ముఖ్యమంత్రి నివాసం ఎదుట ధర్నా
Published Sun, Jan 19 2014 11:34 PM | Last Updated on Wed, Apr 3 2019 8:54 PM
ఘజియాబాద్: పోలీసులు తమపై నమోదు చేసిన కేసులను తక్షణం ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని హిందూ రక్షాదళ్ కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ మేరకు వాళ్లు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఘజియాబాద్ నివాసం ఎదుట ఆదివారం ఆందోళనకు దిగారు. ఆమ్‌ఆద్మీ పార్టీ (ఆప్) స్థానిక కార్యాలయంపై దళ్ కార్యకర్తలు ఈ నెల ఎనిమిదిన దాడి చేశారు. దీంతో ఆప్ చేసిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు హిందూ రక్షాదళ్ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ కేసులో తమ కార్యకర్తలపై మోపిన అభియోగాలన్నీ అబద్ధాలని ఆందోళనకారులు స్పష్టం చేశారు. ఉదయం తొమ్మిది గంటలకు కేజ్రీవాల్ నివాసం ఎదుట ఆందోళన మొదలుపెట్టిన దళ్ కార్యకర్తలు ముఖ్యమంత్రితో భేటీ అవుతామంటూ భద్రతా సిబ్బందితో వాదనకు దిగారు. ఈలోగా అదే అపార్టుమెంట్ నుంచి కిందికి వచ్చి కారులో కూర్చున్న కేజ్రీవాల్‌ను అడ్డుకొని ఆప్ వ్యతిరేక నినాదాలు చేశారు. దీంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.
ముఖ్యమంత్రి ధర్నా నేపథ్యంలో ఆంక్షలు
తాను సూచించిన పోలీసులపై చర్య తీసుకోవడానికి ఉన్నతాధికారులు తిరస్కరించడాన్ని నిరసిస్తూ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ధర్నాకు సిద్ధమవుతుండడంతో న్యూఢిల్లీ జిల్లాలో నిషేధాజ్ఞలు విధించారు. వీటి వల్ల ఏవైనా ఇబ్బందులు వస్తే స్థానిక ఎస్‌హెచ్‌ఓ లేదా డీసీపీని సంప్రదించాలని ఉన్నతాధికారులు కోరారు. అయితే గణతంత్ర వేడుకల కోసమే ఈ నిషేధాజ్ఞలు విధిస్తున్నామని పోలీసుశాఖ అధికార ప్రతినిధి రాజన్ భగత్ వివరణ ఇచ్చారు. దక్షిణఢిల్లీ వ్యభిచార గృహాలపై దాడి చేయాలన్న రాష్ట్ర న్యాయశాఖ మంత్రి సోమ్‌నాథ్ భారతి ఆదేశాలను పోలీసులు ఖాతరు చేయకపోవడంపై వివాదం చెలరేగడం తెలిసిందే. పోలీసుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండేతో శుక్రవారం భేటీ అయి ఫిర్యాదు చేశారు. హోంశాఖ నుంచి తగిన స్పందన రాకపోవడంతో సోమవారం ధర్నాకు దిగుతామని ఆప్ ప్రకటించింది. రాష్ట్ర మహిళా, శిశు అభివృద్ధిశాఖ మంత్రి రాఖీబిర్లాతో సాగర్‌పూర్‌లో ఘర్షణకు దిగిన పోలీసులపైనా చర్యలు తీసుకోవాలని ఆప్ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది.
Advertisement