అప్పట్లో నేను అందగత్తెను కాను
బాల్యం,యుక్త, ప్రౌడ, వృద్ధ ఇలా ఆడ అయినా, మగ అయినా వయసును బట్టి రూపం మారుతుంటుంది. ఇది కాలధర్మం. కొత్తగా చెప్పేది కాదు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే నటి శ్రీయ తన అందం గురించి, బాల్యం గురించి గుర్తు చేసుకున్నారు. ఈ ఉత్తరాది బ్యూటీకి ప్రస్తుతం తమిళంలో చిత్రాలు లేవు. అయినా శ్రీయను తమిళ ప్రేక్షకులు రెండు విషయాల్లో మరచిపోయే ప్రసక్తే లేదు. ఒకటి సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో శివాజి చిత్రంలో నటించడం,రెండు హాస్యనటుడు వడివేలు సరసన ఇంద్రలోకత్తిల్ నా అళగప్పన్ చిత్రంలో సింగిల్ సాంగ్‌కు చిందేయడం. వీటిలో మొదటిది ఆమెకు ప్లస్ కాగా, రెండవది పెద్ద మైనస్ అయ్యింది.టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అంటూ రౌండ్స్ కొట్టిన శ్రీయ మార్కెట్ ఆ మధ్య పూర్తిగా డల్ అయ్యింది.
మనం చిత్రంతో టాలీవుడ్‌లో మళ్లీ పుంజుకున్నా, కోలీవుడ్‌లో అలాంటి అవకాశం రాలేదు. అయితే బాలీవుడ్‌లో తాజాగా ఒక అవకాశం వచ్చింది. మలయాళం, తెలుగు, కన్నడం, తమిళం భాషల్లో మంచి విజయాన్ని సాధించిన దృశ్యం (తమిళంలో పాపనాశం) చిత్ర హిందీ రీమేక్‌లో మీనా, గౌతమి పోషించిన పాత్రను శ్రీయ చేస్తున్నారు. ఈ చిత్రం హిందీలో తనకు టర్నింగ్ ఇస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్న శ్రీయ ఇటీవల తనకెదురైన సంఘటన గురించి చెబుతూ పాఠశాలలో చదువుకునే రోజుల్లో తానసలు అందంగానే ఉండేదాన్ని కాదన్నారు. నూనె పెట్టిన తల, కళ్లద్దాల ముఖం అప్పట్లో ఇదీ నా రూపం అన్నారు. అలాంటిది ఇటీవల తన స్కూల్ మేట్ ఒకరిని కలిశానని తెలిపారు. అయితే ఆమె నన్ను గుర్తు పట్టలేదని అన్నారు. ఆ తరువాత స్కూల్ రోజులను గుర్తు చేస్తే ఆమె నువ్వా అంటూ ఆశ్చర్యపోయిందని శ్రీయ అన్నారు.