నాయికలే దెయ్యాలుగా..
ఇంతకు ముందు అందంగా కనిపించడానికి
తాపత్రయపడే నాయికలు ఇప్పుడు అందవికారంగా, భయంకరంగా దెయ్యాలుగా మారడానికి తహతహలాడుతున్నారని చెప్పక తప్పని పరిస్థితి. ప్రస్తుతం హార్రర్ చిత్రాలతో వెండితెర దద్దరిల్లిపోతోంది. ఈ తరహా చిత్రాల్లో ఇంతకు ముందు చిన్నా చితక తారలు నటించేవారు. ఎందుకంటే ఇలాంటి కథా చిత్రాలకు ఇమేజ్‌తో పని ఉండదు కనుక. అయితే దెయ్యం ఇతివృత్తాలతో రూపొందిన చిత్రాలు నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తుండడంతో హార్రర్ చిత్రాల జోరు పెరిగింది. ప్రముఖ కథానాయకులు ముఖ్యంగా కథానాయికలు ఆత్మ, ప్రేతాత్మలుగా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు.
చంద్రముఖితో బలంగా బాటలు
నిజానికి హార్రర్ చిత్రాల రూపకల్పన అనేది ఆది నుంచి ఉన్నా తమిళంలో సూపర్‌స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి తరువాత ఈ తరహా చిత్రాల హోరు పెరిగిందని చెప్పవచ్చు. చంద్రముఖి చిత్రంలో జ్యోతిక దెయ్యం పాత్రలో బీభత్స నటన ఆ చిత్ర విజయానికి చాలా హెల్ప్ అయ్యిందని చెప్పడం అతిశయోక్తి కాదు. చంద్రముఖి చెన్నైలోని శాంతి ధియోటర్‌లో 804 రోజులు ఆడిందన్నది గమనార్హం.ఆ తరువాత ఈరం, లారెన్స్ నటించిన ముని, కాంచన, విజయ్‌సేతుపతి నటించిన పిజ్జా, యామిరుక్కభయమే వంటి చిన్న చిత్రాలు పెద్ద విజయాలు సాధించడంతో కోలీవుడ్‌లో హార్రర్ చిత్రాల హవా పెరిగింది.
అరణ్మణై, కాంచన-2.చిత్రాలు కలెక్షన్లు కొల్లగొట్టాయి. విశేషమేమిటంటే చంద్రముఖి, అరణ్మణై, కాంచన-2 చిత్రాలలో జ్యోతిక, హన్సిక, తాప్సీ, నిత్యామీనన్ వంటి ప్రముఖ హీరోయిన్లు దెయ్యాలుగా నటించి సక్సెస్ అవ్వడంతో ఇప్పుడు ఇతర ప్రముఖ నాయికలు దెయ్యాలుగా మారడానికి ఆసక్తి చూపుతున్నారు. ఇప్పుడు మాయ చిత్రంతో నయనతార,షావుకార్ పేటై చిత్రంలో రాయ్‌లక్ష్మి, అరణ్మణై-2 చిత్రంలో హన్సిక, త్రిష, తాజాగా నాయకి నంటూ మరో సారి త్రిష దెయ్యం అవతారం ఎత్తుతున్నారు. ప్రస్తుతం పదికి పైగా హార్రర్ చిత్రాలు విడుదలకు సిద్ధం అవుతున్నాయంటే ఈ చిత్రాలకు ప్రేక్షకుల మధ్య ఎంత ఆదరణ ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ప్రముఖ నటుడు కమలహాసన్ అంతటి వారే ప్రస్తుతం దెయ్యం చిత్రాల మార్కెట్ న డుస్తోందని అన్నారంటే వాటి ప్రభావం ఎంత ఉందో స్పష్టం అవుతోంది. ఒకప్పుడు అనుబంధాలు, ఆత్మీయతలతో కూడిన కుటుంబ కథా చిత్రాలను ప్రేక్షకులు ఆదరించారు.ఆ తరువాత ప్రేమ కథా చిత్రాలకు బ్రహ్మరథం పట్టారు. ఆపై యాక్షన్‌తో కూడిన కమర్షియల్ చిత్రాలు అలరించాయి. ఇప్పుడు హార్రర్ చిత్రాలు హోరెత్తుతున్నాయి. దీన్నే మనోళ్లు ట్రేండ్ అంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదనుకుంటా.