపడుతున్నారు. బుధవారం నుంచి గురువారం రాత్రంతా వాహనాల తనిఖీలు సాగారుు. ఆలయాలకు వచ్చే భక్తులను, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లలో ప్రతి ప్రయాణికుడినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసినానంతరం అనుమతిస్తున్నారు. పార్శిల్ కేంద్రాల్లో బాంబ్, డాగ్ స్క్వాడ్‌ల ద్వారా తనిఖీలు చేశారు. చెన్నైలోని కోయంబేడు బస్టాండ్, సెంట్రల్ రైల్వే స్టేషన్, ఎగ్మూర్‌రైల్వే స్టేషన్, మీనంబాక్కం విమానాశ్రయాల్లో మూడు అంచెల భద్రతను కల్పించారు.
బ్లాక్ డేను పురస్కరించుకుని నిరసనలకు ముస్లిం సంఘాలు, పార్టీలు సన్నాహాలు చేస్తున్నారుు. ఈ నిరసనలకు పోలీసులు అనుమతి నిరాకరించారు. బాబ్రీ మసీదు పునరుద్ధరణ నినాదంతో ఈ నిరసనలు చేపట్టాలని ముస్లింలు ప్రయత్నం చేస్తున్నారు. తాంబరం పరిసరాల్లో అయితే, ఇవే నినాదాలతో పోస్టర్లు, చిన్న చిన్న ఫ్లెక్సీలు వెలిశాయి. వాటిని తొలగించేందుకు పోలీసులు సాహించడం లేదు. నిరసనల్ని అడ్డుకునేందుకు మాత్రం పోలీసులు సిద్ధంగానే ఉన్నారు. అయితే, ఈ పర్యాయం బ్లాక్ డే శుక్రవారం రావడంతో సున్నిత సమస్యను సామరస్య పూర్వకంగా ఎదుర్కొనేందుకు చర్యలు చేపట్టారు. పోలీసులు అడ్డుకున్నా, తాము మాత్రం శాంతియుత మార్గంలోనే నిరసన తెలియజేసి తీరుతామని కొన్ని సంఘాలు పేర్కొంటున్నాయి.
Advertisement
Advertisement