పింప్రి, న్యూస్‌లైన్: కాంగ్రెస్ పార్టీ ప్రధాని అభ్యర్థిని తాను కాదని, అందుకు అన్నివిధాలా అర్హుడైన వ్యక్తి రాహుల్ గాంధీయేనని, అదే కాంగ్రెస్‌లోని అందరి అభిప్రాయమని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. పుణే కాంగ్రెస్ అభ్యర్థి విశ్వజీత్ కదమ్ తరఫున ప్రచారం చేసేందుకు నగరానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడుతూ పై వాఖ్యలు చేశారు. రాబోయే ఎన్నికల్లో తిరిగి యూపీఏ కూటమికే ప్రజలు పట్టం కడతారని జోస్యం చెప్పారు. ప్రధానిని ఎన్నుకునే అధికారం పార్లమెంటు సభ్యులందరికీ ఉన్నప్పటికి సోనియా నిర్ణయానుసారంగానే పార్టీ సభ్యులు నడుచుకుంటారని, రాహుల్ గాంధికి లేని అర్హతలు ఏంటో తమకు కనిపించడం లేదన్నారు.
విద్యావంతుడు, నీతిమంతుడు, తెలివితేటలున్న రాహుల్ ప్రభుత్వాన్ని నడిపంచడంలో దిట్ట అని కితాబిచ్చారు. 2004లో కూడా బీజేపీ.. భారత్ వెలిగిపోతోం దంటూ ప్రచారం చేసుకున్నారని, ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందేనని, ఈసారి కూడా బీజేపీ చెప్పుకుంటున్న గొప్పలన్నీ ఎన్నికల తర్వాత పటాపంచలవుతాయని, తిరిగి యూపీఏ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందన్నారు. అప్పట్లో వాజ్‌పేయి సభలకు జనం భారీగా హాజరయ్యేవారని, ఇప్పుడు మోడీ సభలకు హాజరవుతున్నారని, చివరకు తమ కష్టాలను తీర్చే కాంగ్రెస్ పార్టీకే వారు ఓటేస్తారని చెప్పారు.
మోడీపై వ్యంగ్యాస్త్రాలు..
గుజరాత్ అల్లర్లకు సంబంధించి నరేంద్ర మోడీకి ఇప్పటి వరకు ఏ కోర్టూ క్లీన్‌చిట్ ఇవ్వలేదని, ఇప్పటికీ స్పెషల్ ఇన్వెస్ట్‌గేషన్ టీమ్‌లు ఆ కేసు గురించి దర్యాప్తు చేస్తూనే ఉన్నాయన్నారు. అల్లర్ల భాధితులు ఇప్పటికీ కోర్టుల్లో దావాలు వేస్తున్న సంగతి పాపం మోడీకి తెలియదు కాబోలంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అప్పటి అల్లర్లను ఉద్దేశించి వాజ్‌పేయి.. రాజధర్మాన్ని పాటించాలని సలహా ఇచ్చిన సంగతి మోడీకి గుర్తు లేదా? అన్ని ప్రశ్నించారు. ప్రధాని అయ్యే అభ్యర్థి మచ్చలేని మనిషిగా ఉండాలన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోను మోడీ.. మోసపూరిత మేనిఫెస్టుగా పేర్కొనడాన్ని తప్పుబడుతూ 128 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను మోసగించలేదని, అనేక వాగ్దానాలను నెరవేర్చిందన్నారు.
అంతర్గత పోరు వద్దు...
కాంగ్రెస్-ఎన్సీపీ కార్యకర్తల మధ్య మనస్పర్థలు చోటుచేసుకోవద్దని, ఇరు పార్టీల కార్యకర్తలు కలసికట్టుగా ప్రచారంలో పాల్గొనాలని షిండే కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో మంత్రులుగా పని చేస్తున్న తనకు, శరద్ పవార్‌కు మధ్య ఎప్పుడు ఎటువంటి మనస్పర్థలు రాలేదన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తూనే రామమందిరం నిర్మిస్తామని, రాముని ముందే ప్రతిజ్ఞ చేశారని, అధికారంలోకి రాగానే మర్చిపోయారని ఎద్దేవా చేశారు. అందుకే రాముడు శపించడంతో అధికారానికి దూరమయారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆహరభద్రత, మహిళా సంరక్షణ చట్టాన్ని తెచ్చామని, మోడీ కలలుగంటున్న ప్రధాని పదవి.. కలగానే మిగిలి పోతుందని, అశ పడడం తప్పు కాకపోయినా అత్యాశ తగదని చురకలంటించారు.
ఈ ప్రచారంలో రాష్ట్ర మంత్రి పతంగ్‌రావు కదమ్, నగర మేయర్ చంచలా కోర్రే, ఉప మేయర్ బందు గైక్వాడ్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు అడ్వొకేట్ అభయ్ ఛాజేడ్, ఎమ్మెల్యేలు శరద్ రణపిస్, మోహన్ జోషి, రమేష్ బాగవే, బాపు పరారే, జయకుమార్ గోరే, మాజీ ఎమ్మెల్యే చంద్రకాంత్ ఛాజేడ్, బాలాసాహెబ్ శివార్కర్, కమల డోలే పాటిల్, రతన్ లాడ్ సోనాగ్రా, గోపాల్ చెవారీ తదితరులు పాల్గొన్నారు.
ప్రధాని అభ్యర్థిని నేను కాను
Published Fri, Apr 4 2014 11:12 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement