
గ్లామర్‌కు ఓకే
ప్రేమ నుంచి తప్పించుకోవడం ఎవరి తరం కాదు. కొందరి విషయాన్ని బాహాటంగా చెప్పినా మరికొందరు బయటకు పొక్కకుండా జాగ్రత్త పడుతుంటారు. నటి రెజినా మాత్రం నేనిప్పుడు ప్రేమిస్తున్నాను అంటున్నారు. ఈ డేరింగ్ బ్యూటీ సంగతేమిటో చూద్దామా. కోలీవుడ్‌లో కండనాళ్ ముదల్ చిత్రంలో నటి లైలాకు చెల్లెలిగా 2005లో పరిచయం అయిన నటి రెజినా, ఆ తరువాత అళగియ అసూర, పంచామృతం, కేడి బిల్లా కిల్లాడి రంగా, నిర్ణయం, ఇటీవల విడుదలైన రాజతందిరం తదితర చిత్రాల్లో నాయకిగా నటించారు. ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా రైజింగ్‌లో ఉన్న రెజినాతో చిన్న భేటీ....
ప్రశ్న:తమిళంలో సీజన్ చూసి నటిస్తున్నారే?
జవాబు: చాలామంది ఈ ప్రశ్న అడుగుతున్నారు. నిజం చెప్పాలంటే ఇబ్బడి ముబ్బడిగా అవకాశాలు రావాలి, ఎడాపెడా నటించేయాలని నేను కోరుకోవడం లేదు. మరో విషయం ఏమిటంటే నేనిప్పటి వరకు తమిళంలో నటించింది ఆరు చిత్రాలే. దీంతో మళ్లీ తమిళంలో నటిస్తారు అన్న ప్రశ్న చాలామంది నుంచి వస్తోంది. కారణం నేను ఎంచుకుంటున్న చిత్రాల పాత్రలు అలాంటివి. ప్రస్తుతం స్టూడియో గ్రీన్ సంస్థలో చేస్తున్నాను. అలాగే తెలుగులో సుబ్రమణ్యం ఫర్ సేల్ అనే చిత్రం చేస్తున్నాను.
ప్రశ్న: మూస పాత్రలు అని బోర్‌గా ఫీలైన సందర్భాలున్నాయా?
జవాబు: కేడి బిల్లా కిల్లాడి రంగా తరువాత తమిళంలో అలాంటి అవకాశాలే రావడంతో అంగీకరించలేదు. తమిళ ఆడియన్స్ హోమ్లీ పాత్రలనే ఇష్టపడతారు. ఇప్పుడు అలాంటి పాత్రలు వరిస్తున్నాయి.
ప్రశ్న: సైకలాజి చదివారట. నటిగా మీకది ఎంతవరకు హెల్ప్ అవుతుంది?
జవాబు: చాలా హెల్ప్ అవుతోంది. రకరకాల మనస్తత్వాల మనుషుల మయం సినిమా రంగం. వారి ఆలోచనలు, ఆచరణలు భిన్నంగా ఉంటాయి. అలాంటి వారిని అర్థం చేసుకుని ప్రవర్తించడానికి నేను చదివిన సైకాలజీ చాలా ఉపయోగపడుతుంది.
ప్రశ్న: కమర్షియల్ చిత్రాలే మీ లక్ష్యమా?
జవాబు: అలాగని ఏమీ లేదు. ఫ్యామిలీ కథా చిత్రాల్లోనూ నటిస్తాను. అదే సమయంలో కమర్షియల్ కథలతో రూపొందే మాస్ చిత్రాలు చేస్తాను.
ప్రశ్న: మరి గ్లామర్ విషయం ఏమిటి?
జవాబు: కథ హద్దులు మీరని గ్లామర్‌కు నేను ఓకే. సినిమాకు గ్లామర్ కూడా అవసరం అని నా అభిప్రాయం. పరిమితులు దాటని వరకు గ్లామర్‌గా నటించడానికి అభ్యంతరం లేదు.
ప్రశ్న: టాలీవుడ్‌లో మీకో నిక్‌నేమ్ ఉందట?
జవాబు: అవును. అక్కడి అభిమానులు ముద్దుగా మెగా హీరోయిన్ అని పిలుస్తుంటారు. అలాంటి అభిమానుల ఆదరణ చివరి వరకు ఉండాలని ఆశిస్తున్నాను.
ప్రశ్న: మీలో గాయని కూడా ఉన్నారట?
జవాబు: సంప్రదాయబద్ధంగా శిక్షణ పొందకపోయినా కొంచెం బాగానే పాడగలను. మీకో విషయం తెలుసా రాజతందితరం చిత్రంలో నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పుకున్నాను. తెలుగులోనూ చెప్పాలని ఉన్నా బిజీ కారణంగా అది సాధ్యం కావడం లేదు.
ప్రశ్న: చివరి ప్రశ్న టాలీవుడ్ హీరో ఒకరితో ప్రేమలో పడ్డారట?
జవాబు: ఇప్పటి వరకు నాపై ఎలాంటి గ్యాసిప్స్ రాలేదు. అలాంటిది ప్రశ్న ఎలా అడిగారో తెలియదు. నిజానికి నేని ప్పటి వరకు ఎవరిని ప్రేమించలేదు.