హిజ్రాలతో స్టెప్పులు వేయిస్తే కాని ... | Hijra steps at five star hotels in chennai | Sakshi
Sakshi News home page

హిజ్రాలతో స్టెప్పులు వేయిస్తే కాని ...

Published Sat, Feb 7 2015 10:47 AM | Last Updated on Tue, Oct 16 2018 7:27 PM

హిజ్రాలతో స్టెప్పులు వేయిస్తే కాని ... - Sakshi

హిజ్రాలతో స్టెప్పులు వేయిస్తే కాని ...

చెన్నై :  నగరంలో ఆస్తి పన్ను బకాయి వసూళ్లలో కార్పొరేషన్ అధికారులు రోజుకో వినూత్న పంథాను అనుసరిస్తున్నారు. నోటీసులిచ్చినా, దండోరా వేసినా స్పందించని స్టార్ హోటళ్ల యజమానుల్ని బెంబెలెత్తిస్తున్నారు. దండోరాతో పాటుగా హిజ్రాలతో నృత్యాలు చేయించే పనిలో పడ్డారు. రాష్ట్ర రాజధాని నగరం చెన్నై కార్పొరేషన్ పరిధిలోని స్టార్ హోటళ్లు, మాల్స్, అనేక ప్రైవేటు సంస్థలు ఆస్తి పన్నుల చెల్లింపులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. ఈ బకాయిలు పెరుగుతుండడం అధికారుల్లో ఆగ్రహాన్ని రేపుతోంది. నగరంలోని పదిహేను మండలాల పరిధుల్లో ఏ మేరకు ఏయే సంస్థలు బకాయిలు ఉన్నాయో వివరాల్ని సేకరించారు.
 
 ఆయా సంస్థలు, హోటళ్లు, మాల్స్‌ల పరువు బజారుకీడ్చే రీతిలో నోటీసులు జారీ చేశారు. అయినా, ఫలితం శూన్యం. ఆయా భవనాల ముందు దండోరా వేయిస్తూ, వారు ఉన్న బకాయిల వివరాల్ని వెల్లడిస్తూ వినూత్న పంథాలో పయనించారు. అధికారుల దండోరాకు మంచి స్పందన వచ్చిందని చెప్పవచ్చు. బకాయిలు ఉన్న వాళ్లందరూ ఉరకలు పరుగులతో ఆస్తి పన్ను చెల్లింపు మీద దృష్టిపెట్టారు. అయితే, కొన్ని బడా బాబులకు చెందిన హోటళ్లు, సంస్థలు నోటీసులిచ్చినా, దండోరా వేసినా స్పందించలేదు.
 
 స్టెప్పులతో..
 నోటీసులిచ్చినా, దండోరా వేసినా స్పందించిన యజమానుల పరువును మరింతగా బజారుకు లాగే రీతిలో కొత్త మార్గంలో పయనించేపనిలో అధికారులు పడ్డారు. శుక్రవారం నుంచి ఈ కొత్త పంథాను అనుసరిస్తున్నారు. దండోరా వేయిస్తూనే, కొందరు హిజ్రాలను నియమించుకుని, వారి ద్వారా ఆయా భవనాల ముందు స్టెప్పులు వేయించే పనిలో పడ్డారు. ఉదయం ఈక్కాడు తాంగల్‌లోని ఓ హోటల్ ముందు హిజ్రాలతో నృత్యం చేయిస్తూ, దండోరా వేయించారు. దీంతో ఆ యజమానుల్లో కలవారాన్ని రేపింది.

ఆగమేఘాలపై అక్కడిక్కడే తాము పన్ను చెల్లించాలని రూ.30 లక్షలకు గాను చెక్కును అధికారులకు అందజేశారు. ఇదే బాటలో ఇతర యాజమాన్యాల భరతం పట్టే విధంగా కార్పొరేషన్ అధికారులు ముందుకు కదిలారు. శుక్రవారం ఒక్క రోజు కేవలం 13వ డివిజన్‌లో మాత్రం రూ.కోటి 63 లక్షలు ఆస్తి పన్ను వసూలైంది. కోయంబేడు, మదురవాయిల్ పరిసరాల్లో నీటిపన్ను వసూళ్లు రూ.33 లక్షలు రావడం విశేషం.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement