10 రోజులు.. రూ.4 కోట్లు | huge response to Underground Metro in bangalore | Sakshi
Sakshi News home page

10 రోజులు.. రూ.4 కోట్లు

Published Tue, May 10 2016 3:57 PM | Last Updated on Sun, Apr 7 2019 3:24 PM

10 రోజులు.. రూ.4 కోట్లు - Sakshi

10 రోజులు.. రూ.4 కోట్లు

బెంగళూరు : భూగర్భ మెట్రోకు ఆదరణ భారీగా పెరుగుతోంది. దీంతో ఈస్ట్-వెస్ట్ కారిడార్ మార్గంలో గతంతో పోలిస్తే నమ్మ మెట్రోకు ప్రయాణికుల సంఖ్య పెరగడమే కాకుండా ఆదాయమూ గణనీయంగా పెరుగుతోంది. మొత్తం 17 స్టేషన్లు కలిగిన బయ్యపనహళ్లి (ఈస్ట్)-నాయండ హళ్లి (వెస్ట్) మార్గంలో గత నెల 30 నుంచి భూగర్భంలోని ఐదు స్టేషన్ల గుండా నమ్మమెట్రో ప్రయాణం అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. మొదటి రోజు నుంచి సోమవారం వరకూ రోజుకు సగటున 90 వేల మంది చొప్పున తొమ్మిది  లక్షల మంది ప్రయాణికులు నమ్మ మెట్రోలో ప్రయాణం చేశారు.

దక్షిణ భారత దేశంలోనే భూగర్భ మెట్రో ప్రయాణం అందుబాటులోకి రావడం ఇదే మొదటిసారి. దీంతో భూగర్భంలో రైలు ప్రయాణాన్ని ఆస్వాదించడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దీంతో వారాంతాల్లో మెట్రో రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇదిలా ఉంటే రోజువారి ప్రయాణికులు కూడా బస్సు, ఆటోలు క్యాబ్‌లను వ దిలి మెట్రోలో ప్రయాణం చేస్తున్నారు. 18.10 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు నలభై నిమిషాల్లోపే రూ.40 ఖర్చుతో చేరుకోవచ్చు. మరోవైపు ఈ ఈస్ట్‌వెస్ట్‌కారిడార్ మార్గంలో అనేక ప్రైవేటు, ప్రభుత్వ కార్యాలయాలతో పాటు నగర కేంద్రబిందువైన మెజెస్టిక్ కూడా అందుబాటులోకి వస్తుంది. దీంతో విద్యార్థులు, ఉద్యోగులు ఎక్కువగా ఈ మెట్రోలో ప్రయాణించడానికి ఆసక్తి చూపుతున్నారు.

దీంతో గతంలో పోలిస్తే భూగర్భ మెట్రో రైలు అందుబాటులోకి రావడంతో ఈస్ట్ వెస్ట్ కారిడార్‌లో ప్రయాణం చేసే వారి సంఖ్య రోజుకు 30 శాతం పెరిగినట్లు బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్ లిమిటెడ్ (బీఎంఆర్‌సీఎల్) అధికారులు చెబుతున్నారు. మొత్తంగా మెట్రోలో సగటున రోజుకు 96 వేల మంది ప్రయాణం చేస్తుండటంతో నమ్మ మెట్రో సంస్థకు ప్రతి రోజూ దాదాపు రూ.40 లక్షల ఆదాయం వస్తోంది. ఇదిలా ఉండగా ఈస్ట్‌వెస్ట్‌కారిడార్‌లో ప్రస్తుతం 15 రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రతి రైలు 10 నిమిషాలకొకసారి అందుబాటులోకి వస్తోంది. ప్రయాణికుల సంఖ్య పెరుగుతుండటం వల్ల రైళ్ల సంఖ్యను పెంచి తద్వారా ప్రయాణికులకు మెట్రో రైలు అందుబాటులోకి వచ్చే సమయాన్ని ఆరు నిమిషాలకు తగ్గించాలని తాము ఆలోచిస్తున్నట్లు బీఎంఆర్‌సీఎల్ అధికారిక ప్రతినిధి యూ.ఏ వసంతరావ్ తెలిపారు. ఈ విషయమై తమ సాంకేతిక సిబ్బందితో చర్చించి త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
 
 బీఎంటీసీ...‘మెట్రో’కు ఒకటే కార్డు...
భూగర్భ మెట్రో అందుబాటులోకి వచ్చిన తర్వాత స్మార్ట్‌కార్డులు కొనేవారి సంఖ్య కూడా పెరుగుతోంది. బీఎంఆర్‌సీఎల్ రోజుకు కనిష్టంగా 2,300 స్మార్ట్‌కార్డులను గత పది రోజులుగా అమ్ముతోంది. గతంలో ఈ సంఖ్య 800లుగా ఉండేది.  మొత్తంగా నమ్మ మెట్రో సర్వీసులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ  ఇప్పటి వరకూ 1.75 లక్షల స్మార్ట్‌కార్డులు అమ్ముడుపోయాయి. ఇదిలా ఉండగా ఫీడర్ సర్వీసుల ద్వారా మెట్రో స్టేషన్లకు బీఎంటీసీ బస్సులో వచ్చి అటు పై మెట్రోలో ప్రయాణం చేసే వారి సంఖ్య కూడా రోజురోజుకూ పెరుగుతోంది. దీంతో అటు బీఎంటీసీతో పాటు మెట్రోలో కూడా చెల్లుబాటు అయ్యేలా ఇంటెలిజెంట్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం (ఈటీఎస్) విధానంలో రూపొందించిన స్మార్ట్‌కార్డులను ప్రవేశ పెట్టనున్నారు.

బయ్యపనహళ్లి నుంచి ఎం.జీ రోడ్డుకు మెట్రో రైలు సర్వీసులు ప్రారంభమైన సమయంలో ఇలాంటి కార్డులను ప్రవేశపెట్టినా ప్రయాణికుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో ఈటీఎస్ స్మార్ట్ కార్డులను రద్దు చేసి కేవలం మెట్రోలో మాత్రమే చెల్లుబాటు అయ్యే స్మార్ట్‌కార్డులను అనుమతిస్తూ వచ్చారు. అయితే ప్రయాణికుల నుంచి వినతులు అందడంతో తిరిగి ఈటీఎస్ స్మార్ట్ కార్డులను ప్రవేశ పెట్టాలని బీఎంఆర్‌సీఎల్, బీఎంటీసీ అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం నగరంలోని నాలుగువేల బస్సుల్లో ఎలక్ట్రానిక్ టికెట్ మిషన్ (ఈటీఎం)లు ఉండటంతో సదరు స్మార్ట్ కార్డు మెట్రోలో కాకుండా కేవలం బీఎంటీసీ బస్సు ప్రయాణికులకు కూడా ఉపయోగపడుతుందనేది అధికారుల ఆలోచన. ఈమేరకు బెంగళూరు నగరాభివృద్ధి శాఖ మంత్రి కే.జే జార్జ్ ఆధ్వర్యంలో త్వరలో జరిగే ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నారని బీఎంటీసీ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.


తేదీ        ఆదాయం
ఏప్రిల్30    93,526
మే 1    1,23,789
మే 2    96,159
మే 3    94,680
మే 4    93,882
మే 5    93,608
మే 6     95,526
మే 7     1,09,00
మే 8    1,04,908
మే 9    90,000

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement