పన్నీరు సెల్వం వ్యూహాలు ఏంటో తెలియవు
చెన్నై: తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వ్యూహాలేంటో తనకు తెలియవని ప్రతిపక్ష నేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ చెప్పారు. సోమవారం స్టాలిన్ సెక్రటేరియట్‌కు వచ్చారు. ఇదే రోజు పన్నీరు సెల్వం కూడా సెక్రటేరియట్‌కు వచ్చారు. వీరిద్దరూ భేటీ అవుతారని తొలుత వార్తలు వచ్చాయి. అయితే అన్నా డీఎంకేను చీల్చేందుకు డీఎంకే కుట్రపన్నిందని, పన్నీరు సెల్వం ఆ పార్టీకి సన్నిహితంగా ఉంటున్నారని శశికళ ఆరోపించడంతో స్టాలిన్ వెనక్కు తగ్గినట్టు సమాచారం.
సెక్రటేరియట్‌లో మీడియా ప్రతినిధులతో మాట్లాడిన స్టాలిన్.. అన్నా డీఎంకే వ్యవహారంతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ సంక్షోభంలో పన్నీరు సెల్వం ఏం చేస్తారు, ఆయన వ్యూహాలు ఏంటన్నవి తనకు తెలియవని స్టాలిన్ చెప్పారు. శశికళను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న స్టాలిన్ తొలుత సెల్వంకు మద్దతు ఇస్తామనే అర్థం వచ్చేలా సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత త్వరలోనే డీఎంకే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.