
'వాళ్లను చూస్తుంటే రక్తం మరిగిపోతోంది'
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ హత్య అనంతరం చోటుచేసుకున్న సిక్కుల ఊచకోత అంశాన్ని బీజేపీ సహా ఇతర పార్టీలు రాజకీయ లబ్ధి కోసమే వాడుకున్నాయే తప్ప, బాధితులకు న్యాయం చేసే ప్రయత్నం చేయలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
1984 అల్లర్లు జరిగి 31 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన సిక్కుల కుటుంబాలకు కేజ్రీవాల్ చెక్కులు అందజేశారు. ఒక్కో కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడుతూ నాడు ఊచకోత బాధితులకు న్యాయం దొరికేదుంటే, 2002లో గుజరాత్ అల్లర్లు, తాజాగా దాద్రీ సంఘటన లాంటి ఉదంతాలు చోటుచేసుకుని ఉండేవికావన్నారు.
'అల్లర్లు జరిగి 31 ఏళ్లు గడిచాయి. సిక్కులను దారుణంగా చపినవాళ్లు దర్జాగా తిరుగుతున్నారు. వాళ్లను చూస్తే మన రక్తం మరిగిపోతుంది. ఇంకా ఘోరమైన విషయమేమంటే ఈ ఏడాది ప్రారంభంలో ఆమ్ ఆద్మీపార్టీ అధికారంలోకి వచ్చాకగానీ 1984 అల్లర్లపై సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్)ను ఏర్పాటుచేయలేదు' అని కేజ్రీవాల్ మండిపడ్డారు. ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్లలో దాదాపు 3 వేల మంది హత్యకుగురైన సంగతి తెలిసిందే.