ఇంట్లో ఉన్న భార్య, ప్రియుడ్ని పోలీసులకు పట్టించిన భర్త.
టీనగర్: నాట్రాంపల్లి సమీపాన ఇంట్లో ఉన్న భార్య, ప్రియుడ్ని భర్త పోలీసులకు పట్టించిన సంఘటన జరిగింది. వేలూరు జిల్లా, నాట్రాంపల్లి సమీపాన మూక్కనూరు అనే గ్రామం ఉంది. ఈ ఊరికి చెందిన కుమార్(28)కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. ఐదేళ్ల కుమార్తె ఉంది. వివాహమైన కొద్ది రోజుల్లో కుమార్ సింగపూర్‌కు వెళ్లాడు. ఇలావుండగా అతని భార్యకు, అదే ప్రాంతానికి చెందిన దేవేంద్రన్(23) అనే యువకుడితో పరిచయం ఏర్పడి, వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారం కుమార్ తల్లిదండ్రులకు తెలిసింది.
దీంతో సింగపూర్‌లోని తమ కుమారుడికి విషయం తెలిపారు. దీంతో కుమార్ వెంటనే సొంతవూరికి వచ్చాడు. తన భార్యతో యువకుడితో సంబంధాన్ని వదులుకోమని తెలిపాడు. అయినప్పటికీ భార్య వినకపోవడంతో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆగ్రహించిన భార్య విలగనత్తంలోని తన పుట్టింటికి వెళ్లింది. తర్వాత భార్యను తీసుకువచ్చేందుకు కుమార్ వెళ్లలేదు. కొద్దిరోజుల్లో కుమార్ సేలంలోని బేకరీలో పనికి చేరాడు.
ఇదే సమయంలో కూక్కనూరు నుంచి దేవేంద్రన్ తరచూ విలగనత్తంకు వెళుతూ వచ్చాడు. ఈ వ్యవహారం కుమార్‌కు తెలిసింది. ఇద్దరినీ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకునేందుకు నిర్ణయించాడు. ఆదివారం దేవేంద్రన్‌పై నిఘా ఉంచాడు. రాత్రి 11 గంటల సమయంలో తన భార్య ఇంట్లో దేవేంద్రన్ ఉన్న విషయం తెలుసుకుని, ఇంటి బయట తాళం వేశాడు. తర్వాత బిగ్గరగా కేకలు వేసి ఊరి ప్రజలను రప్పించాడు.
వారి సమక్షంలో ఇద్దరినీ అదుపులోకి తీసుకుని నాట్రాంపల్లి పోలీసు స్టేషన్‌లో అప్పగించాడు. ఇది క్లిష్టమైన కేసు కావడంతో పోలీసులు జాగ్రత్తగా వ్యవహరించారు. ప్రస్తుతం ఆమె గర్భవతిగా ఉండడంతో కుమార్‌ను చట్టపూర్వక చర్యలు తీసుకోమని చెప్పి పంపివేసినట్లు తెలిసింది. ఈ సంఘటన మూక్కనూరు, విలగనత్తంలలో సంచలనం కలిగించింది.